కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఎంఈఐ ట్యాంపరింగ్, టెలికమ్యూనికేషన్ గుర్తింపు వ్యవస్థల దుర్వినియోగం గురించి పౌరులను అప్రమత్తం చేసిన టెలికమ్యూనికేషన్ల శాఖ

ఐఎంఈఐ ట్యాంపరింగ్, టెలికాం గుర్తింపు వ్యవస్థల దుర్వినియోగానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా

తమ మొబైల్ కనెక్షన్లు, హ్యాండ్‌సెట్‌లను ధ్రువీకరించుకోవడానికి సురక్షితంగా ఉంచుకోవడానికి సంచార్ సాథీ పోర్టల్, మొబైల్ యాప్‌ ఉపయోగించాలని పౌరులకు సూచన

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 8:06PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ పరికరాల ‘అంతర్జాతీయ మొబైల్ పరికర గుర్తింపు (ఐఎంఈఐ)’ సంఖ్య సహా టెలికమ్యూనికేషన్ గుర్తింపు వ్యవస్థల దుర్వినియోగం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఇటువంటి దుర్వినియోగం పౌరుల భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల భద్రత, సమగ్రతకూ ప్రమాదకరం. ప్రత్యేకమైన ఈ టెలికమ్యూనికేషన్ గుర్తింపు వ్యవస్థలను తారుమారు చేయడాన్ని, దుర్వినియోగం చేయడాన్ని నిరోధించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం చట్టపరంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.

టెలి కమ్యూనికేషన్ల చట్టం-2023 దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం... ఐఎంఈఐ నంబర్లను తారుమారు చేయడం, అనధికారిక లేదా తారుమారు చేసిన టెలికమ్యూనికేషన్ గుర్తింపు వివరాలతో పరికరాలను ఉపయోగించడం శిక్షార్హమైన నేరమని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ) పునరుద్ఘాటిస్తోంది.

చట్టపరమైన కీలక నిబంధనలు

మొబైల్ హ్యాండ్‌సెట్లు, ఇతర టెలి కమ్యూనికేషన్ పరికరాల ఐఎంఈఐ నంబరు సహా టెలి కమ్యూనికేషన్ గుర్తింపు వ్యవస్థలను తారుమారు చేసే వారిపై టెలికమ్యూనికేషన్ల చట్టం-2023 ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటారు.

సెక్షన్ 42(3)(c) టెలికమ్యూనికేషన్ గుర్తింపు వ్యవస్థల ట్యాంపరింగ్‌ను నిషేధిస్తుంది. సెక్షన్ 42(3)(e) మోసం, వంచన లేదా నకిలీ గుర్తింపు ద్వారా సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్స్ (సిమ్‌లు) లేదా టెలికమ్యూనికేషన్ గుర్తింపులను పొందడాన్ని నిషేధిస్తుంది.

ఈ చట్టాల ఉల్లంఘనలకు గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇటువంటి నేరాలు చట్టంలోని సెక్షన్ 42(7) ప్రకారం గుర్తించదగినవి, నాన్-బెయిలబుల్. సెక్షన్ 42(6) ప్రకారం... అటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు లేదా వాటిని ప్రోత్సహించే వ్యక్తులకూ అదే శిక్ష వర్తిస్తుంది.

పౌరులు నివారించాల్సినవి

పౌరులు కింది వాటికి దూరంగా ఉండాలని డీవోటీ సూచిస్తోంది:

కాన్ఫిగర్ చేయగల లేదా ట్యాంపర్ చేసిన ఐఎంఈఐలతో మోడెమ్‌లు, మాడ్యూళ్లు, సిమ్ బాక్స్‌లు లేదా ఇతర పరికరాలను ఉపయోగించడం, సేకరించడం లేదా సమీకరించడం.

నకిలీ పత్రాలు, మోసం, వంచన లేదా వేరొకరి పేరుతో మోసపూరితంగా సిమ్ కార్డులను పొందడం.

తమ పేరు మీద పొందిన సిమ్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ఇతరులకు బదిలీ చేయడం, అమ్మడం లేదా అప్పగించడం.

మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు లేదా మరే ఇతర మార్గాలనైనా ఉపయోగించి కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సీఎల్ఐ) లేదా ఇతర టెలికమ్యూనికేషన్ గుర్తింపు వ్యవస్థలను సవరించడం.

పౌరులు తమ సొంత పేరు మీద సిమ్ కార్డులు కొనుగోలు చేసి, ఆ తర్వాత సైబర్ మోసం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం ఆ సిమ్‌ను ఇతరులకు అప్పగించడం, అద్దెకు ఇవ్వడం, అక్రమంగా తరలించడం వంటివి చేస్తే... అసలు సబ్‌స్క్రైబర్ చట్టపరంగా బాధ్యత వహించవలసి వస్తుందని గమనించాలి.

ట్యాంపర్ చేసిన ఐఎంఈఐ నంబరు గల డివైజ్‌లను ఉపయోగించడం, మోసపూరిత మార్గాల ద్వారా సిమ్ కార్డులను పొందడం, లేదా వాటిని దుర్వినియోగం చేసే వ్యక్తులకు సిమ్ కార్డులను బదిలీ చేయడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు.

సంచార్ సాథీ ద్వారా ధ్రువీకరణ, రిపోర్టింగ్

పౌరులు అప్రమత్తంగా ఉండాలనీ... తమ మొబైల్ హ్యాండ్‌సెట్లు ధ్రువీకరించుకోవడానికి, సురక్షితంగా ఉంచుకోవడానికి సంచార్ సాథీ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.

సంచార్ సాథీ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొబైల్ హ్యాండ్‌సెట్ ఐఎంఈఐ వివరాలను ధ్రువీకరించుకోవచ్చు. ఈ సేవ ద్వారా పౌరులు పరికరానికి సంబంధించిన బ్రాండ్ పేరు, మోడల్ పేరు, తయారీదారు సమాచారం వంటి వివరాలనూ తనిఖీ చేసుకోవచ్చు.

టెలికమ్యూనికేషన్ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి, భారత టెలికమ్యూనికేషన్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. పౌరులు తమ మొబైల్ కనెక్షన్‌లను, పరికరాలను ధ్రువీకరించుకోవడానికి, రక్షించుకోవడానికి 'సంచార్ సాథీ' కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న వివిధ సేవలను పొందవచ్చు.

టెలికాం సంబంధిత మోసాలను నివారించడానికి, పౌరులను వాటి నుంచి రక్షించడానికి... వారికి సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయమైన టెలికమ్యూనికేషన్ వాతావరణాన్ని నిర్ధారించడం కోసం టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023లోని నిబంధనలు, దాని కింద రూపొందించిన నియమాలను పాటించడం అత్యవసరం.

ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న వివిధ పౌర-కేంద్రిత సేవలను పొందడానికి, పౌరులు సంచార్ సాథీ పోర్టల్‌ www.sancharsaathi.gov.in ని సందర్శించాలని లేదా సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడమైనది.

ఆండ్రాయిడ్ కోసం: https://play.google.com/store/apps/details?id=com.dot.app.sancharsaathi

ఐవోఎస్ కోసం: https://apps.apple.com/app/sancharsaathi/id6739700695

 

***


(రిలీజ్ ఐడి: 2305258) సందర్శకుల సూచీ సంఖ్య : : 68
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Malayalam , Urdu , हिन्दी , Marathi , Assamese