ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చాపెల్ హిల్‌లో జరిగిన జీ20 ఆవిష్కరణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద

ఆవిష్కరణ మంత్రుల ప్రకటనపై ఏకాభిప్రాయానికి వచ్చిన జీ20 మంత్రులు

కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ సాంకేతికతలు, ఆవిష్కరణ- పరిశోధన రంగాల్లో ఈయూ, ఫ్రాన్స్, జర్మనీ, ఆఫ్రికా సమాఖ్యతో మరింత బలమైన సహకారంపై చర్చించిన భారత్

సెమీకండక్టర్లు, ఏఐ, డేటా కేంద్రాలలో సహకారాన్ని బలోపేతం చేయడం, సాంకేతికత ఆధారిత అవకాశాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించిన భారత్ - అమెరికా

డ్యూక్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి ఉన్నతాధికారులు, పరిశోధకులతో ఏఐ, రోబోటిక్స్, ఆవిష్కరణ, వర్ధమాన సాంకేతికతలలో సహకార అవకాశాలపై చర్చించిన కేంద్ర మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 5:08PM by PIB Hyderabad

అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన చాపెల్ హిల్‌లో 2026 సెప్టెంబర్ 1-2 తేదీల్లో అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ, వైట్ హౌస్ శాస్త్ర సాంకేతిక విధాన కార్యాలయాలు (ఓఎస్‍టీపీ) సంయుక్తంగా నిర్వహించిన జీ20 ఆవిష్కరణ మంత్రుల సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్- ఐటీ, వాణిజ్య పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం పాల్గొంది. ఎలక్ట్రానిక్స్- ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) సంయుక్త కార్యదర్శి శ్రీ అజిత్ కుమార్.. శాస్త్ర సాంకేతికత విభాగం (డీఎస్‍టీ), పరిశ్రమలు- అంతర్గత వాణిజ్య ప్రోత్సహక విభాగానికి (డీపీఐఐటీ) చెందిన సీనియర్ అధికారులు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నారు.

 

సమావేశం ముగింపు సందర్భంగా ‘అందరికీ శ్రేయస్సును చేకూర్చడానికి, ఉత్పాదకతను పెంచడానికి, అవకాశాలను విస్తరించడానికి వర్ధమాన సాంకేతికతలు దోహదపడతాయనే’ విషయాన్ని గుర్తిస్తూ 'ఆవిష్కరణ మంత్రుల ప్రకటనను’ విడుదల చేశారు.

ఆవిష్కరణలను ప్రోత్సహించే విధాన ఫ్రేమ్‌వర్క్‌లు, అవకాశాలు- శ్రేయస్సు కోసం సాంకేతికత, నైపుణ్యం కలిగిన సాంకేతిక మానవవనరుల అభివృద్ధి, కృత్రిమ మేధ (ఏఐ) కోసం మేధో సంపత్తి (ఐపీ) విధానాలు,    ప్రమాణాల కోసం ఏఐ- ఏఐ కోసం ప్రమాణాల రూపకల్పన, పారిశ్రామిక ఆవిష్కరణలు- సరఫరా వ్యవస్థలో పెట్టుబడులు.. అనే ఆరు ప్రధాన అంశాలపై విస్తృత అంగీకారాన్ని ఈ ఏకాభిప్రాయ ప్రకటన తెలియజేస్తోంది. ప్రాథమిక పరిశోధనలలో పెట్టుబడులు పెట్టాలని, వాణిజ్యీకరణ మార్గాలను బలోపేతం చేయాలని, విశ్వసనీయ సాంకేతికతను స్వీకరించేలా దేశాలకు పిలుపునిచ్చే 'కరోలినా ప్రిన్సిపల్స్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్'పై కూడా మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సదస్సులోని ఇతర ముఖ్యమైన నిర్ణయాల్లో 'ఏఐ ప్రాస్పిరిటీ ఆబ్జెక్టివ్స్', 'ఏఐ ప్రాస్పిరిటీ కాంపాక్ట్'లు కూడా ఉన్నాయి. ఇవి జీ20 దేశాల్లో సాంకేతిక మానవ వనరుల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్య అవకాశాలను విస్తృతం చేస్తాయి.

జీ20 మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

ఐరోపా కమిషన్ కార్యనిర్వహక ఉపాధ్యక్షులు హెన్నా విర్కునెన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. ఆవిష్కరణలలో సహకారాన్ని బలోపేతం చేయడం, సాంకేతికత ఆధారిత వృద్ధికి, సమష్టి శ్రేయస్సుకు దోహదపడే విశ్వసనీయ డిజిటల్ వ్యవస్థలను నిర్మించటానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించారు.

ఫ్రాన్స్ కృత్రిమ మేధ, డిజిటల్ వ్యవహారాల మంత్రి ఆన్ లే హేనాఫ్‌తో జరిగిన సమావేశంలో ఏఐ, డిజిటల్ సాంకేతికతలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి విశ్వసనీయమైన డిజిటల్ భవిష్యత్తు కోసం భాగస్వామ్యాలను నిర్మించడానికి కట్టుబడి ఉన్న భారత్, ఫ్రాన్స్ తెలిపాయి. 

జర్మనీ పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలు థామస్ జార్జోంబెక్, డాక్టర్ సిల్కే లౌనర్ట్‌తో జరిగిన సమావేశంలో సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలలో భారత్-జర్మనీల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి, సమష్టి పురోగతిని, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే భాగస్వామ్యాలను పెంపొందించడానికి గల అవకాశాలను కేంద్ర మంత్రి దృష్టి సారించారు. 

ఆఫ్రికా సమాఖ్య విద్యా, శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణ కమిషనర్ ప్రొఫెసర్ గ్యాస్పార్డ్ బన్యన్కింబోనాతో జరిగిన చర్చల్లో ఆఫ్రికాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, డీపీఐతో సహా ఇండియా స్టాక్ డిజిటల్ పరిష్కారాలను ఆఫ్రికా దేశాలకు అందించడం ద్వారా సమష్టి వృద్ధికి, శ్రేయస్సుకు కొత్త అవకాశాలను సృష్టించడానికి ఉన్న నిబద్ధతను తెలియజేశారు.

అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సెమీకండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్‌లలో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. ఐఎస్ఎం2.0లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని అమెరికా పరిశీలించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఏఐ సాంకేతికత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఏఐ భద్రత కోసం భాగస్వామ్య యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం గురించి కూడా ఇందులో చర్చించారు.

ఆంత్రోపిక్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు టామ్ బ్రౌన్‌తో కూడా కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. వేగంగా మారుతున్న ఏఐ రంగం గురించి, ఏఐ పురోగతి ద్వారా వస్తున్న అవకాశాల గురించి ఇందులో చర్చించారు. భారతీయ పరిస్థితులకు తగినట్లుగా బెంచ్‌మార్క్‌లను అభివృద్ధి చేయడానికి పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు.

 

జీ20 సమావేశాల అనంతరం కేంద్ర మంత్రి డ్యూక్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులతో సమావేశమై సాంకేతికత, పరిశోధన, ఇంజనీరింగ్, కృత్రిమ మేధ, కంప్యూటర్ సైన్స్, ఆరోగ్య రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రైట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని రోబోటిక్స్ ల్యాబొరేటరీని కూడా ఆయన సందర్శించారు. అక్కడ రోబోటిక్స్, బయోమెడికల్ సిమ్యులేషన్, ఏఐ ఎనేబుల్డ్ సెన్సింగ్, బయోమెడికల్ డేటా, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధకులు, నిపుణులతో ఆయన మాట్లాడారు. వర్ధమాన, పరివర్తనాత్మక సాంకేతికతలలో భారత్, అమెరికా మధ్య విద్యా, పరిశోధన సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి ఉన్న బలమైన అవకాశాలను ఈ సమావేశాలు ప్రధానంగా తెలియజేశాయి. 

ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణల ప్రణాళికను రూపొందించడంలో పెరుగుతున్న భారత్ పాత్రను ఈ పర్యటనలోని కార్యక్రమాలు స్పష్టం చేశాయి. ఏఐ, సెమీకండక్టర్లు, డీపీఐ, రోబోటిక్స్, ఇతర వర్ధమాన సాంకేతికతలలో సాధించిన పురోగతిని ఆవిష్కరణలకు, ఆర్థిక వృద్ధికి, ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు అనుసంధానించే వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్మించే విషయంలో భారత్ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2307709) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil