సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తరన్‌తరన్‌ కేసులో 5 రోజుల్లోగా నిందితుల అరెస్టు సహా తక్షణ చర్యలకు ‘ఎన్‌సీఎస్‌సీ' సిఫారసు


· దివంగత కేంద్ర హోం మంత్రి శ్రీ బూటాసింగ్‌పై అవమానకర వ్యాఖ్యల ఆరోపణ కేసులో కమిషన్ సమీక్ష

· ఢిల్లీ.. పంజాబ్‌లలో పిటిషనర్ సహా కుటుంబ సభ్యులకూ పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 8:03PM by PIB Hyderabad

   పంజాబ్‌లోని తరన్‌తరన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దివంగత కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బూటా సింగ్‌పై కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ అవమానకర వ్యాఖ్యాలు చేశారన్న ఆరోపణలకు సంబంధించి ఈ రోజు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ) చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా అధ్యక్షతన విచారణ నిర్వహించారు.

ఈ కేసులో ప్రతివాద అధికారుల తరపున పంజాబ్ డీఎస్పీ శ్రీ హర్‌ప్రీత్ సింగ్, పంజాబ్ పోలీస్ డీఎస్‌పీ (ఈఓ అండ్‌ సైబర్ క్రైమ్) శ్రీ గుల్జార్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు పిటిషనర్ అయిన, దివంగత శ్రీ బూటా సింగ్ కుమారుడు శ్రీ సరబ్‌జోత్ సింగ్ కూడా వచ్చారు.

సంబంధిత పక్షాల వాదనల అనంతరం రికార్డులలోని అంశాలను విచారణ కమిషన్‌ పరిశీలించింది. అటుపైన స్పందిస్తూ- మునుపటి విచారణలో నిర్దిష్ట సిఫారసులు చేసినప్పటికీ... దర్యాప్తు ముగించి, నిందితులను అరెస్టు చేయడం సహా చర్యల నివేదిక సమర్పణలో జాప్యంపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

లోగడ 2026 మే 5న విచారణ సమయాన నిర్దిష్ట నిబంధనల ప్రకారం నిర్ణీత వ్యవధిలో దర్యాప్తును పూర్తి చేయాలని కమిషన్ ఆదేశించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న పిటిషనర్ ఫిర్యాదును కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. తదనుగుణంగా షెడ్యూల్డ్ కులాలు-తెగలపై (అత్యాచార నిరోధక) చట్టం-1989లోని సెక్షన్ 15ఎ ప్రకారం పిటిషనరుతోపాటు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మేర రక్షణ కల్పించాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా చేపట్టిన చర్యలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉన్నా, తమకు అందలేదని కమిషన్ వ్యాఖ్యానించింది.

ఈ అనవసర జాప్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ- నిందితుల అరెస్టుకు చట్టప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలని కమిషన్‌ ఆదేశించింది. దాంతోపాటు చేపట్టిన చర్యలపై 5 రోజుల్లోగా నివేదిక  సమర్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది.

దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. దర్యాప్తు, అరెస్టులో జాప్యానికి బాధ్యులెవరో గుర్తించాలని సంబంధిత దర్యాప్తు సంస్థను కోరింది.

దర్యాప్తు అధికారి లేదా అధికారులు ఉద్దేశపూర్వకంగా విధులను నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే ఎస్సీ-ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం-1989లోని సెక్షన్ 4 కింద చర్యలపై పరిశీలన సహా చట్ట ప్రకారం తగిన శాఖాపరంగానూ చర్యలు చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో తన సిఫారసులపై 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరింది.

పిటిషనర్ భద్రత అంశాన్ని కూడా కమిషన్ ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని శ్రీ సరబ్‌జోత్ సింగ్‌ ఫిర్యాదు చేసిన దృష్ట్యా ఎస్సీ-ఎస్టీ ఎస్సీ చట్టంలోని సెక్షన్ 15ఏ ప్రకారం- ఢిల్లీ సహా పంజాబ్ రాష్ట్రంలోనూ పిటిషనరు సహా ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకూ తక్షణం తగిన రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.

ఈ మేరకు ఫిర్యాదుదారులు, బాధితులు సహా సాక్షులందరిపైనా ఆధారపడిన వారి రక్షణ ఓ కీలక చట్టబద్ధ బాధ్యతని కమిషన్ పునరుద్ఘాటించింది. ఎలాంటి భయం, ముప్పు లేదా బెదిరింపుల బెడద లేకుండా పిటిషనర్‌ కేసు సంబంధిత కార్యకలాపాలను  కొనసాగించేలా అధికారులు భరోసా ఇవ్వాలని నిర్దేశించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2305260) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Kannada