సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ఆధ్యాత్మిక సంస్థలతో భాగస్వామ్యాలను విస్తరిస్తున్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
నాలుగు ఆధ్యాత్మిక సంస్థలతో అవగాహన ఒప్పందాలపై రేపు ఢిల్లీలో సంతకాలు.
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 6:41PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సామాజిక న్యాయం, సాధికారత విభాగం మత్తుపదార్థాలు లేని భారతదేశాన్ని నిర్మించే ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూ, నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) కింద ఆధ్యాత్మిక సంస్థలతో తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తోంది
సమాజానికి దిశానిర్దేశం చేయడం, క్రమశిక్షణను పెంపొందించడం, విలువల ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక సంస్థల కీలక పాత్రను గుర్తిస్తూ, మత్తుపదార్థాల వాడకానికి వ్యతిరేకంగా విస్తృత అవగాహనను పెంచడానికి ఈ విభాగం ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ చొరవను ముందుకు తీసుకెళ్తూ, అధ్యాత్మ విజ్ఞాన్ సత్సంగ్ కేంద్ర, చిన్మయ మిషన్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్, హరే కృష్ణ మూవ్‌మెంట్‌లతో ఈ విభాగం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. జాతీయ రాజధానిలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో రేపు బుధవారం నాడు ఈ ఒప్పందాల కార్యక్రమం జరుగుతుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంష్ పంత్, ఈ విభాగం సీనియర్ అధికారులు, ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్, సంత్ నిరంకారీ మిషన్, ఇస్కాన్, శ్రీ రామ్ చంద్ర మిషన్, ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్, శివానంద యోగ వేదాంత ధన్వంతరి ఆశ్రమం, పతంజలి విశ్వవిద్యాలయాలతో ఇంతకు ముందే అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
ఈ భాగస్వామ్యాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవకుల సమీకరణతో పాటు వ్యసన విమోచన ప్రయత్నాలలో యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక సలహాల సమన్వయానికి తోడ్పడ్డాయి.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి
నషా ముక్త్ మిత్రగా నమోదు చేసుకోండి!
ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యం నైతిక దిశానిర్దేశాన్ని అందిస్తూ, మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించడానికి దోహదపడుతుంది. ఆధ్యాత్మిక బలాన్ని, సామాజిక సమీకరణను జోడించడం ద్వారా వ్యసన విముక్తి, కోలుకోవడం గురించిన సందేశం సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా ఎన్ఎంబీఏ కృషి చేస్తోంది.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి
నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ-ప్రతిజ్ఞ చేయండి!
నషా ముక్త్ భారత్ దార్శనికతను సాకారం చేయడానికి, వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో ఆరోగ్యకరమైన, బలమైన, మరింత దృఢమైన దేశాన్ని నిర్మించడానికి అవసరమైన సామూహిక సంకల్పాన్ని, సమగ్ర సమాజ దృక్పథాన్ని ఈ భాగస్వామ్యాలు మరింత బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది.
ఎన్ఎంబీఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి
***
(రిలీజ్ ఐడి: 2308073)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5