ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని వడోదరాలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రజా రవాణా, సరకులను వేగంగా చేరవేసేందుకు భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి… నూతన అవకాశాల సృష్టి, ఆర్థిక వృద్ధికి ఊతం: పీఎం
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ కీలకం: పీఎం
చిప్స్ నుంచి నౌకల వరకు… నూతన తయారీ రంగ భవిష్యత్తును నిర్మిస్తున్న భారత్: పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 2:46PM by PIB Hyderabad
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం పలికారు. "గుజరాత్ సోదరీసోదరులకు నేను స్వాగతం పలుకుతున్నా" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మహారాజా సయాజీరావు యూనివర్సిటీ మైదానంలో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొందని చెబుతూ… అభివృద్ధి వేడుకలో పాలుపంచుకునేందుకు వచ్చిన వివిధ రంగాలకు చెందిన నిపుణుల అద్భుత వేదిక అని ప్రధానమంత్రి అన్నారు. ఈ అభివృద్ధి వేడుకకు విచ్చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. "ఇక్కడన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయి" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
దేశ పురోగతిని వేగవంతం చేసేందుకు వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తూ.. తనకు స్వాగతం పలికేందుకు వడోదర ప్రజలు చేపట్టిన అద్భుతమైన స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ అభివృద్ధి పండగ పట్ల స్థానిక ప్రజలు కనబరచిన అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు. "వికసిత్ భారత్ ప్రయాణానికి మరింత ఊతమిచ్చేందుకు నేడు మీ ముందుకు వచ్చాను" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఎర్రకోట వద్ద ప్రకటించిన 'సప్తధార' (ఏడు శక్తి ప్రవాహాలు) గురించి వివరిస్తూ... గతి శక్తి కార్యక్రమం ద్వారా వేగవంతమైన అనుసంధానం అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇది కీలకమైన 2,800 కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్ పూర్తి కావడాన్ని సూచిస్తుంది. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన తుది అనుసంధానం వడోదరాతో ముడిపడి ఉందని, గతి శక్తి విశ్వవిద్యాలయానికి వడోదరా సరైన నగరమని అన్నారు. "21వ శతాబ్దపు భారతదేశం కోసం ఈ చరిత్రాత్మక కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
2014 తర్వాత జరిగిన వేగవంతమైన పురోగతిని ప్రస్తావిస్తూ… తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల విజయవంతమైన అమలును ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రస్తుతం దేశ వాణిజ్య రూపురేఖలను ఇవి పూర్తిగా మారుస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవస్థలు దేశ వాణిజ్యానికి కీలకంగా మారుతున్నాయన్నారు. "ఈ వ్యవస్థకు ఊతమిస్తూ 2,800 కిలోమీటర్ల కారిడార్ పనులను మేం పూర్తి చేసి చూపించాం" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఈ నూతన జాతీయ రవాణా మార్గం… దేశంలో రవాణా రంగ రూపురేఖలను మార్చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రయాణికులు, సరకు రవాణా రైలు మార్గాలను వేరు చేయటం వల్ల రోజూ 430కి పైగా గూడ్స్ రైళ్లను నడిపేందుకు వీలవుతుందని తెలిపారు. దీనిద్వారా 30 గంటల ప్రయాణ సమయం కేవలం 10 నుంచి 12 గంటలకు తగ్గిపోతుందని చెప్పారు. 100 కిలోమీటర్ల ప్రయాణానికి గతంతో పోల్చితే ఇప్పుడు సగం కన్నా తక్కువ సమయం పడుతుందని... ఇది ఇంధన ఆదాకు, రవాణా ఖర్చులను తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. "ఒక మార్గంపైనే పెట్టుబడి పెట్టినప్పటికీ ఎన్నో ప్రయోజనాలు కలిగాయి" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
రవాణా వ్యవస్థల విస్తరణ వల్ల వ్యవసాయ రంగానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలియజేస్తూ... తూర్పు, పశ్చిమ భారత్‌లోని రైతులు, నిల్వ చేయలేని వస్తువులను వేగంగా పెద్ద మార్కెట్లకు చేరవేయవచ్చని ప్రధానమంత్రి వివరించారు. కాలానుగుణంగా వచ్చే పువ్వులు, కూరగాయలు, పండ్ల వంటివి సరైన సమయానికి వినియోగదారులను, మార్కెట్లను చేరుకుంటున్నాయని స్పష్టం చేశారు. "ఇది రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
నూతన కారిడార్‌కు సంబంధించి అద్భుతమైన కార్యాచరణను పంచుకుంటూ.. జేఎన్‌పీటీ పోర్టు నుంచి వడోదరకు డబుల్-స్టాక్ కంటైనర్ గూడ్స్ రైలు ప్రయాణం విజయవంతం అవటాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ ఒక్క రైలు ప్రయాణం ద్వారా ముంబయి నుంచి ఏకంగా 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరకును సమర్థవంతంగా రవాణా చేసినట్లు చెప్పారు. "ఇకపై దేశంలోని ఒక చివరన ఉన్న ప్రాంతం నుంచి మరో చివరన ఉన్న ప్రాంతానికి భారీ మొత్తంలో సరకులు వేగంగా చేరుకోగలవు" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా రైలు సేవలను విస్తరించేందుకు చేస్తున్న పలు ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఛోటా ఉదయ్‌పూర్, అలీరాజ్‌పూర్ ప్రయాణికులకు ఎంతో మేలు చేసే నూతన రైలు ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "దశాబ్దాలుగా రైలు మార్గం లేని భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా నేడు రైల్వే సేవలు విస్తరిస్తున్నాయి" అని శ్రీ నరేంద్ర అన్నారు.
రోడ్లు, మెట్రోలు, విమానాశ్రయాలు, గ్యాస్ పైపులైన్ల వంటి మౌలిక వసతుల అభివృద్ధి వల్ల కలిగే విస్తృత ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి వివరించారు. రూ. 2.75 లక్షల కోట్లకుపైగా కేటాయించిన చరిత్రాత్మక రైల్వే బడ్జెట్… కోట్లాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించటంలో కీలక ఇంజిన్‌గా పనిచేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, ఓడరేవుల విస్తరణ ద్వారా ఆయా పరిసర ప్రాంతాల్లో సహజంగానే నూతన పరిశ్రమలు, వ్యాపారాలు పుట్టుకొస్తాయని తెలిపారు. "రైల్వేల ఆధునీకరణపై జరుగుతున్న ఖర్చు వేల సంఖ్యలో నూతన ఉద్యోగాలను సృష్టిస్తోంది" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
‘సప్తధార’ దార్శనికతలో భాగంగా తయారీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని వివరిస్తూ... వడోదర పారిశ్రామిక ప్రగతిని ప్రధానమంత్రి ప్రశంసించారు. జౌళి నుంచి పెట్రో రసాయనాల వరకు సాగిన వడోదర 150 ఏళ్ల పారిశ్రామిక ప్రస్థానాన్నీ, గత రెండు దశాబ్దాలుగా ఎంఎస్ఎంఈలకు కేంద్రంగా నగరం సాధించిన అపూర్వ వృద్ధిని కొనియాడారు. తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన సైనిక రవాణా విమానం వడోదరలోనే రూపుదిద్దుకుందని ప్రధాని సగర్వంగా ప్రకటించారు. ఇది నగరానికి తలమానికమైన విజయమంటూ అభినందించారు. ‘‘ఇక్కడ తయారు చేసిన సి-295 విమానం ఇప్పటికే విజయవంతంగా గగనతలంలో విహరించింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దశాబ్ద కాలంగా దేశ పారిశ్రామిక సామర్థ్యం విశేషంగా విస్తరించిన విధానాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఆధునిక రైల్వే కోచ్‌లు, వ్యాగన్లు, లోకోమోటివ్ ఇంజిన్ల తయారీలో ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా భారత్ నిలిచిన తీరును స్పష్టమైన గణాంకాలతో పేర్కొన్నారు. 2014 నుంచి దేశంలో 50,000 ఆధునిక కోచ్‌లను ఉత్పత్తి చేయడంతోపాటు, సుమారు 2.5 లక్షల వ్యాగన్లను రైల్వేల్లో ప్రవేశపెట్టామని తెలిపారు. ‘‘రైలు కోచ్‌లు, మెట్రో కోచ్‌లు, రైలు ఇంజిన్ల తయారీలో కీలక శక్తిగా భారత్ అవతరించింది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
కీలకమైన సరఫరా వ్యవస్థల్లో పూర్తి ఆత్మనిర్భరత సాధించాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. దేశీయంగా సౌర పీవీ మాడ్యూళ్ల తయారీని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో గతంలో భారీగా ఉన్న దిగుమతి ఖర్చులు గణనీయంగా తగ్గడమే కాకుండా.. దేశంలో 200 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెరిగిందని ఆయన తెలిపారు. ‘కడానా’ డ్యాంలో తేలియాడే సౌరవిద్యుత్ ప్రాజెక్టు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అద్భుత విజయాలను సాధించిందంటూ కొనియాడారు. ఈ పథకం ద్వారా గుజరాత్‌లోని 11 లక్షల కుటుంబాలతోపాటు దేశవ్యాప్తంగా 55 లక్షల కుటుంబాలు విద్యుదుత్పత్తిదారులుగా మారాయనీ, స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించాయనీ ఆయన పేర్కొన్నారు. ‘‘చిప్‌ల నుంచి షిప్‌ల వరకు... తయారీ రంగంలో నూతన శకానికి భారత్ నేడు శ్రీకారం చుడుతోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం వ్యాఖ్యానించారు.
వ్యతిరేకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రధానమంత్రి తిప్పికొట్టారు. సౌర, పవన, జల, అణుశక్తి రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రభుత్వం చేస్తున్న అద్భుత కృషిని దేశ యువత నిశితంగా పరిశీలిస్తోందంటూ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దేశం విశేషంగా పురోగమిస్తున్న తీరును యువతరం గుర్తిస్తోందన్నారు. ‘‘సత్యాన్ని గర్జిస్తూ దేశ యువత ముందడుగు వేస్తోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
డేటా సెంటర్లు, కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. దీని కోసం యురేనియం, కీలక ఖనిజాలు, అరుదైన మూలకాల సరఫరాకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు వేగంగా కుదురుతున్నాయని తెలిపారు. కృత్రిమ మేధ రంగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలవాలంటే.. ఈ ప్రాథమిక మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ‘‘మా శ్రమంతా దేశ యువతకు భద్రమైన భవితను అందించడం కోసమే’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం సాంప్రదాయక డిగ్రీలు మాత్రమే ఇకపై సరిపోవని స్పష్టం చేసిన ఆయన.. నిరంతర నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసేలా జాతీయ విద్యా విధానాన్ని సమగ్రంగా పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా బోధన, శిక్షణ సంస్థలను సంపూర్ణంగా పునర్నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘యువత తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఆ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడమూ నేడు అత్యావశ్యకం’’ అని శ్రీ మోదీ పునురుద్ఘాటించారు.
ఎర్రకోట వేదికగా ఇచ్చిన కీలక హామీని నెరవేర్చేలా... పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారానికి స్వస్తి పలికేలా, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసేలా ప్రభుత్వమే బాధ్యతను స్వీకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ‘‘మన యువతకు శిక్షణ బాధ్యత ఇకపై ప్రభుత్వానిదే’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. అన్ని రంగాల్లోనూ అత్యంత ప్రాథమికమైన, కీలకమైన సామర్థ్యంగా కృత్రిమ మేధను ప్రధానమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, రోబోటిక్స్ వంటి రంగాల్లో ఆవిష్కరణలను చేసేలా.. ఏఐలో ప్రావీణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దేందుకు జాతీయ స్థాయిలో ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల.. తయారీ రంగంలో ఉత్పాదకత పెరగడమే కాకుండా, వినూత్నమైన అంకుర సంస్థల ఆవిర్భావానికి అది బాటలు వేస్తుందన్నారు. ‘‘మన భావి తరం ఏఐ సాంకేతికతతో సర్వసన్నద్ధంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
దేశంలోని అపూర్వమైన మానవ వనరుల శక్తిని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలనీ, 2047 నాటికి వికసిత భారత్ సాకారమే లక్ష్యంగా అచంచల దీక్షతో ముందడుగు వేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు గాను శుభాకాంక్షలు తెలుపుతూ... ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు మనం నిరంతరం శ్రమించి తీరాలి’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2308001)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam