రక్షణ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో భారత్ - కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 5:10PM by PIB Hyderabad
భారత్ - కువైట్ సంయుక్త రక్షణ కమిటీ (జేడీసీ) తొలి సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, సిబ్బంది స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన - అభివృద్ధి తదితర విస్తృత రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
భారత్, కువైట్ మధ్య రక్షణ సహకారంపై కుదిరిన అవగాహన ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాలను అమలు దిశగా ముందుకు తీసుకెళ్లడంలో జేడీసీ తొలి సమావేశం కీలక ముందడుగుగా నిలిచింది. 2024 డిసెంబర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా ఈ రక్షణ సహకార అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ సమావేశానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అమితాబ్ ప్రసాద్, కువైట్ నుంచి ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందానికి చెందిన బ్రిగేడియర్ జనరల్ రాయెద్ అల్‌సక్రాన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తుల విభాగం, రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
జేడీసీ సమావేశానికి ముందు, బ్రిగేడియర్ జనరల్ రాయెద్ అల్‌సక్రాన్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, అమర వీరులకు నివాళులర్పించారు. కువైట్ ప్రతినిధి బృందం పర్యటన తొలిరోజున న్యూఢిల్లీలోని డీపీఎస్యూ భవన్‌ను సందర్శించింది. భారత రక్షణ పరిశ్రమ ప్రతినిధులతో పరస్పర సహకారానికి అవకాశం ఉన్న రంగాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. కువైట్ ప్రతినిధి బృందంతో రెండో రోజు కూడా రక్షణ పరిశ్రమ ప్రతినిధులు సమావేశం నిర్వహించనున్నారు.
భారత్, కువైట్ దేశాలు చారిత్రక సంబంధాలపై ఆధారపడిన సాంప్రదాయక స్నేహపూర్వక, సుహృద్భావ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఈ సంబంధాలు కాలపరీక్షకు తట్టుకుని నిలిచాయి. ఇరు దేశాల మధ్య 1962లో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. 2024 డిసెంబర్‌లో భారత ప్రధానమంత్రి కువైట్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. భౌగోళిక సారూప్యం, చారిత్రక వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సారూప్యతలు, కువైట్‌లో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉండటం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న బహుముఖ సంబంధాలను సుస్థిరం చేస్తూ, మరింత బలోపేతం చేస్తున్నాయి.
****
(రిలీజ్ ఐడి: 2304418)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7