రక్షణ మంత్రిత్వ శాఖ
ముప్పులను నిర్ణయాత్మకంగా ఎదుర్కొనే స్వేచ్ఛను, వనరులను రక్షణ బలగాలకు ఇచ్చాం: రక్షణ మంత్రి
‘‘శాంతియుతంగా ఉండటానికీ, బలహీనతకూ మధ్య స్పష్టమైన తేడా ఉంది, తనపై జరిగిన ఉగ్రదాడులకు భారత్ తగిన సమాధానం చెబుతుంది’’
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో స్వతంత్రంగా, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో భారత్ ముందుకు సాగుతోంది: శ్రీ రాజనాథ్ సింగ్
‘‘దేశీయంగా అధునాతన పరిజ్ఞానాలను అభివృద్ధి చేసే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం’’
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 8:37PM by PIB Hyderabad
‘‘శత్రు భూభాగంలో దాడులు చేయడంతో సహా ముప్పులకు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించేందుకు రక్షణ దళాలకు స్వేచ్ఛనూ, వనరులనూ అందించాం’’ అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 2026, సెప్టెంబర్ 7న జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ యువతను తప్పుదోవ పట్టించడం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, హింస, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, సమాజంలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించడంతో సహా భారతదేశ భద్రతను దెబ్బతీయడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి చెప్పారు. తప్పుదోవ పట్టిన యువతను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, వారికి పునరావాసాన్ని కల్పించడం, ఉగ్రవాద భావజాలం నుంచి దూరం చేసే చర్యలు చేపట్టడం, ఉపాధి, వ్యాపార అవకాశాలను అందించడం ద్వారా ఈ కుయుక్తులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం భగ్నం చేసింది. అన్ని విధాలుగా స్పందించింది.
370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి జమ్ము, కాశ్మీర్ అపూర్వమైన పురోగతిని సాధించాయి. యువతకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయనీ, అవకాశాలు లభిస్తున్నాయనీ రక్షణ మంత్రి తెలిపారు. ఉగ్రవాదులనూ, వారి గుప్పిట్లో పెట్టుకుని ఆడించేవారినీ లక్ష్యంగా చేసుకొన్న సర్జికల్ స్ట్రయిక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్, ఆపరేషన్ సిందూర్ లాంటి నిర్ణయాత్మక సైనిక చర్యల ద్వారా ఉగ్రవాదాన్ని ఏరివేసే వ్యూహాన్ని భారత్ స్వీకరించిందని ఆయన స్పష్టం చేశారు. ‘‘రక్తం, నీరు కలసి ప్రవహించలేవని సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది’’ అని ఆయన చెప్పారు.

భారతీయుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని శత్రువులు చేసిన ప్రయత్నాలను కూడా విజయవంతంగా తిప్పికొట్టామని శ్రీ రాజనాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రార్థనా స్థలాలపై జరిగిన దాడుల గురించి ప్రస్తావించారు. అలాంటి కుట్రలను భారతీయులు తిరస్కరించారనీ, ఐక్యతనూ, సామాజిక సామరస్యాన్నీ ప్రదర్శించారనీ తెలియజేశారు.
భారత్ శాంతి మార్గాన్ని విశ్వసిస్తుందనీ, యుద్ధాన్ని కోరుకోదనీ, ఏ దేశానికి చెందిన భూభాగాన్నైనా ఆక్రమించాలని అనుకోదనీ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉండటానికీ, బలహీనతకూ మధ్య స్పష్టమైన తేడా ఉందని ఆయన తెలియజేశారు. ‘‘యుద్ధ భయంతో పుట్టిన శాంతిని ఖండించాలి. కానీ శాంతి కోసం చేసే యుద్ధాన్ని గౌరవించాలి. భారత్‌కు వ్యతిరేకంగా ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. ఎలాంటి చర్చలూ జరపబోమని మేం స్పష్టంగా చెప్పాం. దానికి బదులుగా మా రక్షణ బలగాలు తగిన సమాధానం చెబుతాయి’’ అని చెప్పారు.
వేగంగా మారుతున్న యుద్ధ స్వభావం గురించి కూడా శ్రీ రాజనాథ్ సింగ్ మాట్లాడారు. భూమి, గాలి, సముద్రంతో సహా అంతరిక్షం, సైబర్ స్పేస్ కూడా ఆధునిక యుద్ధ క్షేత్రాలుగా ఆవిర్భవించాయన్నారు. కృత్రిమ మేధ, డ్రోన్లు, అటానమస్ వ్యవస్థలు, ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు తదితర సాంకేతిక పరిజ్ఞానాలు యుద్ధభూమి రూపురేఖలు మారుస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు తగిన భద్రతా వ్యూహాన్నీ, రక్షణ పరికరాలను సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. దేశీయంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.
ప్రతిస్పందన నుంచి క్రియాశీలకంగా భారత రక్షణ విధానం చేరుకుందని రక్షణ మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి దౌత్యం, నాయకత్వం కారణంగానే 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థలో సభ్యదేశంగా భారత్ మారిందని వెల్లడించారు. ఇది బ్రహ్మోస్ క్షిపణి పరిధిని విస్తరించే ప్రయత్నాలకు దోహదపడిందనీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలకపాత్ర పోషించిందనీ రక్షణ మంత్రి తెలిపారు.
రక్షణ రంగంలో వచ్చిన మార్పుల గురించి శ్రీ రాజనాథ్ సింగ్ వివరించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, రక్షణ బలగాలను ఆధునికీకరించడం, దేశీయంగా ఉత్పత్తిని పెంపొందించడం, ఆయుధాల ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం దిశగా ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. ఈ ప్రయత్నాల వల్లే రక్షణ రంగంలో స్వయం సమృద్ధినీ, ఆత్మవిశ్వాసాన్ని దేశం సాధించిందనీ చెప్పారు. రక్షణ ఉత్పత్తుల విలువ 2014లో రూ. 40,000 కోట్లుగా ఉంటే ఇప్పుడు అది దాదాపు రూ.1.80 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. రక్షణ ఎగుమతులు 56 రెట్లు పెరిగి రూ. 38,000 కోట్లకు పైగా చేరుకున్నాయని తెలిపారు.

దిగుమతులు ఆధారిత విధానం నుంచి దేశీయంగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయడం, ఆత్మనిర్భరతను సాధించడంపై భారత్ దృష్టి సారించిందని రక్షణ మంత్రి తెలియజేశారు. ‘‘స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ ‘ఆకాశ్‌తీర్’, అత్యాధునిక గగనతల క్షిపణి ‘ఆకాశ్’ ఇప్పుడు మన భద్రతా బలగాల వద్ద ఉన్నాయి. పినాకా రాకెట్ లాంచర్, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ‘అస్త్ర’, ‘ప్రచండ్’, ‘ధృవ’ లాంటి స్వదేశీ హెలికాప్టర్లు, ‘తేజస్’ యుద్ధ విమానం, ‘అర్జున్’ ట్యాంక్, ఆధునిక డ్రోన్, కౌంటర్ డ్రోన్లు కూడా మన వద్ద ఉన్నాయి. వీటిన్నింటితో పాటు తొలి స్వదేశీ యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఇప్పుడు మనం విస్తృత స్థాయిలో రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నాం. అదే సమయంలో ఆరో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను 2029 నాటికి రూ.50,000 కోట్లకు చేరాలన్నదే మన లక్ష్యం’’ అని చెప్పారు.
రక్షణ తయారీ రంగంలో వచ్చిన మార్పుల గురించి శ్రీ రాజనాథ్ సింగ్ తెలియజేశారు. ఇప్పుడు 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ (డీపీఎస్‌యూ)లు నష్టాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనీ, పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులను పెంచుతున్నాయనీ, ఎగుమతులకు నూతన అవకాశాలను అన్వేషిస్తున్నాయనీ వెల్లడించారు. ‘‘గడచిన 12 ఏళ్లలో భారత రక్షణ బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.8 లక్షల కోట్లకు పెరిగింది. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో భారత దేశ భద్రతను బలోపేతం చేసేందుకే ప్రతి రూపాయినీ వినియోగిస్తున్నాం’’ అని చెప్పారు.
గత 12 ఏళ్లలో భారతదేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత, సాంస్కృతిక గుర్తింపు బలోపేతమయ్యాయని రక్షణ మంత్రి అన్నారు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం, నలంద విశ్వవిద్యాలయ పునరుద్ధరణ, అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి లాంటి కార్యక్రమాల ద్వారా నాగరికత నాయకత్వ స్థానాన్ని భారత్ చేరుకుంది. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్, మహాసాగర్ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్) ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని బలోపేతం చేస్తున్నాం. పొరుగు దేశాల్లో సంక్షోభం ఎదురైతే మొదట స్పందించే విశ్వసనీయ దేశంగా భారత్ ఆవిర్భవించింది’’ అని రక్షణ మంత్రి తెలియజేశారు.
ఆర్థిక వ్యవస్థకూ, జాతీయ భద్రతకూ మధ్య ఉన్న సంబంధం గురించి శ్రీ రాజనాథ్ సింగ్ తెలియజేశారు. ఆధునిక సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికీ, వ్యూహాత్మక స్వతంత్రతను కొనసాగించడానికి బలమైన ఆర్థిక వ్యవస్థ అవసరమన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తూ, స్వావలంబనను పెంపొందిస్తూ, దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ 7.8 శాతం వృద్ధి రేటుతో భారత్ ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలకు ఉదాహరణగా భారతీయ సెమీకండక్టర్ వ్యవస్థ అభివృద్ధినీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని చూపించారు. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ, అనేక దేశాలు ఒక పక్షాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. లేదా నిర్దిష్ట కూటములతో పొత్తు పెట్టుకోవలసి వస్తుంది. అయితే, భారతదేశం తన సొంత ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తూ స్వతంత్రతతో, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో ముందుకు సాగుతోంది. అందుకే ఈ రోజు మన ప్రపంచం వింటోంది," అని ఆయన అన్నారు.

రక్షణ ఉత్పత్తుల రంగంలో పెరుగుతున్న ప్రైవేటు రంగ భాగస్వామ్యం గురించి రక్షణ మంత్రి వివరించారు. ‘‘ఈ రంగంలో ప్రస్తుతం 16,000కు పైగా ఎంఎస్ఎంఈలు పని చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రక్షణ తయారీ పరిశ్రమ విస్తరిస్తోంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో రక్షణ పరిశ్రమ కారిడార్ల కోసం సుమారుగా రూ.70,000 కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో ఇప్పటికే దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు’’ అని చెప్పారు. ఐడెక్స్, ఐడెక్స్ ప్రైమ్ లాంటి కార్యక్రమాల ద్వారా రక్షణ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, 2018లో డజన్ల సంఖ్యలో మాత్రమే ఉన్న రక్షణ రంగంలోని అంకురసంస్థల సంఖ్య ఇప్పుడు 2,000కు పైగా పెరిగిందని చెప్పారు.
ఉద్యోగాలు కల్పించేవారుగా, ఆవిష్కర్తలుగా యువత మారాలని శ్రీ రాజనాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రయోజనం కలిగించే ఆలోచనలకు రక్షణ మంత్రిత్వ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను బలోపేతం చేయడానికి పరిశమ్ర, విద్యాసంస్థలు, అంకురసంస్థలు, శాస్త్రవేత్తలను ఏకం చేసేందుకు డీఆర్‌డీవో చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. మేలో విజయవంతంగా నిర్వహించిన స్క్రామ్‌జెట్ కంబస్టర్ పరీక్షలను... హైపర్‌సోనిక్ క్షిపణి అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన క్షిపణి సాంకేతికతలను భారత పరిశ్రమకు బదిలీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనివల్ల ప్రైవేట్ సంస్థలు వాటిని తయారు చేయడానికి వీలవుతుందని, అలాగే రక్షణ దళాలకు సకాలంలో అవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించడం, జాతీయ భద్రతను బలోపేతం చేసే, ఆర్థిక వృద్ధిని నడిపించే, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థలో దేశం పాత్రను పటిష్టం చేసే రక్షణ రంగాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా... సాంకేతిక, ఆర్థిక, రక్షణ రంగాల్లో మన దేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2307799)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4