పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అహ్మదాబాద్ నుంచి హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారత అంతర్జాతీయ విమానయాన హబ్ వ్యూహంలో మూడో స్పోక్ విమానాశ్రయంగా అహ్మదాబాద్
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 8:49PM by PIB Hyderabad
వారణాసి, అమృత్‌సర్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికుల రవాణా కోసం భారతదేశ హబ్ అండ్ స్పోక్ విధానంతో అనుసంధానించిన మూడో విమానాశ్రయంగా అహ్మదాబాద్‌ను చేరుస్తూ... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ రోజు అహ్మదాబాద్ నుంచి హబ్ అండ్ స్పోక్ (ఒక ప్రధాన విమానాశ్రయం కేంద్రంగా ఉండి, దానికి అనేక విమానాశ్రయాలు అనుసంధాన కేంద్రాలుగా పని చేసే విమాన సేవల విధానం) అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి పాల్గొన్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

2026 జూన్ 25న వారణాసి నుంచి ప్రారంభమైన హబ్ అండ్ స్పోక్ సేవలు భారతీయ విమానయాన రంగంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. ఈ ప్రాజెక్ట్ దశలవారీ విస్తరణలో భాగంగా, 2026 జూలై 28న అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి కూడా ఈ సేవలను ప్రారంభించారు. అహ్మదాబాద్‌ను కూడా ఈ నెట్‌వర్క్‌లో చేర్చడం ద్వారా, ఢిల్లీలోని మన సొంత హబ్ విమానాశ్రయం ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రపంచంతో నేరుగా అనుసంధానించే, సమగ్ర, నిరంతర, ప్రయాణికుల కేంద్రిత విమానయాన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే దిశగా ఈరోజు మరో కీలక ముందడుగు పడింది. ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి ప్రారంభమైన హబ్-అండ్-స్పోక్ కార్యకలాపాలు ప్రపంచ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇందులో 'ఏఐ1117' విమాన సర్వీసు ప్రయాణికులను ప్రధానంగా యూరప్, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతాలలోని 22 గమ్యస్థానాలకు అనుసంధానిస్తుంది. రాత్రి 20:15 గంటలకు బయలుదేరే సాయంత్రపు సర్వీసు ''ఏఐ 1121' ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని 17 గమ్యస్థానాలకు అనుసంధానతను విస్తరిస్తుంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ ప్రయాణికులకు రాబోయే మార్పులను వివరించారు. ఇప్పటి వరకు అహ్మదాబాద్ నుంచి పారిస్, టొరంటో లేదా సిడ్నీ వంటి గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా ఢిల్లీకి దేశీయ విమానంలో వెళ్లాల్సి వచ్చేదని, ఇందుకోసం వేర్వేరుగా టికెట్లు బుక్ చేసుకోవడం, ఢిల్లీ చేరుకున్న తర్వాత లగేజీని స్వయంగా తీసుకోవడం, పెద్ద విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్యూలను ఎదుర్కోవడం, అలాగే కనెక్టింగ్ విమానం తప్పిపోయే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. అయితే హబ్ అండ్ స్పోక్ విధానం కింద ఇమ్మిగ్రేషన్, చెక్-ఇన్ లగేజ్ చెక్-త్రూ ప్రక్రియలన్నీ ఇకపై అహ్మదాబాద్‌లోనే పూర్తవుతాయని, దీనివల్ల లగేజ్ నేరుగా ప్రయాణికుల చివరి అంతర్జాతీయ గమ్యస్థానానికే చేరుకుంటుందని వివరించారు.
2030 నాటికి భారతీయ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన కేంద్రంగా, 2047 నాటికి ప్రపంచంలోనే ప్రముఖ విమానయాన కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్ స్ట్రాటజీ'లో ఈ హబ్ అండ్ స్పోక్ నమూనా కీలకమైన భాగం. విదేశీ ట్రాన్సిట్ విమానాశ్రయాలపై ఆధారపడటాన్ని తగ్గించి, భారతీయ హబ్‌ల ద్వారా అనుసంధానతను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం భారతదేశ వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతాన్ని, విస్తృత విమానాశ్రయ మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటుంది.

తొలిసారి చేపట్టిన ఈ నూతన విధానం కింద, అంతర్జాతీయ ప్రయాణికులు ప్రపంచంలోని తమ గమ్యస్థానాలకు ప్రయాణాన్ని ప్రారంభించే ముందే, స్వయంగా అంతర్జాతీయ విమానాశ్రయమైన తమ ప్రారంభ స్పోక్ విమానాశ్రయంలోనే చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ నిబంధనలను పూర్తి చేసుకుంటారు. నిర్దేశిత హబ్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ లేదా కస్టమ్స్ ప్రక్రియలను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ తదుపరి అంతర్జాతీయ విమానంలోకి వెళ్ళవచ్చు. లగేజీ కూడా నేరుగా బదిలీ కావడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం ఏర్పడి ప్రయాణంలో ఎదురయ్యే సంక్లిష్టతలు తగ్గుతాయి.
ఈ విధానం సామర్థ్యం గురించి కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గత ఏడాది అహ్మదాబాద్ నుంచి అంతర్జాతీయ విమానాలు ఎక్కేందుకు 1.6 కోట్ల మంది ప్రయాణికులు ఢిల్లీకి ప్రయాణించారని తెలిపారు. ఈ హబ్ అండ్ స్పోక్ విధానం ద్వారా లభించే నిరాటంకమైన ప్రయాణ సౌకర్యంతో 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల కోసం అనేక గమ్యస్థానాల నుంచి వచ్చే అంతర్జాతీయ సందర్శకులకు ఆతిథ్యమివ్వడానికి అహ్మదాబాద్ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ విధానం వల్ల ప్రయాణికుల రాకపోకలు పెరిగి దాని ప్రయోజనాలు అహ్మదాబాద్‌లోని జౌళి, ఔషధాలు,, వజ్రాలు, రత్నాలు, ఇంజనీరింగ్ రంగాలకు చేకూరతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ హబ్ అండ్ స్పోక్ నమూనా ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి అంతర్జాతీయ అనుసంధానత పెరుగుతుంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా వినియోగమవుతాయి. విమానయాన సంస్థల నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భారతీయ విమానయాన రంగానికి ప్రపంచస్థాయి పోటీతత్వం చేకూరుతుంది.
ఈ ప్రయోజనాలు కేవలం విమానయాన రంగానికే పరిమితం కావు. అంతర్జాతీయ మార్కెట్లు, గమ్యస్థానాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడటం వల్ల ఈ మెరుగైన అంతర్జాతీయ అనుసంధానత గుజరాత్‌లోని వ్యాపార వర్గాలు, వజ్రాల ఎగుమతిదారులతో సహా ఇతర ఎగుమతిదారులు, హస్తకళాకారులు, పెట్టుబడిదారులు, పర్యాటకులు, విద్యార్థులకు కూడా విశేషంగా లబ్ది చేకూరుస్తుంది. జాతీయ హబ్ నెట్‌వర్క్‌తో అహ్మదాబాద్ బలమైన అనుసంధానం వ్యాపారం, పర్యాటకం, పెట్టుబడులు, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. తద్వారా ప్రపంచస్థాయి అనుసంధానత కలిగిన రాష్ట్రంగా గుజరాత్ ఎదుగుదలకు ఇది సహకరిస్తుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, విమానయాన హబ్‌ల అభివృద్ధి ద్వారా 2030 నాటికి దాదాపు 4 లక్షల (0.4 మిలియన్) ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రావడమే గాకుండా భారత జీడీపీకి అదనంగా 30 బిలియన్ అమెరికన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది. 2047 నాటికి, దీని మొత్తం ప్రభావం ద్వారా దాదాపు 1.6 కోట్ల (16 మిలియన్ల) ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలకు మద్దతు లభించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సహకారం అందే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ నుంచి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీసుల ప్రారంభం, క్రమంగా విస్తరిస్తున్న ఈ వ్యవస్థను రాబోయే నెలల్లో దేశంలోని మరిన్ని విమానాశ్రయాలకు విస్తరించడాన్ని సూచిస్తుంది. గుజరాత్‌లోని సూరత్ సహా మరో 22 విమానాశ్రయాలకు హబ్ అండ్ స్పోక్ కనెక్టివిటీని తదుపరి దశలో విస్తరించనున్నట్లు శ్రీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ మనోజ్ కుమార్ దాస్, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేష్ నిర్వాన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ కన్సల్‌తో పాటు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పరిశ్రమల సంఘాల ప్రతినిధులు, హోటల్, ఆతిథ్య రంగానికి చెందిన భాగస్వాములు, ట్రావెల్ భాగస్వాములు, పర్యాటక రంగ ప్రతినిధులు, విమానయాన, వాణిజ్య రంగాలకు చెందిన ఇతర కీలక భాగస్వాములు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అహ్మదాబాద్ నుంచి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు వివిధ రంగాల నుంచి లభిస్తున్న బలమైన సహకారానికి ఇది నిదర్శనంగా నిలిచింది.


***
(రిలీజ్ ఐడి: 2305843)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3