బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగంలో పురోగతి, విజయాలు: 2014 నుంచి ఎంసీఎల్ పరివర్తనాత్మక ప్రస్థానం
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 1:32PM by PIB Hyderabad
భారత బొగ్గు రంగంలో 2014 నుంచి గణనీయమైన పరివర్తన చోటుచేసుకుంది. పారదర్శకత, సామర్థ్యం, సాంకేతికత వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కార్యకలాపాల నిర్వహణలో సౌలభ్యం, ఇంధన భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన విధానపరమైన, నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి. ఈ సంస్కరణలు వేగవంతమైన నిర్ణయాలు, గనుల కార్యకలాపాల ఆధునికీకరణ, మెరుగైన లాజిస్టిక్స్, అధిక ఉత్పాదకతకు అనుకూలమైన వాతావరణాన్ని అందించాయి. నిర్దేశిత గడువుకు చాలా ముందుగానే దేశీయ బొగ్గు ఉత్పత్తి చారిత్రాత్మకంగా 1 బిలియన్ టన్నుల మెలురాయి స్థాయిని చేరుకోవడం ద్వారా ఈ సంస్కరణల ప్రభావం స్పష్టమైంది. ఇది భారత ఇంధన భద్రతను గణనీయంగా బలోపేతం చేయడంతో పాటు దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించింది.
ఈ పరివర్తనలో మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అత్యంత విజయవంతమైన ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది. 1992-93లో 23 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి ప్రారంభమైన ఎంసీఎల్... ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఎదిగింది. వరుసగా మూడు సంవత్సరాల పాటు 200 మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి, బొగ్గు రవాణా సాధించింది. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య ఎంసీఎల్ ఉత్పత్తి వృద్ధి సుమారు 9 శాతం సీఏజీఆర్‌కు చేరుకుంది. ఇది 1992-93 నుంచి 2020-21 వరకు నమోదైన 6.7 శాతం సీఏజీఆర్‌తో పోలిస్తే గణనీయమైన వృద్ధి. ప్రగతిశీల విధాన సంస్కరణలు, ఆధునిక గని ప్రణాళిక, సాంకేతికత, మౌలిక వసతులు, కార్యకలాపాల సామర్థ్యం, ఎంసీఎల్ ఉద్యోగుల నిబద్ధత సమష్టి ప్రభావమే ఈ విజయానికి కారణం.
ఎంసీఎల్ విజయం కేవలం ఉత్పత్తి, బొగ్గు రవాణాకు మాత్రమే పరిమితం కాలేదు. సంస్థ ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అధిక లాభదాయకతను సాధించింది. కోల్ ఇండియా లిమిటెడ్ లాభాల్లో ప్రధానంగా వాటా అందిస్తున్న సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఎంసీఎల్ కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా విస్తృత స్థాయిలో జీవనోపాధి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇందులో 22,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగులు, 27,000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు, రవాణా, అనుబంధ కార్యకలాపాలతో కూడిన భారీ వ్యవస్థ ఉన్నాయి.
ఈ పరివర్తనలో మానవ, సామాజిక ప్రభావం కూడా అత్యంత ముఖ్యమైన అంశం. ఎంసీఎల్‌తో అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా వేతనాలు అందుతున్నాయి. ఇవి చట్టబద్ధమైన కనీస వేతనాల కంటే అధికంగా ఉన్నాయి. అదనంగా సీఎంపీఎఫ్, వైద్య సదుపాయాలు, విద్యా సహాయం వంటి సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు కూడా వారికి అందుతున్నాయి. సీఎంఏఎంపీ వేదిక ద్వారా కాంట్రాక్టు కార్మికుల డేటాను డిజిటల్ విధానంలో నిర్వహించడం సాధ్యమై, పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరిగాయి. ఉపాధి అవకాశాలు, బొగ్గు లోడింగ్, రవాణాలో సహకార సంఘాల భాగస్వామ్యం, ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన ప్రజలకు అందిస్తున్న సహాయం ద్వారా స్థానిక సమాజాలు కూడా ప్రయోజనం పొందుతున్నాయి.
సమాజ అభివృద్ధి, సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) పట్ల ఎంసీఎల్ నిబద్ధత కూడా ఎంతో ప్రాధాన్యమైనది. ఒడిశాతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థల్లో అత్యధిక సీఎస్‌ఆర్ నిధులు అందిస్తున్న సంస్థల్లో ఎంసీఎల్ ఒకటి. వైద్య సంరక్షణ, విద్య, తాగునీరు, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు వంటి విభాగాల్లో సంస్థ పలు కార్యక్రమాలను చేపడుతోంది. తాల్చేర్‌లో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మించిన మెడికల్ కళాశాల-ఆసుపత్రి, అలాగే ఏటా సుమారు రూ.60–80 కోట్ల ఆర్థిక సహాయం అందించడం ప్రజారోగ్య రంగంలో ఎంసీఎల్ చేస్తున్న భారీ పెట్టుబడికి నిదర్శనం. ఈ సంస్థలో పీజీ కోర్సుల నిర్వహణకు కూడా అనుమతి లభించింది. ఎంసీఎల్ అందించిన సీఎస్‌ఆర్ సహకారంతో జార్సుగుడలో తొలి ప్రభుత్వ కార్డియాక్ కేర్ ఆసుపత్రి ఏర్పాటైంది. తన కార్యకలాపాల పరిధిలోని నాలుగు జిల్లాలు, ఆకాంక్షిత జిల్లాల్లో చేపట్టిన పైప్‌డ్ తాగునీటి ప్రాజెక్టులు, ఎయిమ్స్ భువనేశ్వర్, బుర్లా మెడికల్ కాలేజీలకు అందించిన సహాయం, పాఠశాలలు, తరగతి గదులు, స్మార్ట్ క్లాసులు, బాలికల హాస్టళ్లు, క్రీడా సముదాయాలు, ఇతర సామాజిక మౌలిక వసతులు—బొగ్గు గనుల కార్యకలాపాల ప్రయోజనాలు గని పరిధిని దాటి ఎంత విస్తృతంగా ఉన్నాయో చాటిచెబుతున్నాయి.
సాంకేతికత, పర్యావరణం, లాజిస్టిక్స్ రంగాల్లోనూ ఈ పరివర్తన స్పష్టంగా కనిపిస్తోంది. ఎంసీఎల్ బొగ్గు ఉత్పత్తిలో 99 శాతానికి పైగా ప్రస్తుతం సర్ఫేస్ మైనర్ సాంకేతికత ద్వారానే జరుగుతోంది. దీని వల్ల డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, క్రషింగ్, దుమ్ము, ఇతర పర్యావరణ అవాంతరాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఎంసీఎల్ మరోవైపు 19 ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టులపై సుమారు రూ.10,000 కోట్లు, రైల్వే మౌలిక వసతులపై సుమారు రూ.6,500 కోట్లు, కాంక్రీట్ అంతర్గత రవాణా రహదారులు, బొగ్గు కారిడార్లపై సుమారు రూ.2,150 కోట్లు పెట్టుబడి పెడుతోంది. బొగ్గు తరలింపు సామర్థ్యాన్ని పెంచడం, రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణంపై ప్రభావాన్ని కనిష్ఠ స్థాయికి తీసుకురావడం ఈ కార్యక్రమాల లక్ష్యాలు. రైల్వే, ఎఫ్‌ఎంసీ మౌలిక వసతులపై సంస్థ ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం సుమారు 70 శాతం బొగ్గు రవాణా రైలు మార్గం ద్వారానే జరుగుతోంది. ఎంసీఎల్ ముందుండి ప్రవేశపెట్టిన రైల్-సీ-రైల్ (ఆర్‌ఎస్‌ఆర్) బహుళ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. తీర ప్రాంతాల్లోని వినియోగదారులకు విశ్వసనీయంగా బొగ్గు సరఫరా చేయడానికి ఇది దోహదపడుతోంది.
పర్యాటకం, వారసత్వ అభివృద్ధి ద్వారా విస్తృత ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంసీఎల్ తన వంతు సహకారం అందిస్తోంది. హీరాకుడ్ పరిసర ప్రాంతాల అభివృద్ధి, గని మ్యూజియంలు, వాటర్‌ఫ్రంట్ అభివృద్ధి, రోప్‌వేలు, ఐబీ వ్యాలీలోని ఓరియంట్ మైన్‌లో గనుల పర్యాటకం వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. భువనేశ్వర్ హాఫ్ మారథాన్ వంటి కార్యక్రమాల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని కూడా ఎంసీఎల్ బలోపేతం చేసింది. ఈ హాఫ్ మారథాన్‌లో సుమారు 6,000 మంది పాల్గొనగా, హీరాకుడ్–సంబల్‌పూర్ హాఫ్ మారథాన్‌లో 10,000 మందికి పైగా పాల్గొన్నారు.
ప్రస్తుతం ఎంసీఎల్ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, సొంత, స్వతంత్ర విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్, స్పాంజ్ ఐరన్, ఇతర పరిశ్రమలకు బొగ్గును సరఫరా చేస్తోంది. సంస్థ కొనసాగిస్తున్న స్థిరమైన పనితీరు భారత ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధికి కీలకమైన పునాదిగా మారింది.
బొగ్గు రంగ సంస్కరణల విజయాన్ని కేవలం ఉత్పత్తి చేసిన బొగ్గు టన్నుల ఆధారంగా మాత్రమే అంచనా వేయలేమని ఎంసీఎల్ ప్రస్థానం నిరూపిస్తోంది. అధిక ఉత్పాదకత, బలోపేతమైన లాభదాయకత, మెరుగైన లాజిస్టిక్స్, సాంకేతిక పురోగతి, పర్యావరణ బాధ్యత, కార్మికుల సంక్షేమం, సమాజ అభివృద్ధి, దేశ నిర్మాణం వంటి అనేక అంశాలతో ముడిపడిన విజయగాథ ఇది. 2014 నుంచి సాధించిన పరివర్తన, ప్రగతిశీల విధాన సంస్కరణలు, సంస్థాగత స్పందన, ఆధునిక సాంకేతికత, నిబద్ధత కలిగిన మానవ వనరులు కలిసి భారత బొగ్గు రంగంలోని అపార సామర్థ్యాన్ని స్పష్టమైన ఆర్థిక, సామాజిక విలువగా ఎలా మార్చగలవో చూపించే శక్తిమంతమైన ఉదాహరణగా నిలిచింది.
భారత్ అభివృద్ధి చెందిన, ఇంధన భద్రత కలిగిన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఎంసీఎల్ ఈ పురోగతి వేగాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉంది. మరింత ఎక్కువ బొగ్గును సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా ఉత్పత్తి చేసి సరఫరా చేయడంతో పాటు, సంస్థ వృద్ధి ద్వారా లభించే ప్రయోజనాలు ఉద్యోగులు, స్థానిక సమాజాలు, వినియోగదారులు, దేశం మొత్తానికి చేరేలా ఎంసీఎల్ కృషి కొనసాగిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2308013)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8