వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పటిష్ట.. ప్రపంచ సంధానిత ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థలను భారత్ రూపొందించాలి
· ‘భారత్ హెల్త్ గ్లోబల్ ఎక్స్ పో-2026’లో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు
· పరిశోధన-అభివృద్ధి.. కొత్త మాలిక్యూల్స్.. బయోసిమిలర్స్.. బయోటెక్ రంగాల్లో ఔషధ రంగం అగ్రస్థానం సాధించాలని సూచన
· స్థానిక విలువ జోడింపు.. చివరి అంచెదాకా సేవల ప్రదానం దిశగా విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు సహా సరఫరా వ్యవస్థ పటిష్టానికి భారత్ బాహ్య-దృష్టి సహిత విధానాన్ని అనుసరించడం అవశ్యం
· మెడికల్ వాల్యూ ట్రావెల్.. ఫార్మా.. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు సహా రంగాలవారీ సర్వసన్నద్ధ పారిశ్రామిక సదుపాయాలకు మద్దతుపై ప్రభుత్వం సదా సంసిద్ధం
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 9:28PM by PIB Hyderabad
ప్రపంచానికి విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ భాగస్వామిగా భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ‘భారత్ హెల్త్ గ్లోబల్ ఎక్స్ పో-2026’లో ఆయన ప్రసంగించారు. మన దేశం ప్రధానంగా పటిష్ట, ప్రపంచ సంధానిత ఆరోగ్య సంరక్షణ సరఫరా వ్యవస్థలను రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా జెనరిక్స్ రంగంలో సాధించిన విజయానికి మించి పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణల దిశగా మరింత ముందంజ వేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య-పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖల సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.
భారత ఔషధ రంగం తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి ప్రదర్శించగల గొప్ప అవకాశం మన ముందున్నదని శ్రీ గోయల్ అన్నారు. ఈ నేపథ్యంలో “ప్రపంచ ఔషధశాల”గా పరిగణనలోగల భారత్ మరింత భారీ, ఉజ్వల భవిష్యత్తుపై లక్ష్యనిర్దేశం చేసుకోవాలని సూచించారు. దేశ ఆరోగ్య సంరక్షణ రంగం నేటి భారత్ హెల్త్ గ్లోబల్ ఎక్స్ పో ద్వారా ఏకతాటిపైకి రావడం ఒక ఆరంభ సూచిక మాత్రమేనన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడం సహా యావత్ విలువ వ్యవస్థను ఒకే వేదికపైకి తేవడంలో దీనికి గణనీయ సామర్థ్యం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వేదికను తదుపరి దశలో దేశీయ పెవిలియన్లు, భాగస్వామ్య దేశాల కోసం కూడా అందుబాటులో ఉంచవచ్చునని మంత్రి చెప్పారు. దీనివల్ల దేశవిదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించే వీలుంటుందని పేర్కొన్నారు. భారత్ తన శక్తిసామర్థ్యాలను ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీపడే అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తుందని తెలిపారు.
సరఫరా వ్యవస్థలలో పునరుత్ధాన సామర్థ్యం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ- ఇటువంటి వ్యవస్థల కోసం ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్నదని శ్రీ గోయల్ గుర్తుచేశారు. ఒకటి లేదా రెండు ప్రదేశాలపై అధికంగా ఆధారపడటం లేదా వాటికి ఉపకరణాలుగా మారే అవకాశం గల సరఫరా వ్యవస్థలతో ఎంతమాత్రం ఉపయోగం లేదని వివరించారు. ‘యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్’ (ఏపీఐ), ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’ (కేఎస్‌ఎం) రంగంలో అనేక కారణాల వల్ల భారత్ లోగడ వెనుకబడిందని మంత్రి పేర్కొన్నారు. కానీ, ఇవాళ ఔషధ సరఫరా వ్యవస్థలో పునరుత్థాన సామర్థ్యాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన విశదీకరించారు.
పునరుత్థాన సామర్థ్యమంటే అంతర్ముఖ విధానం కాదంటూ- మనం ప్రతిదాన్నీ దేశీయీకరణ చేయాల్సిన అవసరం లేదని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో దిగుమతులను కొనసాగించవచ్చునని చెప్పారు. అయితే, ఉత్పత్తులు బహుళ భౌగోళిక ప్రాంతాలు, కంపెనీల నుంచి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. తద్వారా ఏదో ఒక దేశం లేదా ఓ రెండుమూడు కంపెనీలు మన వ్యాపారాలను పిడికిట బిగించి, పరిశ్రమ పురోగతిని అడ్డుకోకుండా చూడగలమని ఆయన తెలిపారు.
దేశీయ డిమాండ్‌ను సమీకృతం చేయడం ద్వారా, ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న అనేక ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేయగల అవకాశాలను గుర్తించవచ్చునని మంత్రి అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు నేడు పెట్టుబడులను ఆకర్షించడానికి, తమ సరఫరా వ్యవస్థల పటిష్టానికి పోటీ పడుతున్నాయని ఆయన హెచ్చరించారు.
పెట్టుబడుల కోసం పోటీ ఇకపై వర్ధమాన దేశాలకు పరిమితం కాబోదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, కెనడా, మెక్సికో, జపాన్, కొరియా, సింగపూర్, ఐరోపా తదితర అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల, భారత్ కేవలం వస్తుసేవల రంగంలోనే కాకుండా పెట్టుబడుల ఆకర్షణలోనూ అభివృద్ధి చెందిన దేశాలతో కూడా పోటీ పడుతున్నదనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఈ నేపథ్యంలో భారత పెట్టుబడి ప్రతిపాదనలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత మన ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు.
మన తరహాలోనే ప్రపంచ దేశాలనేకం ఈ పోటీలో నిలదొక్కుకోవడానికి కృషి చేస్తున్నాయనే నిజాన్ని భారత్ గుర్తించాలన్నారు. ఇటువంటి పరిస్థితుల నడుమ ఔషధ రంగం అంతర్జాతీయ, బాహ్య దృష్టి సహిత విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. చివరి అంచె సేవల ప్రదానం, స్థానిక విలువ జోడింపు, ఉద్యోగ కల్పన వగైరాల్లో ఆఫ్రికా సహా భారత ఔషధ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న దేశాలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఈ రంగం అంతర్జాతీయ దృక్పథంతో ముందడుగు వేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టీకరించారు.
పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రస్తావిస్తూ- జెనరిక్స్ రంగంలో భారత్ సాధించిన విజయాలు మన ఔషధ పరిశ్రమ నిరంతర, చురుకైన కృషి ఫలితమేనని శ్రీ గోయల్ అన్నారు. అయితే, 2047 నాటికి దేశం వికసిత భారత్‌గా ఎదగాలనే లక్ష్యం నేపథ్యంలో కేవలం జెనరిక్స్ రంగంతో సరిపెట్టుకోవడం సరికాదని హెచ్చరించారు.
పరిశోధన-అభివృద్ధికి దేశం మరింత ప్రాధాన్యమివ్వాలని, సొంత ఉత్పత్తుల రూపకల్పన-తయారీ ద్వారా పేటెంట్లు పొందాలని మంత్రి సూచించారు. ఈ దిశగా పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలకు మద్దతుగా ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. పరిశోధన-అభివృద్ధిలో ఔషధ రంగం అగ్రస్థానానికి చేరాలని, ఇందుకోసం ‘రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ఫండ్’ (ఆర్‌డీఐఎఫ్) వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. భారత కంపెనీలు, ఇంజినీర్లు, ప్రతిభావంతులందరూ సరికొత్త మాలిక్యూల్స్, బయోసిమిలర్స్, బయోటెక్నాలజీలపై నిశితంగా దృష్టి సారించాలని పిలుపునిస్తూ- ఈ రంగంలో వీటిని తమ తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకోవాలని ఆయన అన్నారు.
పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలను దేశీయ ఆకర్షణగా మార్చగల నియంత్రణ యంత్రాంగాన్ని భారత్ ప్రపంచానికి సమకూర్చాల్సి ఉంటుందని శ్రీ గోయల్ అన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో పెట్టుబడులు, ఉత్పత్తులకు పేటెంట్ల సాధన, పరిశోధన-అభివృద్ధి నిర్వహణ, దేశంలో కొత్త ఉత్పత్తుల ప్రవేశం తదితర అంశాల్లో సార్వత్రిక, ఆహ్వానించదగిన విధానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందిన దేశాలలోని నిబంధనలను పరిశీలించి, అగ్రస్థానంలోని దేశాల్లో నియంత్రణల సంబంధిత ఏకీకరణ దిశగా ప్రస్థానం కోసం ప్రపంచ పరిణామాలను భారత నియంత్రణ సంస్థలు అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. భారత ఆలోచనా దృక్పథం, విధానాలు అగ్రదేశాలతో ఏకీకృత కానిపక్షంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధించడం కష్టమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. భారత్‌లో పెట్టుబడులకు సుముఖత చూపే పెట్టుబడిదారుల అభిప్రాయాలను, ఆయా దేశాల ప్రభుత్వాల డిమాండ్లను భారత్ తప్పక పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తద్వారా ఈ పరిశ్రమ విజయానికి సమష్టిగా కొత్త బాటలు వేసుకోవాలని సూచించారు.
‘మెడికల్ వాల్యూ ట్రావెల్’పై మాట్లాడుతూ- ఈ రంగంలో దాదాపు 8 బిలియన్ డాలర్ల దాకా వ్యయం నమోదవుతున్నదని శ్రీ గోయల్ గుర్తుచేశారు. ఆ మేరకు భారత ఆసుపత్రులు అత్యుత్తమ పరికరాలతో ఆధునికంగా రూపొంది, అంతర్జాతీయ స్థాయిని అందుకున్నాయని చెప్పారు. భారత వైద్యులు, సాంకేతిక నిపుణులు, నర్సులు కూడా అత్యుత్తమ నిపుణుల జాబితాల్లో స్థానం సంపాదించారని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ విలువ ఆధారిత వైద్య పర్యటనలను ఒక ఉద్యమ తహాలో చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ రంగంలో ‘ఎస్‌ఈపీసీ’ ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ, తదితర సంస్థలతో సంయుక్తంగా కార్యక్రమాలను చేపట్టిందని శ్రీ గోయల్ గుర్తుచేశారు. మార్కెట్‌లో అధిక వాటాను కైవసం చేసుకోవడం సహా భారత ఆరోగ్య సంరక్షణ రంగ ప్రస్థానానికి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈపీఎం, ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫండ్ ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాల కోసం భారత్ వైద్య సంరక్షణ రంగ ప్రోత్సాహక కార్యక్రమాలకు ప్రభుత్వం సంతోషంగా మద్దతిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో పరిశ్రమలు వీలైనంత త్వరగా ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
కోవిడ్ మహమ్మారి వేళ ప్రపంచవ్యాప్తంగా జెనెరిక్ మందుల సరఫరా సహా భారత్ నుంచి నవ్యావిష్కరణలు, పేటెంట్ పొందిన ఉత్పత్తుల సరఫరా ద్వారా ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా భారత్ తన ప్రాధాన్యాన్ని పలుమార్లు చాటుకున్నదని మంత్రి పేర్కొన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ పరిశ్రమను తదుపరి దశకు చేర్చడంలో ఈ పరిణామాలన్నీ మనకు తోడ్పడతాయని ఆయన అన్నారు.
గడచిన 40 ఏళ్లు ఔషధ పరిశ్రమ పురోగమనంలో కీలక సమయమని శ్రీ గోయల్ అన్నారు. కానీ, ప్రస్తుత స్థితితోనే ఈ రంగం సంతృప్తి పడిపోరాదని, “అత్యున్నత లక్ష్యనిర్దేశం”తో మరింత ఉజ్వల భవిష్యత్తు దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మౌలిక సదుపాయాల విషయానికొస్తే- ‘బల్క్ డ్రగ్ పార్కుల’ ఏర్పాటు ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నదని శ్రీ గోయల్ తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో పాత-కొత్త పార్కుల సహిత ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే, 100 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటవుతాయని, అవసరమైతే వాటిలో ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగాల కోసం ప్రత్యేక కేటాయింపు చేసే వీలుంటుందని ఆయన చెప్పారు.
అదేవిధంగా ఇంజినీరింగ్, ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాల పరిశ్రమలు కూడా తమకు అనువైన ప్రదేశాల విషయంలో మరింత పట్టుదల చూపాలని ఆయన సూచించారు. వివిధ రంగాల అవసరాలకు తగినట్లు సర్వసన్నద్ధ మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతివ్వడంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.
వైద్య పరికరాల అంశాన్ని ప్రస్తావిస్తూ- ఈ రంగంలో తగినంత కృషి సాగినప్పటికీ భారత్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని శ్రీ గోయల్ అన్నారు. ఈ రంగంలో మరింత వృద్ధికి గణనీయ అవకాశాలున్నాయని, విడిభాగాల కూర్పు నుంచి తయారీ దాకా వైద్య పరికరాల వ్యవస్థ యావత్తూ దేశీయ ఉత్పత్తి వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో మెరుగైన, నాణ్యమైన ఉత్పత్తుల లభ్యతపై వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, ఆసుపత్రులు మరింత అవగాహన పెంచుకోవాల్సి ఉందన్నారు. ఈ భారీ మార్కెట్ అంతే భారీ స్థాయిలో వృద్ధి చెందగలదు కాబట్టి, దేశీయంగా అధిక మార్కెట్ వాటాతో ఎగుమతులకూ మద్దతిస్తుందని చెప్పారు. ఆ మేరకు విడిభాగాలు, పరికరాల దేశీయీకరణకు ‘ఎంఎస్ఎంఈ’లు మద్దతివ్వగలవని, భారీ కంపెనీలు భారీ స్థాయిలో ఉత్పత్తి పెంచగలవని ఆయన అన్నారు. ఈ సంఘటిత కృషితో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా అందివస్తాయని, వందల కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్ సంక్షోభాల పరిష్కారంలో భారత్ మరింత పటిష్టం కాగలదని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు.
ఆయుష్ రంగాన్ని ప్రస్తావిస్తూ- ఇది భారత సంప్రదాయ వైద్యానికి, జ్ఞానానికి ప్రతీక అని శ్రీ గోయల్ అన్నారు. మన దేశం ఇప్పటికీ ముడి మూలికలను ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో ఆయుష్ ఉత్పత్తులకు ప్రపంచ విస్తృత ఆమోదం లభించేలా మరింత శాస్త్రీయ ధ్రువీకరణ అవసరమని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే తన వంతు కృషి చేస్తున్నదని తెలిపారు.
ఏ అంశంలోనైనా సహకారానికిగల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- దేశీయంగా బలమైన రంగాల్లో భారత్ ఇప్పటికే ఇలాంటి అనేక కార్యక్రమాలను రూపొందించిందని శ్రీ గోయల్ చెప్పారు. వీటిలో ఔషధ రంగం దేశానికిగల అతిపెద్ద బలాల్లో ఒకటని గుర్తుచేశారు. కాబట్టి, ఇందులోని వివిధ విభాగాలతో వేర్వేరు సమావేశాల నిర్వహణ కన్నా అన్నిటి కోసం ఒక సంయుక్త వేదికను ఏర్పాటు చేయడం అవశ్యమన్నారు. ఇలాంటి ఏకీకృత వేదిక ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలు, సుమారు 1,000 మంది నిపుణుల భాగస్వామ్యాన్ని ఆకర్షించగలదన్నారు. అలాగే, ఈ రంగంలో పరిణామాలపై భాగస్వాములకు సమగ్ర అవగాహన కల్పించి, ఉత్తమమైన వాటిని పోల్చి చూసుకుంటూ గుర్తించే వీలుంటుందన్నారు.
అత్యుత్తమ శ్రేణితో పోటీ పడగలమనే దృఢమైన నమ్మకం కూడా భారత్‌కు ఉండాలని మంత్రి అన్నారు. నాణ్యత, సకాలంలో సరఫరా, ఉత్తమ సేవల ప్రదానం తదితరాలతోనే పోటీ అన్నది అంతిమంగా తేలుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ప్రపంచానికి అత్యుత్తమమైన వాటిని ప్రదర్శించే అవకాశం, సామర్థ్యం భారత్‌కు ఉన్నాయన్నారు.
అంతర్జాతీయ మార్కెట్ సౌలభ్యం గురించి మాట్లాడుతూ- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో (ఎఫ్‌టిఏ) భారత పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీ గోయల్ గుర్తుచేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు మూడింట రెండు వంతుల దాకా ఇప్పటికే భారత్‌కు ప్రాధాన్యం లభిస్తున్నదని పేర్కొన్నారు. మరో 8 నుంచి 10 బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక ‘ఎఫ్‌టిఏ’ల దిశగా చర్చలు కొనసాగుతున్నాయని, అవన్నీ సాకారమైతే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75 శాతంతో భారత్‌కు సంధానం సులువవుతుందని ఆయన చెప్పారు.
భారత్ ‘ఎఫ్‌టీఏ’లన్నీ కలిపి 2014 వరకు 10 ట్రిలియన్ డాలర్ల ఉమ్మడి ‘జీడీపీ’గల మార్కెట్లకు సౌలభ్యం కల్పించాయని శ్రీ గోయల్ అన్నారు. కాగా, శ్రీ జితిన్ ప్రసాద ప్రస్తావించిన, అనుబంధ పుస్తకంలో పొందుపరిచిన 9 ‘ఎఫ్‌టిఏ’లు 38 అభివృద్ధి చెందిన దేశాలతో 60 ట్రిలియన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ సౌలభ్యం కల్పిస్తున్నాయని తెలిపారు. ఇది 2014 దాకా అందుబాటులోగల విలువతో పోలిస్తే 6 రెట్లు అధికమని పేర్కొన్నారు. పాత ‘ఎఫ్‌టిఏ’లలో అధికశాతం 25 ఏళ్లుగా స్తంభించిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
భారత పారిశ్రామిక రంగం నేడు పోటీతత్వంతో, అత్యుత్తమ శ్రేణిలోనిదిగా, బలమైన ప్రతిభతో వర్ధిల్లుతున్నదని శ్రీ గోయల్ అన్నారు. ఇప్పుడు కావాల్సిందల్లా, మరింత గొప్ప ఆకాంక్షలు, ఉన్నత లక్ష్యాలు, అన్ని అంశాలను అనుసంధానించగల సామర్థ్యమేనని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ‘భారత్ హెల్త్’ వంటి సంస్థ వివిధ సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చి, సమీకృతం చేయడం ద్వారా సహకారం-సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ తన వంతు కృషి చేస్తున్నదని తెలిపారు.
ఆరోగ్యకర పోటీ అవసరమేగాక, వాంఛనీయమని చెబుతూ- ఈ రంగంలో సహకారం తప్పనిసరిగా ఉండాలని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. పరిశ్రమ భారీ లక్ష్యాలతో, ఆధునిక దృక్పథంతో, నాణ్యతకు అగ్ర ప్రాధాన్యమిస్తూ ప్రపంచమంతటా విస్తరించాలని చెప్పారు. అలాగే, పునరుత్థాన సామర్థ్యం పెంచుకుంటూ, విస్తరణకు ప్రాముఖ్యంతో పరిశోధన-అభివృద్ధి, ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారతీయ సామర్థ్యాన్ని, ప్రతిభను సద్వినియోగం చేసుకుంటూ దేశీయ వాణిజ్య భాగస్వామ్యాల ద్వారా లభించే అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా మరింత విశ్వాసం, సద్భావన సహా మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని, దేశాన్ని “ప్రపంచ ఆరోగ్య కూడలి”గా మార్చేందుకు కృషి చేయాలని శ్రీ గోయల్ ఔషధ పరిశ్రమకు పిలుపునిచ్చారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ లేనిదే ఏ మానవుడూ, ఆర్థిక వ్యవస్థ లేదా దేశం ప్రగతి శిఖరాలకు చేరజాలదని, ప్రజానీకంలో ఆరోగ్యానందాలను సాధించజాలదని ఆయన స్పష్టం చేశారు.
వికసిత భారత్-2047 సంకల్ప సాధన భారం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ రంగం భుజస్కంధాలపైనే ఉందని శ్రీ గోయల్ ప్రస్ఫుటం చేశారు. ఆరోగ్యకర భారత్, ఉత్తమ ఆరోగ్య సౌకర్యాలు, నాణ్యమైన మందుల లభ్యత సహా యావత్ ప్రజానీకానికి నివారణ-చికిత్స సౌలభ్యం వంటివి ఈ రంగంపైగల బృహత్తర బాధ్యతలని మంత్రి అన్నారు. వికసిత భారత్-2047 స్వప్న సాకారానికి ఈ రంగమే పునాది కాగలదని ఆయన చెప్పారు.
****
(రిలీజ్ ఐడి: 2307365)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5