ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధానమంత్రి కిర్గిజ్‌ అధ్యక్షుడి మధ్య ద్వైపాక్షిక సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 4:33PM by PIB Hyderabad

   కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్‌ నగరంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ సదిర్ జపరోవ్‌తో సమావేశమయ్యారు.

ఇద్దరు నాయకుల మధ్య చర్చల ప్రారంభానికి ముందు- కిర్గిజ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజున ‘ఎస్‌సీఓ’ 26వ శిఖరాగ్ర సదస్సు శ్రీకారం చుట్టుకోవడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నదని పేర్కొన్నారు. సదస్సుకు కిర్గిజ్‌ ఆతిథ్యంపై అధ్యక్షుడు జపరోవ్‌ను శ్రీ మోదీ అభినందించారు. భారత్‌-కిర్గిజ్‌ ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రగతిపై వారిద్దరూ తొలుత సమీక్షించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రెండు ఆర్థిక వ్యవస్థల నడుమన గల ప్రధాన పరస్పర పూరక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ- ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని మరింత విస్తృతం చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అలాగే, విద్యా రంగంలో ఆదానప్రదాన కార్యక్రమాలు, సాంస్కృతిక సహకారం సహా ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంపైనా చర్చించారు.

కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో భారత్‌ అత్యున్నత భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది రెండు దేశాల మధ్యగల సన్నిహిత, సుదీర్ఘ సంబంధాలతోపాటు పరస్పర గౌరవం, విశ్వాసం, మద్దతును ప్రతిబింబిస్తుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు సదిర్ జపరోవ్ చూపిన ఆత్మీయత, సాదర ఆతిథ్యంతో పాటు ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ప్రధానమంత్రి ఆయనకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2305049) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada