ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎస్‌సీవో సదస్సు నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షునితో ప్రధాని సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 3:54PM by PIB Hyderabad

బిష్కెక్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సదస్సు నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవలి పరిణామాలపై కూడా వారు చర్చించారు. అలాగే మారుతున్న పరిస్థితులపై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల పట్ల ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలన్న స్థిరమైన భారత్ వైఖరిని స్పష్టం చేశారు.

ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతిని, స్థిరత్వాన్ని సాధించేందుకు ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని, వాణిజ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. వాణిజ్య నౌకాయానం, నావికులతో సహా పౌరులు, మౌలిక వసతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని తలపెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు.

బ్రిక్స్, ఎస్‌సీవోతో సహా బహుపాక్షిక సంస్థల్లో ఇరాన్‌తో సన్నిహిత సహకారానికి భారత్ సంసిద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అలాగే భారత్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షులు పెజెష్కియాన్‌‌ను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నానని తెలియజేశారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2304984) సందర్శకుల సూచీ సంఖ్య : : 7