వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూనెగింజల సాంకేతికతల వాణిజ్యీకరణను వేగవంతం చేసేందుకు హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సంప్రదింపులు, పరిశ్రమల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్న ఐసీఏఆర్- ఐఐఓఆర్

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 4:33PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని ఐసిఎఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (ఐసిఎఆర్- ఐఐఓఆర్) 2026 సెప్టెంబర్ 10వ తేదీన "సుస్థిర వ్యవసాయం కోసం రకాలు/సంకర రకాలు, బయోలాజికల్స్, బయోపాలిమర్ ఆధారిత మల్టీలేయర్ విత్తన లేపన సాంకేతికతలలో నూతన ఆవిష్కరణలు: సాంకేతికతల వాణిజ్యీకరణ -  విస్తరణ కోసం పరిశ్రమలతో భాగస్వామ్యాలు" అంశంపై జాతీయ స్థాయి సంప్రదింపులను పరిశ్రమల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించనుంది.

ప్రపంచంలో వంట నూనెలకు సంబంధించిన ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న భారత్ లో వంటనూనెల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, స్వయం సమృద్ధిని సాధించడానికి దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాల వేగవంతమైన అభివృద్ధి, వాణిజ్యీకరణ, వినియోగం అత్యంత ఆవశ్యకం. ఈ నేపథ్యంలో, ఐసిఎఆర్ - ఐఐఓఆర్ మెరుగైన నూనెగింజల రకాలు,  సంకర రకాలు, బయోపాలిమర్ ఆధారిత విత్తన నాణ్యత పెంపు సాంకేతికతలు, సూక్ష్మజీవుల ఆధారిత జీవ పురుగుమందుల తయారీ విధానాలతో సహా అనేక ఆశాజనకమైన సాంకేతికతలను అభివృద్ధి చేసింది.

ఈ సమావేశం విత్తన పరిశ్రమ, జీవ పురుగుమందుల, జీవ ఆధారిత వ్యవసాయ ఉత్పాదకాల తయారీ సంస్థలు, టెక్నాలజీ లైసెన్స్‌దారులు, అగ్రి బిజినెస్ సంస్థలు, అంకుర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఈ సందర్భంగా ఐసిఎఆర్ - ఐఐఓఆర్  తమ నూతన సాంకేతికతలను ప్రదర్శించడంతో పాటు, సాంకేతికత బదిలీ, లైసెన్సింగ్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, విస్తృత స్థాయి విస్తరణకు ఉన్న అవకాశాలను అన్వేషించనుంది.

ఈ కార్యక్రమం పరిశోధన రంగానికి, పరిశ్రమలకూ మధ్య అనుసంధానాన్ని, సంబంధిత భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇది వినూత్న సాంకేతికతల ప్రామాణీకరణ, వాణిజ్యీకరణ, వినియోగాన్ని సులభతరం చేయడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ భారతీయ నూనెగింజల రంగం సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2305057) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil