వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రీసైకిల్, అప్‌సైకిల్ చేసిన వస్త్రాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు జీఈఎం, టెక్స్‌టైల్స్ కమిటీ మధ్య అవగాహన ఒప్పందం
ప్రభుత్వ కొనుగోలుదారుల కోసం వస్త్ర వ్యర్థాలను విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చే జీఈఎం కార్యక్రమం
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 8:57PM by PIB Hyderabad
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం), జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన టెక్స్‌టైల్స్ కమిటీ (టీసీ) కలిసి వినియోగదారుల వినియోగానికి ముందు, తర్వాత ఉత్పత్తయ్యే వస్త్ర వ్యర్థాలు, స్క్రాప్, సెకండ్‌హ్యాండ్ దుస్తులతో తయారయ్యే రీసైకిల్, అప్‌సైకిల్ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా సర్క్యులర్ టెక్స్‌టైల్ ఆర్థిక వ్యవస్థలోని సంస్థలకు కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబయిలో జరిగిన టెక్స్‌టైల్స్ కమిటీ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఈ భాగస్వామ్యం అధికారికంగా అమల్లోకి వచ్చింది.
ఈ సహకారం ద్వారా ‘వ్యర్థాల నుంచి విలువ, విలువ నుంచి మార్కెట్’ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వస్త్ర వ్యర్థాలు, స్క్రాప్, సెకండ్‌హ్యాండ్ దుస్తులను నాణ్యమైన విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చి, వాటిని జీఈఎం వేదిక ద్వారా ప్రభుత్వ కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం, రీసైకిల్, అప్‌సైకిల్ వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే అర్హత కలిగిన ఉత్పత్తిదారులను టెక్స్‌టైల్స్ కమిటీ గుర్తించి, వారి అర్హతలను ధ్రువీకరించి, సర్టిఫై చేసి, గుర్తింపు ఇవ్వనుంది. అలాగే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, సామర్థ్య నిర్మాణం, మార్కెట్ పరిశోధన, సాంకేతిక ప్రమాణాల రూపకల్పనకు కూడా సహకరించనుంది.
జీఈఎం రీసైకిల్, అప్‌సైకిల్ వస్త్ర ఉత్పత్తుల కోసం ప్రత్యేక వర్గాలను ఏర్పాటు చేసి, విక్రేతల నమోదు, ఆన్‌లైన్ మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేయడంతో పాటు, ఈ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలుదారుల్లో ప్రోత్సహించనుంది. శిక్షణ, మార్గదర్శక సహాయం ద్వారా చివరి దశలో పనిచేసే అప్‌సైక్లర్లు, రీసైక్లర్లు ప్రభుత్వ కొనుగోళ్లలో సమర్థవంతంగా పాల్గొనేలా చేయనున్నారు.
ఈ భాగస్వామ్యంలో హబ్-అండ్-స్పోక్ విధానాన్ని అనుసరించనున్నారు. దీనిలో భాగంగా టెక్స్‌టైల్స్ కమిటీ, దాని అనుబంధ కార్యాలయాలు చివరి దశలోని అప్‌సైక్లర్లు, రీసైక్లర్లను చేరుకోవడం, వారిని సమీకరించడం, సామర్థ్య నిర్మాణం వంటి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ కొనుగోళ్లకు అనువైన ఉత్పత్తి ప్రమాణాలు, కేటలాగ్‌ల రూపకల్పనకు సహకరిస్తాయి.
మహిళలు, ఎంఎస్‌ఎంఈలు, స్థానిక సంస్థలు, చేతివృత్తుల కళాకారులు, రీసైక్లర్లు, ఇతర సర్క్యులర్ ఎకానమీ సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సమగ్ర, వికేంద్రీకృత, సుస్థిర ఉత్పత్తి వ్యవస్థను నిర్మించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ కార్యక్రమానికి కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, మహారాష్ట్ర ప్రభుత్వ జౌళిశాఖ మంత్రి శ్రీ సంజయ్ సవ్కరే హాజరయ్యారు. సీనియర్ అధికారులు, పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో జీఈఎం అదనపు సీఈఓ శ్రీ అజిత్ బి. చవాన్, టెక్స్‌టైల్స్ కమిటీ కార్యదర్శి శ్రీ కార్తికేయ్ ధండా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కీలక భాగస్వామ్యంపై సీఈఓ శ్రీ మిహిర్ కుమార్ మాట్లాడుతూ.. “ధ్రువీకరణ, ప్రమాణీకరణ, మార్కెట్ అందుబాటును అనుసంధానం చేయడం ద్వారా వస్త్ర వ్యర్థాలతో తయారయ్యే ఉత్పత్తులకు విశ్వసనీయమైన డిమాండును సృష్టించడం జీఈఎం-టీసీ భాగస్వామ్య లక్ష్యం. ప్రభుత్వ కొనుగోళ్లకు ఉన్న విస్తృత స్థాయి, పరిధి ద్వారా కార్యాలయాలు, సంస్థలు, బహుమతులు, ఇతర ప్రజా వినియోగ అవసరాల్లో ఇటువంటి ఉత్పత్తుల వినియోగాన్ని వేగంగా పెంచవచ్చు” అని అన్నారు.
ఈ కార్యక్రమం వనరుల సంరక్షణ, సుస్థిర జీవనోపాధి, బాధ్యతాయుత వినియోగం, ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, సర్క్యులర్, వనరుల సమర్థ వినియోగం ఆధారిత వస్త్ర ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ చేపడుతున్న మార్పును మరింత బలోపేతం చేయనుంది.
ప్రభుత్వ కొనుగోళ్ల విస్తృత స్థాయిని వినియోగించుకోవడం ద్వారా వస్త్ర వ్యర్థాలను ఆర్థిక అవకాశాలుగా మార్చడం, సుస్థిర మార్కెట్ వృద్ధిని సాధించడం దిశగా ఈ భాగస్వామ్యం ఒక కీలక ముందడుగుగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2306824)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25