ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అనుబంధ, ఆరోగ్య సంరక్షణ విద్య, వృత్తిపరమైన ప్రమాణాలను

బలోపేతం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఎన్‌సీఏహెచ్‌పీ నియంత్రణ వ్యవస్థ కింద 33 నూతన, 21 పునర్నిర్మించిన/నవీకరించిన యూజీ, పీజీ డిగ్రీలను నోటిఫై చేసిన యూజీసీ

‘ఒకే దేశం - ఒకే పాఠ్యప్రణాళిక’ విధానం కింద అనుబంధ, ఆరోగ్య సంరక్షణ కోర్సుల్లో సారూప్యం తీసుకురావడమే యూజీసీ నోటిఫికేషన్ లక్ష్యం: ఎన్‌సీఏహెచ్‌పీ చైర్‌పర్సన్ డాక్టర్ యజ్ఞ ఉన్మేష్ శుక్లా

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 5:48PM by PIB Hyderabad

దేశం కోసం నైపుణ్యం, సామర్థ్యం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని తయారు చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుబంధ, ఆరోగ్య సంరక్షణ విద్య, శిక్షణ వృత్తిపరమైన ప్రమాణాలను బలోపేతం చేస్తోంది. ఈ దిశగా నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్సీఏహెచ్పీ) నియంత్రణ పరిధి కింద 33 నూతన, 21 పునర్నిర్మించిన/నవీకరించిన అనుబంధ, ఆరోగ్య సంరక్షణ సంబంధ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీలను విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ నోటిఫై చేసింది. 

 

యూజీసీ చట్టం-1956లోని సెక్షన్ 22(3) కింద డిగ్రీల నిర్దేశాలకు సంబంధించి 5వ సవరణను యూజీసీ జారీ చేసింది. ఎఫ్.21-12/2026(సీపీపీ-II) – (యూఐఎన్:3/2026) నంబరుతో 2026 ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ 2026 ఆగస్టు 31న ప్రచురితమైంది. దేశవ్యాప్తంగా అనుబంధ ఆరోగ్య సంరక్షణ విద్యలో మరింత ఏకరూపతను తీసుకురావడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఈ కీలక విభాగాల్లో విద్యాపరమైన, వృత్తిపరమైన మార్గాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ నోటిఫికేషన్ ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.

 

ఎన్సిఎహెచ్‌పి ఛైర్‌పర్సన్ డాక్టర్ యజ్ఞ ఉన్మేష్ శుక్లా మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, యూజీసీ, ఎన్సిఎహెచ్‌పి బృందాలు చేసిన కృషిని అభినందించారు. కమిషన్ నిర్దేశించిన ‘ఒకే దేశం – ఒకే పాఠ్యప్రణాళిక’ విధానంలో భాగంగా, అనుబంధ, ఆరోగ్య సంరక్షణ కోర్సులు, వాటి వ్యవధి, డిగ్రీల పేర్లు, ప్రవేశ అర్హతల్లో ఈ యూజీసీ నోటిఫికేషన్ ఏకరూపతను తీసుకువస్తుంది. ఎన్‌సీఏహెచ్‌పీ చట్టం, 2021 పరిధిలోని అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల్లో తమ కెరీర్‌ను మలచుకోవాలనుకునే విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ ఎంతగానో మార్గదర్శకంగా నిలుస్తుంది" అని ఆయన అన్నారు.

 

నోటిఫై చేసిన డిగ్రీలలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్ లాబొరేటరీ సైన్సెస్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, అనస్థీషియా - ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, న్యూట్రిషన్ - డైటెటిక్స్, సైకాలజీ, మెడికల్ - సోషల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్, మెడికల్ రేడియోలజీ, ఇమేజింగ్ - థెరప్యూటిక్ టెక్నాలజీ, ఫిజిషియన్ అసోసియేట్, రెస్పిరేటరీ టెక్నాలజీ, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ, హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇతర రంగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ డిగ్రీల నామకరణం, సంక్షిప్త నామాలు, కోర్సు వ్యవధి, ప్రవేశ అర్హతలను నిర్దిష్టంగా సూచించడమే కాకుండా, ఎంపిక చేసిన కొన్ని ప్రోగ్రామ్‌ల కాలపరిమితిని కూడా సవరించింది. 

ఈ నోటిఫికేషన్ నిర్దిష్ట రంగానికి చెందిన ప్రత్యేక (స్పెషలైజేషన్) డిగ్రీలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మాస్టర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీలో తొమ్మిది, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఎనిమిది, మాస్టర్ ఆఫ్ మెడికల్ లాబొరేటరీ సైన్సెస్ లో నాలుగు, మాస్టర్ ఆఫ్ మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీలో మూడు, మాస్టర్ ఆఫ్ రెస్పిరేటరీ టెక్నాలజీలో రెండు స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇది విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను విస్తరించడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎదురవుతున్న నూతన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయాలకు వీలు కల్పిస్తుంది.

 

ఈ సంస్కరణ ద్వారా అనుబంధ, ఆరోగ్య సంరక్షణ విద్యలో సంస్థాగత సమానత్వాన్ని, దేశవ్యాప్తంగా ఏకరీతి ప్రమాణాలను నెలకొల్పడంతో పాటు, డిగ్రీల నామకరణాన్ని అంతర్జాతీయంగా ఆమోదించిన డిగ్రీ స్థాయి అర్హతలకు అనుగుణంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో మరింత మంది విద్యార్థులు ఈ వృత్తులను ఎంచుకునేలా ప్రోత్సాహం లభించడంతో పాటు, స్పష్టమైన విద్యా, వృత్తిపరమైన మార్గాలు ఏర్పడతాయని, భారతీయ అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత వృత్తి చలనశీలత, గుర్తింపు లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

ఈ కార్యక్రమం నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 కింద ఎన్‌సీఏహెచ్‌పీకి నిర్దేశించిన చట్టబద్ధ బాధ్యతను నెరవేరుస్తుంది. ఈ చట్టం అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తులన్నింటిలో విద్యా ప్రమాణాలు, వృత్తిపరమైన సేవల ప్రమాణాలను నియంత్రించడం, నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతకు అనుగుణంగా, దేశవ్యాప్తంగా పాఠ్యప్రణాళికలు, డిగ్రీల పేర్లలో ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా ఎన్‌సీఏహెచ్‌పీ ఇప్పటికే 28 వృత్తులకు సంబంధించిన 18 సామర్థ్య ఆధారిత పాఠ్యప్రణాళికలను విడుదల చేసింది.

 

సామర్థ్య ఆధారిత పాఠ్యప్రణాళికలు ఆసుపత్రులు లేదా అనుబంధంగా పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో తగిన వ్యవధితో కూడిన ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ప్రత్యక్ష క్లినికల్ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి. సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలు, క్లినికల్ అనుభవాన్ని విద్యార్థులు పొందేలా ఈ విధానం దోహదపడుతుంది.

 

ఈ సంస్కరణలను అభ్యంతరం లేకుండా, సులభంగా అమలు పరిచేందుకు గాను 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన పాఠ్యాంశాలను నిర్బంధంగా అమలు చేయాలని ఎన్సిఎహెచ్‌పి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర సంబంధిత భాగస్వామ్య వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ కోర్సును ప్రారంభించేందుకు ఐచ్ఛిక అవకాశం కూడా కల్పించింది. తదుపరి విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి మిగిలిన సామర్థ్య ఆధారిత పాఠ్యాంశాలకు కూడా తుది రూపునిచ్చే దిశగా కమిషన్ పనిచేస్తోంది.

 

ఈ చర్యలు నైపుణ్యం, సరైన అర్హతలు కలిగిన అనుబంధ, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది లభ్యతను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. బహుళ విభాగాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వీరు అత్యంత కీలకమైన భాగం. ఈ సంస్కరణలు విద్యార్థులకు, విద్యా సంస్థలకు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు మరింత స్పష్టతను, స్థిరత్వాన్ని అందించడమే కాకుండా, వృత్తిపరమైన ఎదుగుదలకు, అంతర్జాతీయ అవకాశాలకు మెరుగైన ద్వారాలు తెరుస్తాయి.

 

అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను https://egazette.gov.in/(S(ueyx02zyglkszuhrd3rzsl1j))/ViewPDF.aspx ద్వారా చూడవచ్చు. 

 

*****


(రిలీజ్ ఐడి: 2306205) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Malayalam