సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తల్లులను సాధికారులుగా తీర్చిదిద్దడం ద్వారా పిల్లల్లో వైకల్యాలను ముందుగానే గుర్తించవచ్చు: డాక్టర్‌ జితేంద్ర సింగ్


నివారించగల వైకల్యాలను అరికట్టేందుకు మహిళల్లో మరింత అవగాహన అవసరం: కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్


పిల్లల ఎదుగుదల, ఆరోగ్య అవసరాలను తల్లులే ముందుగా గుర్తిస్తారు.. గర్భధారణ సమయంలో అవగాహన, సకాలంలో స్క్రీనింగ్‌తో ముందస్తు వైద్యం, నివారణ సాధ్యం: డాక్టర్‌ జితేంద్ర సింగ్


నివారించదగిన వైకల్యాల నివారణ, దివ్యాంగుల సాధికారతపై ప్రబుద్ధ ‘మాతృశక్తి సమ్మేళనం’లో డాక్టర్‌ జితేంద్ర సింగ్ ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2026 6:38PM by PIB Hyderabad

తల్లులకు సాధికారత కల్పించడం ద్వారా పిల్లల్లో వైకల్యాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

 

నివారించగల వైకల్యాల నివారణ, దివ్యాంగుల సాధికారతపై మహిళలకు అవగాహన కల్పించేందుకు సాక్షం సంస్థ నిర్వహించిన ప్రబుద్ధ  ‘‘మాతృశక్తి సమ్మేళనం’’ కార్యక్రమాన్ని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అభినందించారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను చాలాసార్లు తల్లులే ముందుగా గుర్తిస్తారని, అందువల్ల దివ్యాంగ సేవ, సాధికారత అనే విస్తృత లక్ష్యంలో మహిళల్లో అవగాహనకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో సరైన అవగాహనతో పాటు క్రమం తప్పకుండా పరీక్షలు, సిఫార్సు చేసిన స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కొన్ని రుగ్మతలను తొలిదశలోనే గుర్తించవచ్చని తెలిపారు. తద్వారా సకాలంలో వైద్య సలహా, చికిత్స అందించి నివారించగల ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.

 

విద్యావంతులు, అవగాహన కలిగిన, సామాజిక బాధ్యత కలిగిన మహిళలను దివ్యాంగ సేవ, సాధికారత, నివారించగల వైకల్యాల నివారణ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వాములుగా చేయడం ‘ప్రబుద్ధ  మాతృశక్తి సమ్మేళనం’ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పిల్లలు, కుటుంబాల ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమంతో సన్నిహిత సంబంధం ఉన్న తల్లులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, సమాజ నాయకుల పాత్రకు ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది.

 

డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. నివారించగల వైకల్యాలను అరికట్టే ప్రయత్నాలు సాధ్యమైనంత తొందరగా, శిశువు జన్మించకముందే ప్రారంభం కావాలని అన్నారు. తల్లి ఆరోగ్యం, తగిన పోషకాహారం, గర్భధారణకు ముందు–తర్వాత వైద్య సంరక్షణ, ఇన్ఫెక్షన్ల నివారణ, మందులను సురక్షితంగా వినియోగించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్య నిపుణులను సకాలంలో సంప్రదించడం వంటి అంశాలపై అవగాహన ఉంటే గర్భధారణ, చిన్ననాటి కీలక దశల్లో కుటుంబాలు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. గర్భధారణ సమయంలోనే ఏదైనా సమస్యను గుర్తించే అవకాశం ఉంటే, సకాలంలో వైద్యం, తగిన సంరక్షణ ద్వారా ఫలితాలను గణనీయంగా మెరుగుపరచవచ్చని అన్నారు.

 

తన గత 12 సంవత్సరాల అనుభవం కూడా అవగాహన, సహాయక వ్యవస్థలను కుటుంబాలు, సమాజ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇందులో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంలో వచ్చే మార్పులను చాలాసార్లు తల్లులే మొదటగా గుర్తిస్తారని, అందువల్ల వారికి సరైన అవగాహన, జ్ఞానం కల్పించడం ద్వారా వైకల్యాలను ముందుగానే గుర్తించడం, తగిన వైద్య సేవలకు సిఫార్సు చేయడం, అందుబాటులో ఉన్న సహాయాన్ని సకాలంలో పొందడం సాధ్యమవుతుందని తెలిపారు.

 

అయితే అవగాహన కేవలం నివారణకే పరిమితం కాకుండా దివ్యాంగుల సంపూర్ణ సాధికారత వరకూ విస్తరించాలని కేంద్రమంత్రి అన్నారు. పిల్లలు, దివ్యాంగులు సకాలంలో వైకల్య గుర్తింపు, విద్య, పునరావాసం, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్వావలంబనకు అవసరమైన అవకాశాలను పొందేలా చూడటం ద్వారా మహిళలు దివ్యాంగుల సాధికారతకు బలమైన మార్గదర్శకులుగా నిలవగలరని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

 

ఈ విస్తృత ప్రయత్నంలో భాగంగా, దివ్యాంగులకు మద్దతును బలోపేతం చేయడంతో పాటు సమాజంలో వారి భాగస్వామ్యానికి మరిన్ని అవకాశాలను కల్పించేందుకు గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. కుటుంబాలు, సమాజ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న మాతృశక్తి సమ్మేళనం వంటి కార్యక్రమాలకు ఈ ప్రయత్నాలు తోడ్పడుతున్నాయని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

 

దివ్యాంగుల కోసం క్రీడలు, ప్రత్యేక మౌలిక వసతుల విస్తరణను కూడా డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రస్తావించారు. దివ్యాంగుల కోసం దేశంలో తొలి అత్యాధునిక క్రీడా శిక్షణ కేంద్రాన్ని మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ఇందులో అత్యున్నత స్థాయి శిక్షణ, క్రమబద్ధమైన క్రీడా శిక్షణకు అవసరమైన సహకారం అందిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక మౌలిక వసతులు క్రీడల్లో ప్రతిభను చాటుకునేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పారిస్‌ 2024 పారా ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌ రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించడంలో కూడా దోహదపడ్డాయని తెలిపారు.

 

దివ్యాంగులైన పిల్లలకు ముందస్తు వైద్య సేవలను కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. శిశు దశ నుంచే దివ్యాంగ పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రకాల వైకల్యాలకు సంబంధించిన ప్రారంభ చికిత్సా కేంద్రాలను ( క్రాస్-డిసబిలిటీ ఎర్లీ ట్రీట్‌మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వయసులోనే వైకల్యాన్ని గుర్తించి, తగిన చికిత్స, పునరావాసం, సహకారం అందించడం ద్వారా పిల్లలు తమ అభివృద్ధి సామర్థ్యాన్ని పూర్తిగా సాధించడంతో పాటు విద్య, సమాజంలో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది.

 

దివ్యాంగ పిల్లలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు ప్రత్యేక సదుపాయాలను డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రస్తావించారు. పిల్లల ప్రత్యేక అవసరాలను తీర్చుకునే కుటుంబాలకు మరింత మద్దతు అందించేందుకు ఈ సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోటేషనల్‌ బదిలీ నుంచి మినహాయింపు, 22 ఏళ్ల వయస్సు వరకు పిల్లల విద్యా భత్యం, వైద్య సదుపాయాలకు సమీప ప్రాంతాల్లో పోస్టింగ్‌కు అవకాశం, రెండేళ్ల వేతనంతో కూడిన శిశు సంరక్షణ సెలవులు‌ వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.

 

గర్భధారణ, బాల్య దశ నుంచి విద్య, పునరావాసం, నైపుణ్యాభివృద్ధి, చివరకు స్వావలంబన వరకు జీవితంలోని ప్రతి దశను ఆదుకునే సహాయక వ్యవస్థ ఆవశ్యకతను ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు సంస్థాగత సహకారాన్ని అందిస్తున్నప్పటికీ, మహిళలు, కుటుంబాల్లో నిరంతర అవగాహన పెంపొందించడం ద్వారా ఈ సేవలు పిల్లలకు అత్యంత ప్రయోజనం చేకూర్చగల దశలోనే వారికి అందేలా చూడవచ్చని పేర్కొన్నారు.

 

అందువల్ల ‘ప్రబుద్ధ మాతృశక్తి సమ్మేళనం’ ఉద్దేశం ప్రస్తుతం దివ్యాంగులకు మద్దతు అందించడానికే పరిమితం కాదని, భవిష్యత్తులో ఆరోగ్యకరమైన, సమ్మిళిత, సాధికారత కలిగిన తరాన్ని నిర్మించేందుకు నేటి నుంచే మరింత అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. సాధికారత పొందిన తల్లులు, అవగాహన కలిగిన కుటుంబాలే ముందస్తు నివారణ, ముందస్తు గుర్తింపు, సమాజంలో దివ్యాంగుల మరింత భాగస్వామ్యానికి పునాదిగా నిలుస్తాయని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు

 

ప్రతి తల్లికి అవగాహన, ప్రతి కుటుంబానికి సాధికారత, ప్రతి చిన్నారికి సాధ్యమైనంత ఉత్తమమైన ప్రారంభం కల్పించడం, ఎవరినీ వెనుక వదలకపోవడమే తమ లక్ష్యమని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు.

 

ఎమ్మెల్యే రాజీవ్‌ జస్రోటియా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ గత 12 సంవత్సరాలుగా చేస్తున్న నిరంతర కృషి కారణంగా కథువా జిల్లాలో ఊహించని స్థాయిలో మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

 

‘సాక్షం’ తరఫున జాతీయ కార్యదర్శి అభయ్‌ పర్గల్‌ స్వాగత ప్రసంగం చేశారు. దేశవ్యాప్తంగా దివ్యాంగుల సాధికారత కోసం సాక్షం సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వాటి లక్ష్యాలను వివరించారు. జమ్మూకశ్మీర్‌లో, ముఖ్యంగా కథువాలో గతంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను కూడా ఆయన వెల్లడించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ స్వామి విశ్వానంద్‌, సాక్షం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ ప్రజ్ఞా ఖన్నా, శ్రీ అత్రి, మంజీత్‌ సింగ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2304583) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil