వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ స్థాయిలో పని చేయాల్సిందిగా వాహన భాగాల పరిశ్రమకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపు


పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది భారత్‌యే..
మంచి రెండంకెల వృద్ధిని సాధించిన వాహన రంగం: శ్రీ గోయల్

అమెరికా, భారత్ ఆటోమోటివ్ భాగస్వామ్యం ‘‘చరిత్రాత్మకంగా ఉన్నత స్థాయి’’కి చేరింది: ఇండియాలో అమెరికా రాయబారి శ్రీ సర్జియో గోర్..
అమెరికాలో పెట్టుబడులు పెట్టండంటూ భారతీయ వాహన భాగాల తయారీ సంస్థలను ఆహ్వానించిన శ్రీ గోర్

వాహన భాగాలకు సీఈటీఏలో భాగంగా టారిఫ్ రహిత లభ్యతతో పాటు
భారత్-యూకే ఆటోమోటివ్ భాగస్వామ్యాన్ని విస్తరించాలన్న
హెచ్ఎమ్ ట్రేడ్ కమిషనరు శ్రీ హర్‌జిందర్ కాంగ్

వాహన రంగ సరఫరా వ్యవస్థను బలపరచడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రస్తావించిన శ్రీ గోయల్..
కొత్త పారిశ్రామిక పార్కులతో జతపడాల్సిందిగా పరిశ్రమను ఆహ్వానించిన మంత్రి

సరఫరా వ్యవస్థను పటిష్ఠపరచనున్న భారత్, అమెరికా కీలక ఖనిజాల భాగస్వామ్యం..
500 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన అంతర్జాతీయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వాహన భాగాల పరిశ్రమకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది: శ్రీ గోయల్

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 6:36PM by PIB Hyderabad

వాహన భాగాల పరిశ్రమ స్థానిక వాణిజ్య కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. మంత్రి ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎమ్ఏ) 66వ వార్షిక కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించగా మంత్రి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు.  అంతర్జాతీయ మార్కెట్లతో భారత్ తన అనుబంధాన్ని పెంపొందించుకోవాలని సంకల్పించుకున్న నేపథ్యంలో, వాహన భాగాల పరిశ్రమ తయారీ కార్యకలాపాలను అభివృద్ధి చెందిన దేశాలకు విస్తరించాలని, ఆటుపోట్లను తట్టుకొని నిలిచేలా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని, వేల్యూ చైన్‌లో ఎగువ స్థాయులకు పురోగమించాలని మంత్రి సూచనలు చేశారు.
పరిశ్రమ  అంతర్జాతీయ స్థాయి వాణిజ్యం దాదాపు 50 బిలియన్ అమెరికా డాలర్లకు చేరి, దిగుమతులు ఎగుమతుల మధ్య సమానంగా విభాజితమైందని శ్రీ గోయల్ వివరించారు. అంతర్జాతీయ స్థాయి ఆలోచనలను చేస్తే వాణిజ్యం పెంపొందుతుందని, దేశ ఆర్థిక పురోభివృద్ధిలో దిగుమతులు కూడా ఒక ముఖ్య పాత్రను పోషించగలుగుతాయని ఆయన అన్నారు. ఈ దృక్పథాన్ని.. దిగుమతులను పెంచుకోవాలంటూ అందుకు అందిస్తున్న ప్రోత్సాహంగా భావించవద్దని ఆయన స్పష్టంచేశారు.
దిగుమతులకు, ఎగుమతులకు మధ్య అంతరాన్ని విస్తరించాలని వాగ్దానం చేశారని, అయితే ఈ పని ఇంకా మొదలు కాలేదని మంత్రి అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఏసీఎమ్ఏ, దాని సభ్యుల పక్షాన పెద్ద స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడుల తో పాటు అంతర్జాతీయ వాణిజ్యాన్ని కూడా మరింత పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సహకార పూర్వక ప్రాజెక్టుల వల్ల  గత కొన్ని సంవత్సరాల్లో ఈ పరిశ్రమ లాభపడిందని, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగిన ధరలకు నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సంపాదించుకొందని కేంద్ర మంత్రి అన్నారు.
పరిశ్రమ ఇక ప్రపంచం నలుమూలలా తయారీ కేంద్రాలను విస్తరించి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉనికిని చాటుకోవాలని ఆయన కోరారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత నాలుగైదు సంవత్సరాల్లో తొమ్మిది వాణిజ్య ఒప్పందాలు ఖరారైన నేపథ్యంలో భారత్‌కు మార్కెట్ల లభ్యత స్థాయులు విస్తరిస్తున్నాయని శ్రీ గోయల్ ప్రస్తావించారు. ఈ ఒప్పందాల్లో అభివృద్ధి చెందిన 38 దేశాలతో ఖాయమైన ఒప్పందాలు కలిసి ఉన్నాయని, వీటి మొత్తం జీడీపీ 60 ట్రిలియన్ అమెరికా డాలర్లని ఆయన వివరించారు. 2014 కంటే ముందు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మొత్తం జీడీపీ ప్రస్తుత విలువ ప్రకారం లెక్కించినప్పుడు 10 ట్రిలియన్ అమెరికా డాలర్లని, అదే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కిందటి నాలుగు సంవత్సరాల్లో సంతకాలైన ఒప్పందాల వల్ల 60 ట్రిలియన్ అమెరికా డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థల వరకూ రెండు వైపులా మార్కెట్టు అందుబాటులోకి వచ్చి ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ ఒప్పందాల్లో.. ఎక్కువ జీడీపీ, ఎక్కువ తలసరి జీడీపీలను కలిగి ఉన్న సౌభాగ్యవంతమైన దేశాలతో కుదిరిన ఒప్పందాలు కూడా కలిసి ఉన్నాయని, వీటితో భారతీయ పరిశ్రమకు తక్కువ  పోటీ, ఎక్కువ పూరకత్వం (కాంప్లిమెంటరిటీ) లభిస్తాయని మంత్రి అన్నారు. భారత్ పక్షాన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సంప్రదింపులలో ఏసీఎమ్ఏ పాత్ర కూడా ఉందని శ్రీ గోయల్ అంగీకరించారు. ఈ సంస్థ ఎల్లవేళలా భారతీయ వాహన భాగాల రంగానికి జీరో డ్యూటీ లభ్యతను కోరుతూ వచ్చిందని, అలాగే భారతీయ మార్కెట్టు తలుపులను పరస్పర పద్ధతిలో తెరిచి ఉంచాలని సూచించిందని ఆయన అన్నారు. ఈ పరిశ్రమ ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీలతో పోటీ పడగలుగుతుందని, అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు.
‘‘ధీరత్వానికి మించి, అస్థిరతలను ఎదుర్కొంటూ కొత్త బాటలను వేయడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం’’ అనే ఇతివృత్తాన్ని కార్యక్రమానికి ఎంపిక చేయడం గురించి శ్రీ గోయల్ ప్రస్తావించారు.  ఈ విషయం అనిశ్చితులు, సవాళ్లు, బాగా ఎక్కువ ఆటుపోట్లు కలుగుతున్న ప్రపంచంలో చాలా సందర్భ శుద్ధితో కూడుకొందని ఆయన  అన్నారు.
ప్రపంచంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలోనూ భారత్ తన మార్గంలో దూసుకుపోతోందని, ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అన్నింటి కన్న వేగంగా కదులుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి అన్నారు. ‘‘విమర్శకులు తమకు తోచిన మాటలు మాట్లాడవచ్చు, అయితే 7.8 శాతం అభివృద్ధి రేటు మాత్రం వాస్తవం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
వివిధ రంగాల్లో వృద్ధిని గురించి శ్రీ గోయల్ చెబుతూ ఏసీఎమ్ఏ శర వేగంగా రెండు అంకెల రేటుతో పురోగమిస్తోందని, వాహన రంగం కూడా ఇలాగే పయనిస్తోందన్నారు. ఈ సంవత్సరంలో 50 లక్షల ప్యాసింజర్ కార్లు అమ్ముడవుతాయని భావిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్లను నిల్వ చేయడం కాదు, కొనుగోలు చేస్తున్నారు సుమా అని ఆయన అన్నారు. విద్యుత్తుతో నడిచే కార్లను గురించి మాట్లాడుతూ, కొన్ని ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రస్తుతం ఆరు నెలల పాటు వేచి ఉండాల్సివస్తోందన్నారు.
ఉక్కు రంగం జోరు మీద ఉందని, భారత్ ఎంత ఉక్కును దిగుమతి చేసుకొంటోందో అంత కన్న ఎక్కువే ఎగుమతి చేస్తోందని, దేశీయంగా గిరాకీ చాలా అధికంగా ఉండడమే దీనికి కారణమనీ మంత్రి వివరించారు. ఈ గిరాకీని నెరవేర్చడంలో వాహన భాగాల పరిశ్రమ చెప్పుకోదగిన పాత్రను పోషిస్తోందని ఆయన అన్నారు.
పరిశ్రమ సామర్థ్యాన్ని, సరఫరా వ్యవస్థ బలాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి శ్రీ గోయల్ ప్రస్తావించారు. వాహన భాగాల తయారీ పరిశ్రమకు పెద్ద ఎత్తున ఉత్పాదనలను అందించేటట్లు, స్పెషాలిటీ స్టీల్‌ను తయారు చేసే కంపెనీలకు అవసరపడే ఉక్కును భారత్‌లోనే ఉత్పత్తి చేసేటట్లు అందించిన మద్దతుకు నేరుగా ఇదే పరిశ్రమతో సంబంధం ఉందని ఆయన అన్నారు.
వాహన భాగాల పరిశ్రమలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ సంబంధిత పీఎల్ఐకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పరిశ్రమకు టెక్నికల్ టెక్స్‌టైల్స్ అవసరమవుతుండడమే దీనికి కారణమన్నారు. దీంతోపాటు, సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతును అందించడంలో వాహన భాగాల సరఫరా వ్యవస్థను పటిష్ఠ పరచాలనే ఉద్దేశం ఇమిడి ఉందని తెలిపారు.
ప్రభుత్వం కొత్తగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తోందని, 20 స్మార్ట్ నగరాలతో పాటు పారిశ్రామిక నగరాల పనులు పురోగమిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా పరిశ్రమను ఆయన కోరారు. ఈ పార్కులలో తమకంటూ కొన్ని ప్రధాన ప్రాంతాలను నెలకొల్పుకొనే దిశగా ఆలోచనలు చేయాల్సిందిగా ఇతర దేశాలకు కూడా ఆయన సూచించారు. ‘‘వీటిలో నుంచి ఒక పార్కును మనం అమెరికా, భారత్ భాగస్వామ్యానికి కేటాయించే అవకాశం కూడా ఉండవచ్చు. బహుశా మనం ఇలాంటి రెండో, మూడో లేదా అయిదు పార్కులను రూపొందించనూ వచ్చు.. అవి వాహన భాగాల కోసమే ఏర్పడవచ్చు. అంతేకాదు, నేను మీ అవసరాలను లెక్కలోకి తీసుకొని వెంటనే పనులను మొదలుపెట్టడానికి అనువుగా ఉండే (‘ప్లగ్ అండ్ ప్లే’) మౌలిక సదుపాయాలను కూడా అందించగలను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సంస్కరణలు, ముందు ముందు చేపట్టే సంస్కరణలు.. ఈ పరంపర.. పరిశ్రమ సహకారంతోనే వేగంగా ముందుకు సాగగలుగుతుందని శ్రీ గోయల్ అన్నారు. ‘‘మాకు మీ ఆలోచనలను తెలియజేయండి. మాకు మీ సూచనలు, సలహాలు అవసరం. మాకు మీ కోరికలు ఏమిటో తెలియాలి. మాకు మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందో తెలియాలి. మీకు ఏ ఇబ్బందులు ఎదురవుతున్నాయో, మేం మీకు ఎలా మరింత ఎక్కువగా సాయపడగలమో తేలాలి. మాది చెవి ఒగ్గి వినే ప్రభుత్వం. మేం మీరు మీ సమస్యలను తెలియజేయాలని కోరుకుంటున్నాం’’ అని ఆయన అన్నారు. పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య  చర్చ నిరంతరం కొనసాగాలని ఆయన అన్నారు.
డేటా సెంటర్ పరిశ్రమతో ఇటీవల మూడు, నాలుగు గంటల పాటు చర్చించిన సంగతిని శ్రీ గోయల్ ప్రస్తావించారు. ఆయా కంపెనీలలో చాలావరకు అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో భారత్‌కు తరలివస్తున్నవి కూడా ఉన్నాయని తెలిపారు. భారత్, అమెరికా విశ్వసనీయ భాగస్వాములని, ప్రతి వస్తువును మరింత ఎక్కువ పోటీ పడే విధంగా తీర్చిదిద్దడంలో అవి పరస్పరం తోడ్పాటును అందించుకుంటాయని ఆయన అన్నారు.
పరిస్థితులు నిలకడతనాన్ని సంతరించుకుంటే భారత్‌లో మరో జీసీసీతో పాటు ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) త్వరలోనే కొలిక్కి వస్తుందని శ్రీ గోయల్ అన్నారు. దృఢమైన సరఫరా వ్యవస్థకు కావలసిన కీలక ఖనిజాలు మరింత ఎక్కువ స్థాయిలో అందుబాటులోకి వచ్చేటట్లు నిర్ధారించడానికి ప్రపంచంలో ఇతర దేశాలతోనూ ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంటామని ఆయన తెలిపారు.
కీలక ఖనిజాల భాగస్వామ్యంలో పాలుపంచుకోవడానికి అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఏ ఒక్క ప్రాంతమూ వాణిజ్యాన్ని ఒక ఆయుధంలా ఉపయోగించకుండా సమాన ఆలోచనలను కలిగి ఉన్న, ప్రజాస్వామిక, రుజువర్తన కలిగిన, నిష్పక్షపాత వ్యవహారాలు చక్కబెట్టే దేశాలు కలిసికట్టుగా పని చేయాలనే ఉద్దేశంతో అమెరికా మొదలుపెట్టిన ‘పాక్స్ సిలికా’ కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు.
500 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన పరిశ్రమగా ఆవిర్భవించే లక్ష్యం వైపు వాహన భాగాల పరిశ్రమ సాగుతున్న క్రమంలో, ఈ పరిణామాలు ఆ పరిశ్రమ ఒక అంతర్జాతీయ పాత్రధారిగా రూపొందడంలో తోడ్పడతాయని శ్రీ గోయల్ చెప్పారు.
పరిశ్రమకు కొన్ని నిర్దిష్ట ప్రాధాన్యాలు ఉన్నాయని శ్రీ గోయల్ అంటూ, అవి ఏమిటో కూడా తెలియజేశారు. స్థానిక కార్యకలాపాలను అంతర్జాతీయ కార్యకలాపాల్లోకి మార్చి, సరఫరా వ్యవస్థ ఇప్పటి కన్న బలపడటానికి సహకరించే ఉత్పాదనలను దృష్టిలో పెట్టుకొని ఒక క్రియాశీల దేశీయీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని పరిశ్రమకు ఆయన పిలుపునిచ్చారు. ఈ పనుల ఫలితంగా భవిష్యత్తులో అనూహ్య, గంభీర ఘటనల నుంచి కాపాడుకోవడం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు.
వేల్యూ చైన్‌లో పైపైకి ఎగబాకాలని, ఏకీకృత, అధిక విలువ కలిగిన పరిష్కారాలను అందజేయాలని పరిశ్రమకు ఆయన సూచనలు చేశారు. ఆయా పరిష్కారాలలో మంచి నాణ్యత కలిగిన ఉత్పాదనలు భాగం అయి ఉండాలని, ఆ ఉత్పాదనలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయగలగాలని ఆయన అన్నారు.
భద్రతకు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలని శ్రీ గోయల్ కోరారు. భద్రతకు సంబంధించిన ఆందోళనలను పూర్తిగా ప్రభుత్వానికే పరిశ్రమ వదిలిపెట్ట కూడదు అని ఆయన అన్నారు.
వాహన భాగాల తయారీ రంగంలో సాంకేతికత పెద్ద పాత్రను పోషించాలని, మెరుగైన నాణ్యత నియంత్రణ, వినియోగదారుల అవసరాలను చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి కృత్రిమ మేధను వినియోగించడానికి మొగ్గు చూపాలని మంత్రి చెప్పారు. వినియోగదారులు కోరుకునే సేవలకు విలువనిస్తూ రూపొందించే వాహనాలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి వాహనాలు అమెరికాలోనూ, ఐరోపాలోనూ విరివిగా ఆదరణకు నోచుకుంటున్నాయన్నారు. మెరుగైన భద్రత సదుపాయాలను జోడించడంపైనా శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.
వయసు మీరిన లేదా కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాలను అధికారికంగా తుక్కు కింద మార్చే ప్రక్రియను (వెహికిల్ స్క్రాపేజ్) గురించి శ్రీ గోయల్ మాట్లాడారు. పరిశ్రమతో పాటు ప్రభుత్వం కూడా కలిసికట్టుగా కృషి చేసి, స్క్రాపేజ్‌ను కొత్త వాహనాల కొనుగోలుదారుల దృష్టిలో లాభసాటి, ఉపయోగకర వ్యవహారంగా రూపొందించాలని ఆయన సూచించారు.
ప్రయివేటు రంగం, ప్రభుత్వం కలిసి చేసే ప్రయత్నాలతోనే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తన వైపు నుంచి విలువను సమకూర్చి, ప్రోత్సాహకాలను అందించే ప్రయత్నాలు చేసిందని, ఇక పరిశ్రమ తన వంతుగా ముందంజ వేసి వాహనాలను స్క్రాప్‌గా ప్రకటించాక వాటికి సరి అయిన ధరను ఇవ్వాలని, ఇలా చేస్తే కొత్త రకం వాహనాలకు ఒక పెద్ద మార్కెట్టును సృష్టించడం సాధ్యపడుతుందని మంత్రి అన్నారు.
వాహన రంగంలో పెంపొందుతున్న అమెరికా, భారత్ సహకారాన్ని గురించి భారత్‌లో అమెరికా రాయబారి శ్రీ సర్జియో గోర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సంబంధం ‘‘చరిత్రాత్మక ఉన్నత స్థాయి’’కి చేరిందని ఆయన వర్ణించారు. రెండు దేశాలు ‘‘ఒకేసారి చలనశీల రంగ భవితకు రూపురేఖలను కల్పిస్తున్నాయి’’ అని ఆయన వర్ణించారు. అమెరికాలో సరఫరా వ్యవస్థను పటిష్ఠపరచడంలో భారత వాహన భాగాల తయారీ పరిశ్రమ విశ్వసనీయ, వేగవంత పరిష్కారాలను చూపగల భాగస్వామిగా రూపొందిందని ఆయన అన్నారు. నిష్ఫక్షపాత, అన్యోన్య, పరస్పర ప్రయోజనకారి వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకునే దిశలో రెండు దేశాల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన వాణిజ్య అవగాహనను, చోటు చేసుకున్న ప్రగతిని ఆయన వివరించారు. జీ20 చర్చలకు అమెరికా త్వరలో ఆతిథ్యాన్ని ఇవ్వనుండగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ నెల చివర్లో అమెరికాలో పర్యటించనున్నారని  శ్రీ గోర్ వెల్లడించారు.
ఫార్మస్యూటికల్స్, సైన్య విక్రయాలు, విన్యాసాలు, సమాచార సాంకేతిక విజ్ఞానం, డేటా సెంటర్లు, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని శ్రీ గోర్ ప్రస్తావించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే నియంత్రణపూర్వక ప్రాథమిక ప్రణాళిక దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు‘పాక్స్ సిలికా డిక్లరేషన్’ అని ఆయన వర్ణించారు. దీనిలో చేరాల్సిందిగా కొన్ని దేశాలకు తొలుత ఆహ్వానం పంపినప్పుడు, ఆ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉందన్నారు. భారత్‌ ఆటోమోటివ్ విస్తారిత అనుబంధ వ్యవస్థలో అమెరికా కంపెనీలు, అమెరికాలో భారతీయ కంపెనీలు (ఉదాహరణకు భారత్ ఫోర్జ్, సుందరమ్ క్లేటన్, మహీంద్రా వంటివి) ఉన్నాయని శ్రీ గోర్ తెలిపారు. అమెరికాలో గ్రీన్‌ఫీల్డ్ అసెంబ్లీ, పరిశోధన అభివృద్ధి కేంద్రాలు, పంపిణీ నెట్‌వర్కుల వంటి మార్గాల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలను గురించి పరిశీలించాల్సిందిగా భారత్‌కు చెందిన వాహన భాగాల తయారీ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. అమెరికాలో 24 బిలియన్ డాలర్ల మేరకు నూతన పెట్టుబడి పెట్టడం ద్వారా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలన్నింటిలోకీ ఈ విషయంలో అగ్రగామిగా నిలిచిందని ఆయన తెలిపారు.
దక్షిణాసియాకు ట్రేడ్ కమిషనరు, పశ్చిమ భారత్‌కు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనరు శ్రీ హర్‌జిందర్ కాంగ్ మాట్లాడుతూ, భారత్ యూకే సంబంధాలు బలోపేతం కావాల్సి ఉందన్నారు. యూకే ఆధునిక తయారీ రంగ సామర్థ్యాలకు ఆటోమోటివ్, భావి కాల చలనశీలత రంగాలు కీలకంగా నిలిచాయని ఆయన తెలిపారు. ఆయన ‘భారత్, యూకే విజన్ 2035’, యూకేకు చెందిన ఆధునిక పారిశ్రామిక వ్యూహంతో పాటు భారత్, యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందాన్ని (సీఈటీఏ..
ఇది 2026 జులై 15 నుంచి అమలవుతోంది) గురించి ప్రస్తావించారు. యూకేకు చెందిన 99 శాతం, భారత్‌కు చెందిన 90 శాతం టారిఫ్ లైన్లపై సుంకాలను సున్నా స్థాయికి, లేదా చాలా తక్కువ స్థాయికి తగ్గించిన సంగతిని శ్రీ కాంగ్ గుర్తు చేశారు. అలాగే వాణిజ్య, వ్యాపారాలను సరళతరంగా మార్చడానికి కస్టమ్స్, సరిహద్దు ప్రక్రియలను సులభతరం చేశారని కూడా ఆయన చెప్పారు.
సరఫరా వ్యవస్థను సీఈటీఏ బలోపేతం చేస్తుందని, జాయింట్ వెంచర్లకు, భాగస్వామ్యాలకు వీలు కల్పిస్తుందని శ్రీ హర్‌జిందర్ కాంగ్ అన్నారు. పలితంగా వాహన భాగాలను తయారు చేసే కంపెనీలు ఇరు దేశాల మార్కెట్లలో టారిఫ్ లేకుండా తమ ఉత్పాదనలను విక్రయించగలుగుతాయన్నారు. ఆధునిక ఇంజినీరింగ్, నూతన ఆవిష్కరణలు, ఉద్గారాలకు తావు ఇవ్వని వాహన సాంకేతిక రంగంలో (ఉదాహరణకు ఎలక్ట్రిక్ మోటర్లు, బ్యాటరీలు, హైడ్రోజన్ సొల్యూషన్లు, వాహన బరువును తగ్గించి ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచే లైట్‌‌వెయిట్ కాంపోజిట్ల, సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహన వ్యవస్థలు) యూకే సాధించిన ప్రగతిని గురించి కూడా ఆయన తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2306377) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati