సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ అభివృద్ధి, ఆవిష్కరణ, మేధో సంపత్తి రంగాల్లో భారత్ - డెన్మార్క్ ద్వైపాక్షిక సహకారం బలోపేతం


భారత ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ - డెన్మార్క్ పేటెంట్, ట్రేడ్‌మార్కుల కార్యాలయం (డీకేపీటీవో) మధ్య కోపెన్‌హాగన్‌లో సంయుక్త కార్యవర్గ బృందం నాలుగో సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 12:20PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వశాఖ - డెన్మార్క్ పేటెంట్, ట్రేడ్‌మార్కుల కార్యాలయం (డీకేపీటీవో) సంయుక్త కార్యవర్గ బృందం (జేడబ్ల్యూజీ) నాలుగో సమావేశాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హేగన్‌లో నిర్వహించారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా 2026 ఆగస్టు 24 నుంచి 28 వరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఆవిష్కరణ వ్యవస్థలపై భారత్, డెన్మార్క్ అభిప్రాయాలను పరస్పరం పంచుకోవడానికి, సంస్థాగత సహకారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలను సమీక్షించేందుకు ఒక అనువైన వేదికను ఈ సమావేశం అందించింది. సాంకేతికత వినియోగం, ఆవిష్కరణలు, మేధో సంపత్తి, సాంకేతికత వాణిజ్యీకరణ, వ్యవస్థాపకత, క్లస్టర్ ఆధారిత ఎంఎస్ఎంఈల అభివృద్ధి తదితర అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.

భారత ప్రతినిధి బృందానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్ డాక్టర్ రజనీశ్ నేతృత్వం వహించారు. డైరెక్టర్ మహమ్మద్ సాలిక్ పర్వేజ్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి భాగ్య జగదీశ్వరన్, జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ (ఎన్ఐ-ఎంఎస్ఎంఈ) అధ్యాపకురాలు శ్రీమతి స్వప్న వనమాల ఈ బృందంలో ప్రతినిధులుగా ఉన్నారు.

డెన్మార్కులో భారత రాయబారి శ్రీ మనీశ్ ప్రభాత్, కౌన్సిలర్ శ్రీ ఆశిష్ ఆర్య.. కోపెన్‌హేగన్‌లోని భారత రాయబార కార్యాలయం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గౌరవ డీకేపీటీవో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియా స్కౌ, అంతర్జాతీయ సహకారంలో గౌరవ సీనియర్ సలహాదారు మత్తియాస్ డిన్నెట్జ్, న్యూఢిల్లీలోని రాయల్ డేనిష్ ఎంబసీ మేధో సంపత్తి హక్కుల కౌన్సిలర్ లూయిస్ బోయిసెన్ డెన్మార్క్ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉన్నారు.

ముఖ్యాంశాలు, చర్చలు

·         ఈ పర్యటనలో భాగంగా డెన్మార్క్ ఆవిష్కరణల సహాయక, వాణిజ్య క్లస్టర్ల వ్యవస్థల పట్ల అవగాహన పెంచుకునేందుకు.. ఆర్హూస్ విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్ ‘కిచెన్’, ‘ఆగ్రో ఫుడ్‌పార్కు’లను భారత బృందం సందర్శించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చే క్రమంలో.. నిపుణుల మార్గనిర్దేశం, అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమలు - విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం, క్లస్టర్ ఆధారిత విధానాల అమలుపై ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు తమ అనుభవాలను పరస్పరం పంచుకున్నారు.

·         డెన్మార్క్ పరిశ్రమలు, వ్యాపార - ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కూడా భారత ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా డెన్మార్క్‌లో వ్యాపారాభివృద్ధి, ఆవిష్కరణలు, చిన్న - మధ్య తరహా పరిశ్రమల వ్యవస్థలపై ఇరుపక్షాలు చర్చించాయి.

·         ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్ డాక్టర్ రజనీశ్ నేతృత్వంలో.. ప్రముఖ నార్డిక్ అంకుర సంస్థల సదస్సు ‘టెక్ బీబీక్యూ’ నిర్వహించిన ‘నార్డిక్ - భారత్ స్టార్టప్ సమ్మిట్ 2026’లో కూడా భారత ప్రతినిధి బృందం పాల్గొన్నది. నార్డిక్ ప్రాంత అంకుర సంస్థలు, ఆవిష్కరణల రంగానికి చెందిన భాగస్వాములతో ముఖాముఖి సంభాషించేందుకు, భారత ఎంఎస్ఎంఈ రంగ పురోగతిని, దృక్పథాన్ని వారికి వివరించేందుకు ఈ సదస్సు అవకాశాన్నిచ్చింది.

·         సమావేశ ముగింపు సందర్భంగా జరిగిన సంయుక్త కార్యవర్గ బృందం (జేడబ్ల్యూజీ) చర్చల్లో.. గతంలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలపై సమీక్షించారు. అలాగే ప్రస్తుత జేడబ్ల్యూజీ భాగస్వామ్య చట్రం పరిధిలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలు, భవిష్యత్ భాగస్వామ్య ప్రాధాన్యాలపైనా ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు.

·         జెడబ్ల్యూజీ యంత్రాంగం విజయవంతంగా పనిచేస్తుండడం, భారత్ - డెన్మార్క్ మధ్య సహకారం బలోపేతమవుతుండడంపై.. డెన్మార్కులో భారత రాయబారి శ్రీ మనీశ్ ప్రభాత్ హర్షం వ్యక్తం చేశారు. జేడబ్ల్యూజీ భాగస్వామ్య చట్రం పరిధిలో భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉండే మరిన్ని నూతన రంగాలకూ సహకారాన్ని విస్తరించాలని సూచించారు.

వైజ్ఞానిక వినిమయం, సంస్థాగత అనుసంధానాలు, పరస్పర ప్రయోజనకరమైన సహకార అవకాశాలను బలోపేతం చేసుకుంటూ.. ఎంఎస్ఎంఈల ఆవిష్కరణలను, మేధో సంపత్తి ఆధారిత పురోగతిని ప్రోత్సహించడంలో భారత్, డెన్మార్క్ సమష్టి నిబద్ధతను ఈ సమావేశం స్పష్టం చేస్తోంది.  

 

***


(రిలీజ్ ఐడి: 2305603) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Tamil