నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశ్రమల భాగస్వామ్యంతో ఐటీఐలను బలోపేతం చేస్తున్న పీఎం-సేతు


రూ. 735.70 కోట్ల విలువైన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలకు అయిదో జాతీయ సారథ్య సంఘం ఆమోదం

ఈ ఆమోదంతో 9 ఐటీఐ క్లస్టర్లలో పీఎం-సేతు కింద రూ. 2,171 కోట్లకు చేరిన మొత్తం పెట్టుబడి

దేశవ్యాప్తంగా ఆధునిక, పరిశ్రమల నేతృత్వంలోని, భవిష్యత్ సన్నద్ధ ఐటీఐల ఏర్పాటుకు ఊతం

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2026 1:25PM by PIB Hyderabad

నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన.. పీఎం-సేతు (ప్రధానమంత్రి - ఉన్నతీకరణతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన దిశగా ఐటీఐల పరివర్తన పథకం) అయిదో జాతీయ సారథ్య సంఘం (ఎన్ఎస్‌సీ) సమావేశాన్ని నిన్న నిర్వహించారు.

శిక్షణ వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డీజీటీ) డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్, ఎంఎస్‌డీఈ అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు శ్రీమతి జి. మధుమితా దాస్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి మానసీ సహాయ్ ఠాకూర్, మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలోని ఐటీఐ క్లస్టర్ల కోసం.. మొత్తం రూ. 735.70 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలను (ఎస్ఐపీ) జాతీయ సారథ్య సంఘం ఆమోదించింది. భారతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను అత్యంత సమర్థంగా తీర్చిదిద్దే ప్రక్రియకు ఊతమిచ్చే క్రియాశీల ముందడుగు ఇది.

ఐటీఐ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు పరిశ్రమలు, సంస్థాగత భాగస్వాముల సహకారం, భవిష్యత్ సన్నద్ధంగా యువతను తీర్చిదిద్దే కోర్సులను ప్రవేశపెట్టడం, మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను మరింత సమన్వయం చేయడం ద్వారా... ఈ ప్రణాళికలు పీఎం-సేతు పారిశ్రామిక భాగస్వామ్య విధానాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

తాజా అనుమతులతో 9 ఐటీఐ క్లస్టర్ల పరిధిలో పీఎం-సేతు కింద మంజూరైన పెట్టుబడులు రూ. 2,171 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా ఐటీఐలను ఆధునికంగానూ, పారిశ్రామిక భాగస్వామ్యంతో నడిచేవి గా, భవిష్యత్ సంసిద్ధంగా తీర్చిదిద్దే ప్రక్రియకు ఇది ఊతమిస్తుంది.

మూడు ఐటీఐ క్లస్టర్లలో రూ. 735.70 కోట్ల పెట్టుబడులు

అయిదో జాతీయ సారథ్య సంఘం కింది వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలను ఆమోదించింది:

రాజస్థాన్– రూ.241.00 కోట్లు

భివాడి ఐటీఐ క్లస్టర్ కోసం మెసర్స్ హెచ్.జి. ఇన్ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్ (హెచ్‌జీఐఈఎల్) సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు జాతీయ సారథ్య సంఘం ఆమోదం తెలిపింది.

భివాడీలోని ప్రభుత్వ ఐటీఐ ఈ క్లస్టర్‌లో ప్రధాన కేంద్రం (హబ్)గా ఉండగా.. అల్వార్, నీమ్రానా, తిజారా, కిషన్‌గఢ్ బాస్ ప్రభుత్వ ఐటీఐలు దాని అనుసంధాన శాఖలు (స్పోక్స్)గా కొనసాగుతాయి.

తెలంగాణ – రూ. 254.30 కోట్లు

మేడ్చల్ ఐటీఐ క్లస్టర్ కోసం మెసర్స్ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికను జాతీయ సారథ్య సంఘం ఆమోదించింది. కార్యాచరణ, ఆర్థిక అంశాలపై స్పష్టీకరణలు అవసరమైనందున.. గత నాలుగో జాతీయ సారథ్య సంఘం సమావేశంలో ఇది వాయిదా పడింది.

ఈ క్లస్టర్‌లో ఐటీఐ మేడ్చల్ ప్రధాన కేంద్రం (హబ్)గానూ.. ఆల్వాల్, శామీర్ పేట, కుకునూరుపల్లి, సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐలు దాని అనుసంధాన శాఖలు (స్పోక్స్)గానూ ఉంటాయి.

కోర్సు నిర్మాణం, ఆర్థిక గణనలు, అర్హత, డాక్యుమెంటేషన్, సివిల్ పనులపై ప్రధాన పారిశ్రామిక భాగస్వామి నుంచి స్పష్టమైన వివరణలు అందిన అనంతరం.. కమిటీ వాటిని పరిశీలించి సంతృప్తికరంగా భావించి, ఈ ప్రణాళికను ఆమోదించింది.

ఉత్తరప్రదేశ్ – రూ. 240.40 కోట్లు

మీరట్ ఐటీఐ క్లస్టర్ కోసం జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్‌డీసీ) సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ క్లస్టర్‌లో మీరట్‌లోని ప్రభుత్వ ఐటీఐ- సాకేత్ ప్రధాన కేంద్రం (హబ్)గానూ.. ఘాజియాబాద్, హాపూర్, గౌతమబుద్ధ నగర్, బాగ్‌పథ్ ప్రభుత్వ ఐటీఐ దానికి అనుసంధాన శాఖలు (స్పోక్స్)గానూ ఉంటాయి.

ఐటీఐల ఆధునికీకరణకు ఊతమిస్తున్న పారిశ్రామిక భాగస్వామ్యాలు

పరిశ్రమల నేతృత్వంలోని హబ్ అండ్ స్పోక్ క్లస్టర్ నమూనా ద్వారా.. ప్రభుత్వ ఐటీఐలను సమగ్రంగా సంస్కరించడమే లక్ష్యంగా చేపట్టిన పీఎం-సేతు అమలులో ఈ వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికల ఆమోదం కీలక మైలురాయి.

మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, ప్రస్తుత సదుపాయాల నవీకరణ, నూతన దీర్ఘకాలిక, స్వల్పకాలిక కోర్సులను పరిచయం చేయడం, నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం కావాల్సిన పెట్టుబడులను.. తాజాగా ఆమోదించిన ఈ ప్రణాళికలు సమకూరుస్తాయి. జాతీయ సారథ్య సంఘం పరిశీలనకు పంపడానికి ముందు.. సంబంధిత రాష్ట్ర సారథ్య సంఘాలు ఈ ఎస్ఐపీలను క్షుణ్ణంగా పరిశీలించి సిఫార్సు చేశాయి.

ఆమోదం పొందిన ఈ మూడు వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికల మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 735.70 కోట్లు. ఆధునిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగల సమర్థత ఉన్న సంస్థలుగా ఐటీఐలను తీర్చిదిద్దడం లక్ష్యంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక భాగస్వాముల మధ్య భాగస్వామ్యాన్ని ఈ ఉమ్మడి ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుంది.

మారుతున్న పారిశ్రామిక అవసరాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఉపాధి అవకాశాలకు అనుగుణంగా.. యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించేలా ఐటీఐల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ అనుమతులు ఎంతగానో దోహదం చేస్తాయి.

రాజస్థాన్ ప్రభుత్వం – హెచ్‌జీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్ – కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతా  మంత్రిత్వశాఖ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం (ఎస్‌హెచ్ఏ) ఈ సమావేశంలో ఒక కీలకమైన అంశం. రాజస్థాన్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యవస్థాపకతా శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ వర్మ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంతో పీఎం-సేతు కింద భివాడి క్లస్టర్ అమలు అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎస్‌హెచ్ఏను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా రాజస్థాన్‌ను నిలిచింది.

పీఎం-సేతు గురించి

పరిశ్రమలతో భాగస్వామ్యం, అధునాతన మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ స్థాయి శిక్షణ కార్యక్రమాలు, మెరుగైన ఉపాధి అవకాశాల ద్వారా- ఐటీఐ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక పథకం పీఎం-సేతు (ప్రధానమంత్రి - ఉన్నతీకరణతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన దిశగా ఐటీఐల పరివర్తన పథకం).

పరిశ్రమల భాగస్వామ్యంతో, క్లస్టర్ ఆధారిత విధానంలో ఈ పథకం అమలవుతుంది. ఇందులో ప్రధాన కేంద్రం (హబ్)గా ఒక ఐటీఐ, దానికి అనుసంధానమై శాఖలు(స్పోక్)గా పలు ఐటీఐలతో కూడిన వ్యవస్థ ఉంటాయి. ఈ విధానం ద్వారా సమన్వయంతో కూడిన పెట్టుబడులు, అధునాతన మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ అందించడం సులభతరమవుతుంది. 

 

***


(రిలీజ్ ఐడి: 2308075) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali-TR , Tamil