బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీగా పుంజుకున్న సీఐఎల్ ఉత్పత్తి, విద్యుత్ రంగ సరఫరాలు

సెప్టెంబర్ 6 నాటికి 35 శాతం పెరిగి 1.83 మిలియన్ టన్నులకు చేరుకున్న రోజువారీ సగటు ఉత్పత్తి.. సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు 1.36 ఎంటీలుగా నమోదైన రోజువారీ సగటు ఉత్పత్తి

24 శాతం వృద్ధితో 1.37 మిలియన్ టన్నుల నుంచి 1.7 మిలియన్ టన్నులకు పెరిగిన విద్యుత్ రంగ సరఫరా

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 5:10PM by PIB Hyderabad

గనులు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కోల్ ఇండియా లిమిటెడ్‌‌కు (సీఐఎల్) సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ రంగాలకు సరఫరాల విషయంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది.

సెప్టెంబర్ మొదటి మూడు రోజుల్లో సుమారు 1.36 మిలియన్ టన్నులుగా (ఎంటీ) ఉన్న సీఐఎల్ సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ 6 నాటికి సుమారు 35 శాతం పెరిగి 1.83 ఎంటీలకు చేరుకుంది. గనుల తవ్వకం పరిస్థితులు క్రమంగా మెరుగుపరచటం, దెబ్బతిన్న రవాణా మార్గాలు- పని ప్రదేశాలను పునరుద్ధరించటంతో ఈ వృద్ధి సాధ్యమైంది. ఈ ఉత్పత్తి వృద్ధి చెందటంలో సీఐఎల్ అనుబంధ సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇదే సమయంలో సగటు రోజువారీ ఉత్పత్తి ‘ఎన్‌సీఎల్‌’లో 0.18 ఎంటీల నుంచి 0.29 ఎంటీలకు (సుమారు 61 శాతం), ’ఎస్‍ఈసీఎల్’లో 0.15 ఎంటీల నుంచి 0.20 ఎంటీలకు (33 శాతం) పెరిగింది.

ఉత్పత్తిలో వృద్ధి వల్ల సరఫరా మరింత పెరిగింది. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా విషయంలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోంది. విద్యుత్ రంగానికి సగటు రోజువారీ సరఫరా (డిస్పాచ్) సెప్టెంబర్ మొదటి మూడు రోజుల్లో సుమారు 1.37 ఎంటీలుగా ఉండగా.. సెప్టెంబర్ 6 నాటికి 24 శాతం పెరుగుదలతో 1.7 ఎంటీలకు చేరుకుంది. ఇదే సమయంలో విద్యుత్ రంగ సరఫరా ఎన్‌సీఎల్ విషయంలో 0.18 ఎంటీల నుంచి 0.28 ఎంటీలకు (56 శాతం).. ఎస్ఈసీఎల్ విషయంలో 0.30 ఎంటీల నుంచి 0.37 ఎంటీలకు (23 శాతం) పెరిగింది.

ఓబీఆర్ (ఓవర్‌బర్డెన్ రిమూవల్) గణనీయంగా పెరగటమే ఈ ఉత్పత్తి మెరుగుదలకు తోడ్పడుతోంది. బొగ్గు లభ్యత, భవిష్యత్ ఉత్పత్తి సన్నద్ధతకు ఓబీఆర్ ఒక ముఖ్యమైన సూచికగా ఉంది. సెప్టెంబర్ మొదటి మూడు రోజుల్లో రోజువారీ సగటు ఓబీఆర్ 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా (ఎంసీఎం) ఉండగా సెప్టెంబర్ 6 నాటికి అది రెట్టింపు అయి 5.1 ఎంసీఎంలకు చేరుకుంది. ఇదే కాలంలో ఓబీఆర్.. ఎన్‌సీఎల్‌ విషయంలో నాలుగు రెట్లు, ఎస్ఈసీఎల్ విషయంలో మూడు రెట్లకు పైగా పెరిగింది.

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అదనపు బొగ్గును వెలికితీసేందుకు, ఓవర్‌బర్డెన్ తొలగింపును వేగవంతం చేయడానికి కావాల్సిన వనరులను తిరిగి కేటాయించటంతో పాటు పూర్తి స్థాయిలో మోహరించారు. నిరంతర నీటి తొలగింపు (డివాటరింగ్) ద్వారా దిగువ శ్రేణి బొగ్గు పొరలను క్రమంగా మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వర్షాకాలంలో భౌగోళిక-సాంకేతిక ఇబ్బందులు ఎదురైన గనులకు పొడి వాతావరణ పరిస్థితులు తిరిగి రావడంతో ఇప్పుడు తెరుచుకుంటున్నాయి.

పొడి పని బెంచ్‌లు, పొడి ముడి బొగ్గు అందుబాటులోకి రావడం ఒక ముఖ్యమైన పరిణామం. తేమ, అతుక్కునే గుణం తగ్గడంతో బొగ్గును తరలించే విషయంలో (ఫ్రీ-ఫ్లోయింగ్) పరిస్థితి మెరుగుపడింది. ఇది మరింత సాఫీగా బొగ్గును నిర్వహించడానికి, రవాణా చేయడానికి వీలు కల్పిస్తుంది.

విద్యుత్ కేంద్రాలకు ముఖ్యంగా వాషరీ, ఆర్‌సీఆర్ పద్ధతి మోడ్ ద్వారా బొగ్గును పొందే కీలక ఉత్పత్తి కేంద్రాలకు సరఫరాను బలోపేతం చేయడానికి సీఐఎల్ అదనపు చర్యలు తీసుకుంటోంది. రోడ్డు మార్గంలో బొగ్గును తీసుకెళ్లటానికి ఆసక్తి గల కేంద్ర- రాష్ట్ర జెన్‌కోలు, ఐపీపీలకు ఎంఎస్‍క్యూ (మంత్లీ షెడ్యూల్డ్ క్వాంటిటీ) కంటే మించి బొగ్గును అందిస్తున్నారు. రోడ్డు మార్గంలో కీలక విద్యుతుత్పత్తి కేంద్రాలకు జారీ చేసిన డెలివరీ ఆర్డర్‌ల ఆధారంగా బొగ్గును తరలించటానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

గనులున్న అనేక ప్రాంతాల్లో బొగ్గు రవాణా మెరుగపడ్డ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

సీఐఎల్‌కు సంబంధించిన అన్ని గనుల్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హాల్ రోడ్లు, బొగ్గు రవాణా మార్గాలను నిరంతరం బలోపేతం చేస్తున్నారు. సెప్టెంబర్ 3 నుంచి వర్షాలు తగ్గడంతో ఈ చర్యల ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ తొలగింపు, విద్యుత్ రంగ సరఫరా అన్నీ బలపడుతుండటంతో కోలుకుంటున్న పరిస్థితిని మరింత మెరుగుపరచటం, బొగ్గు సరఫరాలను మరింత పెంచటంపై సీఐఎల్ దృష్టి సారించింది.

సెప్టెంబర్‌లో కనిపిస్తున్న ఈ మెరుగుదల సీఐఎల్ ఉత్పత్తి, సరఫరా విషయంలో సానుకూల పరిస్థితిని తెలియజేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరాలు క్రమంగా వర్షాకాలానికి ముందున్న స్థాయికి చేరుకుంటున్నాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2307610) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil