రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఏఎఫ్ డ్రోనథాన్–2026
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 3:12PM by PIB Hyderabad
అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (యూఏఎస్), కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సీయూఏఎస్) రంగాల్లో దేశీయ ఉత్పత్తిదారుల సామర్థ్యాలనూ, పురోగతినీ ప్రదర్శించేందుకు అవకాశం కల్పించే లక్ష్యంతో డ్రోనథాన్–2026ను ఐఏఎఫ్ నిర్వహిస్తోంది. అభివృధ్ధి చెందుతున్న డ్రోన్, కౌంటర్ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాలనూ, వాటి పనితీరునూ వీక్షించే, ఒకరి నుంచి మరొకరు నేర్చుకొనే వీలును భాగస్వాములకు కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు జైసల్మేర్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డ్రోన్లనూ, వాటి పనితీరునూ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించడానికి, వాటి పోరాట సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో నిఘా, గూఢచర్యం, స్వతంత్ర కార్యకలాపాలు, స్వార్మ్ సాంకేతిక పరిజ్ఞానాలు, ఎలక్ట్రానిక్ యుద్ధం లాంటి ముఖ్యమైన రంగాలపై దృష్టి సారిస్తారు.
ఆత్మనిర్భరభారత్ అనే దార్శనికతకు అనుగుణంగా డ్రోనథాన్–2026 ఉంది. పారిశ్రామిక నిపుణులు, అంకురసంస్థలు, ఆవిష్కర్తలను ఏకీకృతం చేయడం ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఎదురయ్యే భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా సాంకేతికంగా ముందంజలో ఉన్న, స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలగాలను సిద్ధం చేసేందుకు ఐఏఎఫ్ కృషి చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2307887)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14