ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యా అధ్యక్షునితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 9:49PM by PIB Hyderabad
బిష్కక్ లో ఎస్‌సీఓ 26వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సంవత్సరంలో వారు ఇద్దరూ భేటీ కావడం ఇది మొదటిసారి. 2025 డిసెంబరులో ఢిల్లీలో 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నేతలు సమావేశమయ్యారు.
రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, అనుసంధాన, ప్రజా సంబంధాల రంగాలు సహా అనేక రంగాల్లో పరస్పర సహకారంలో నమోదైన పురోగతిని నేతలు ఇద్దరూ సమీక్షించారు. వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన భారత్, రష్యా అంతర్ ప్రభుత్వ సంఘం 27వ సదస్సు ఫలితాలను వారు హర్షించారు. ఈ సదస్సును 2026 ఆగస్టు 24న మాస్కోలో నిర్వహించారు.
భారత్ అధ్యక్షతన ఈ సంవత్సరంలో నిర్వహించనున్న బ్రిక్స్ సమావేశం సహా బహుళ పక్ష వేదికల్లో భారత్, రష్యా సహకారం అంశంపై నేతలు తమ ఆలోచనలను తెలియజేసుకొన్నారు. ఉభయ పక్షాల ప్రయోజనాలు ముడిపడి ఉన్న కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైన కూడా వారు తమ ఆలోచనలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా...పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో ప్రస్తుత సంఘర్షణల ప్రసక్తి కూడా వచ్చింది. ఈ సంఘర్షణలు నౌకావాణిజ్యంతో పాటు భారతీయ నావికుల భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. సంఘర్షణలను పరిష్కరించుకోవడానికి చర్చలు, దౌత్యం.. ఇవే ముందు ఉన్న మార్గం అని ప్రధానమంత్రి మరో సారి స్పష్టం చేశారు.
రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పటిష్ట పరుచుకోవడానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ భాగస్వామ్యం నిరంతరాయంగా పురోగమన పథంలో సాగుతోంది. అంతేకాకుండా భౌగోళిక, రాజకీయ అస్థిరతలు నెలకొన్నప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
ఈ ఏడాదిలో సెప్టెంబరు 12, 13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి భారత్‌కు రానున్న అధ్యక్షుడు శ్రీ పుతిన్‌కు స్వాగతం పలకడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2305388)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam