కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2879 మంది నమోదిత విద్యార్థులతో ప్రారంభమైన కార్పొరేట్ మిత్ర కోర్సు మొదటి బ్యాచ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిబంధనల భయాన్ని తగ్గించడం, విజ్ఞానాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడమే కార్పొరేట్ మిత్ర లక్ష్యం: ఎంసీఏ జేఎస్ అనితా షా ఆకెళ్ల

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 8:15PM by PIB Hyderabad

కార్పొరేట్ మిత్ర కోర్సును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మార్గదర్శకత్వంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీవోఏఐ) సంయుక్తంగా ప్రారంభించాయి. మొదటి బ్యాచులో 2879 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. క్రమబద్ధమైన అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి దశ ఆరంభాన్ని కార్పొరేట్ మిత్ర లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ఆవిష్కరణ సూచిస్తుంది.

వ్యాపార నిర్వహణలో, నిబంధనలను పాటించడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా  పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు సహకరించేందుకు శిక్షణ, ధ్రువపత్రాలను పొందిన పారాప్రొపెషనల్స్ బృందాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో 2026-27 కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్ మిత్ర కార్యక్రమాన్ని భారత  ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ఐసీవోఏఐ సంస్థల వృత్తిపరమైన నైపుణ్యాన్ని, ఐఐటీ మద్రాస్, ఐఐటీ మద్రాస్ ప్రవర్థక్, స్వయం ప్లస్ నుంచి అందే సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యా సంబంధిత సహకారాన్ని ఒకే వేదికపైకి  తీసుకువస్తుంది.

న్యూఢిల్లీలోని ఐసీఏఐ ప్రధాన కార్యాలయంలో కోర్సును అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనితా షా ఆకెళ్ల, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్-పీఐ శ్రీ మహేంద్ర కుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ఐసీఏఐ అధ్యక్షులు సీఏ ప్రసన్న కుమార్ డీ, ఐసీఏఐ ఉపాధ్యక్షులు సీఏ మంగేష్ పి కినరే, ఐసీఏఐ కార్యదర్శి సీఏ (డాక్టర్) జై కుమార్ బత్రా సహా ఐసీఏఐ నాయకులు హాజరయ్యారు. 

ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సీఎంఏ చిత్తరంజన్ ఛటోపాధ్యాయ, ఉపాధ్యక్షులు సీఎంఏ మనోజ్ కుమార్ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు, మూడు నైపుణ్య శిక్షణా సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు తక్కువ ఖర్చుకే నిపుణుల తోడ్పాటును అందించడం కోసం ధ్రువీకరణ  పొందిన, నైపుణ్యాలున్న పారా-ప్రొఫెషనల్స్ బృందాన్ని సిద్ధం చేయడమే కార్పొరేట్ మిత్ర లక్ష్యం. తద్వారా వ్యాపార సౌలభ్యానికి, ఉద్యోగ కల్పనకు, సమ్మిళిత ఆర్థిక వృద్ధికీ ప్రోత్సాహం లభిస్తుంది. 

ఈ సందర్భంగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అనితా షా ఆకెళ్ల మాట్లాడారు. కార్పొరేట్ మిత్ర... ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిబంధనల భయాన్ని తొలగించి, విజ్ఞానాన్ని మరింత అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. నిబంధనల అమలును భారంగా కాకుండా విశ్వసనీయతకు, పారదర్శకతకు, జవాబుదారీతనానికి, క్రమబద్ధమైన వృద్ధికి తోడ్పడే సాధనంగా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. 

కార్పొరేట్ మిత్ర కోర్సు కాల వ్యవధి మొత్తం 12 నెలలు కాగా దీనిని రెండు దశలుగా విభజించారు. మొదటి ఆరు నెలల్లో రికార్డు చేసిన వీడియో పాఠాల ద్వారా సుమారు 150 గంటల నిర్మాణాత్మక విద్యా బోధన ఉంటుంది. తర్వాతి ఆరు నెలల్లో ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ఐసీవోఏఐల్లో సభ్యులకు చెందిన సంస్థల్లో వృత్తిపరమైన శిక్షణ ఉంటుంది. ఇది విద్యార్థులకు పని ప్రదేశంలో ప్రత్యక్షంగా పని చేసే అనుభవాన్ని ఇస్తుంది.

ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు, వాటికి అవసరమైన మద్దతుపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేలా ఈ విద్యా కార్యక్రమాన్ని రూపొందించారు. రికార్డు చేసిన నిపుణుల పాఠాలు, రిఫరెన్స్ మెటీరియల్, మూల్యాంకనాలు, ప్రకటనలు, ఎఫ్‌ఏక్యూలు, చర్చా వేదికలను  ఈ డిజిటల్ లెర్నింగ్ వేదిక అందిస్తుంది.

భారత ఎంఎస్ఎంఈ రంగం వృద్ధికీ, దాని వ్యవస్థీకరణకు తోడ్పడే నైపుణ్యాలతో కూడిన పారాప్రొఫెషనల్స్ బృందాన్ని తీర్చిదిద్దే దిశగా వేసిన కీలకమైన ముందడుగును కార్పొరేట్ మిత్ర కోర్సు ప్రారంభం సూచిస్తుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2307108) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , हिन्दी , English , Urdu