నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

100 కొత్త నౌకలను సమకూర్చుకునేలా భారత్ ప్రణాళిక... 75 బిలియన్ డాలర్ల విదేశీ వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించుకోవడమే లక్ష్యం: జాతీయ షిప్పింగ్ బోర్డు ‘సాగర్ సంవాద్’లో సర్బానంద సోనోవాల్

ఎన్ఎస్‌బీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సర్బానంద సోనోవాల్.. సాగర్ సంవాద్‌లో వార్షిక నివేదికల స్వీకరణ

ఢిల్లీలో జాతీయ షిప్పింగ్ బోర్డు ‘సాగర్ సంవాద్’ ప్రారంభోత్సవంలో సోనోవాల్‌తో కలిసి పాల్గొన్న మాన్సుఖ్ మాండవీయ, శంతనూ ఠాకూర్

విదేశీ నౌకలతో పోలిస్తే భారతీయ జెండా కలిగిన నౌకల నిర్వహణ వ్యయం 16 - 20% అధికం.. ‘సాగర్ సంవాద్’లో అయిదు అంశాల పరిష్కార మార్గాన్ని ప్రతిపాదించిన ఎన్‌ఎస్‌బీ నిపుణుల బృందం

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 7:35PM by PIB Hyderabad

భారత వర్తక నౌకాదళానికి రాబోయే అయిదేళ్లలో 100 కొత్త నౌకలను సమకూర్చి, విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతోపాటు అయిదు సూత్రాల ప్రణాళికను అమలు చేయాలని.. జాతీయ షిప్పింగ్ బోర్డు (ఎన్ఎస్‌బీ)కు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నిర్దేశించారు. ఈ రోజు నిర్వహించిన ఎన్ఎస్‌బీ తొలి ‘సాగర్ సంవాద్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రోజంతా సాగిన ఈ చర్చా కార్యక్రమంలో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు.

‘మారిటైమ్ ఇండియా విజన్ - 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ - 2047 దిశగా ప్రణాళికా రచన’ అనే ప్రధాన ఇతివృత్తంతో వినయ్ మార్గ్‌లోని సివిల్ సర్వీసుల అధికారుల సంస్థలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ అధికారులు, నౌకా యజమానులు, ఆర్థిక నిపుణులు, పలు నౌకాయాన శిక్షణ సంస్థల యువ కేడెట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాగర్ సంవాద్ అంటే ‘సముద్ర చర్చ’ అని అర్థం. ‘సముద్రంలో జ్ఞానం, దేశంలో ప్రగతి’ అనే బోర్డు మార్గనిర్దేశక సూక్తిని.. ఈ కార్యక్రమం ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించారు.

సాగర్ సంవాద్ ప్రారంభ సదస్సుకు కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బోర్డు అధికారిక వెబ్‌సైటును ఆయన ప్రారంభించారు. 2025-26 వార్షిక నివేదికను, ప్రభుత్వానికి విధానపరమైన సలహాలతో కూడిన ఉపసంఘం నివేదికలను ఎన్‌ఎస్‌బీ చైర్‌పర్సన్ సమీర్ కుమార్ ఖారే కేంద్ర మంత్రికి సమర్పించారు. 2025 మే నెలలో బోర్డు పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటి నుంచి చేపట్టిన పనులను నివేదికల్లో వివరించారు.

‘‘మంత్రిత్వశాఖకు సలహాలనిచ్చే ఎన్‌ఎస్‌బీ.. ఆ శాఖ కన్నా కూడా పురాతనమైనది. నావికులు, వాటి యజమానులు, పెట్టుబడిదారుల సలహాలు విన్న తర్వాతే భారత నౌకాయాన విధానాన్ని రూపొందించాలన్న లక్ష్యంతోనే 1958లో ఈ చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటైంది’’ అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో.. పునరుద్ధరించిన వాణిజ్య నౌకాయాన చట్టం - 2025, నూతన జాతీయ నౌకాయాన సంస్థ నిబంధనల ప్రకారం సంస్థ బాధ్యతలను పునరుద్దరించి మరింత బలోపేతం చేశాం. భారత ప్రజాస్వామ్య అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా విధాన రూపకర్తలు, పారిశ్రామిక అధినేతలు, సాంకేతిక నిపుణులు, పౌర సమాజాన్ని ఒకే వేదికపైకి తెచ్చి.. చర్చించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి, మేధోపరంగా ఏకాభిప్రాయ సాధనకు ‘సాగర్ సంవాద్’ వంటి వేదిక అత్యంత కీలకమైనది. అదే మనల్ని 2047 నాటికి ఆత్మనిర్భర నావికా భారత్ లక్ష్యసాధన దిశగా నడిపిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఓడరేవులునౌకాయానం, జలమార్గాల మంత్రిత్వశాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నావికా శిక్షణ సంస్థల నుండి వచ్చిన ట్రెయినీ అధికారులతో సోనోవాల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ రంగంలోని యువశక్తిగా వారిని నిర్వాహకులు అభివర్ణించారు. వారి ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రూ. 10,000 కోట్ల విలువైన కంటైనర్ తయారీ సహాయ పథకం విజయవంతం కావడాన్ని కూడా సోనోవాల్ అభినందించారు. ప్రపంచ షిప్పింగ్ దిగ్గజం మెర్స్క్ ఇప్పుడు భారత్‌లో తయారు చేసిన కంటైనర్లను ఆర్డర్ చేస్తోందని ఆయన తెలిపారు.

‘‘ఆర్థిక సంస్కరణలు, కచ్చితమైన సరుకు రవాణా సహకారం, తగిన ఆర్థిక చేయూత, నియంత్రణల క్రమబద్ధీకరణ, వ్యాపారం నిర్వహణలో నిజమైన సౌలభ్యం... జాతీయ షిప్పింగ్ బోర్డు ప్రతిపాదించిన ఈ అయిదు సూత్రాల ప్రణాళికను నేను స్వాగతిస్తున్నాను’’ అని శ్రీ సర్బానంద సోనోవాల్ తెలిపారు. “కలిపి చూస్తే ఇవి వేర్వేరు పనులు కావు.. మన దేశ వాణిజ్యాన్ని మనమే స్వయంగా నడుపుకొనే దిశగా వేసిన పునాదులు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో.. 2047 నాటికి మన ఓడరేవుల సామర్థ్యాన్ని ఏడాదికి 10,000 మిలియన్ టన్నులకు పెంచుతున్నాం. వేరే దేశాల నౌకలు మన సరుకును మోసుకెళ్తుంటే చూస్తూ ఉండిపోకుండా.. ఆ వృద్ధిలో భారతీయ నౌకా యజమానులు భాగస్వాములు కావాలని నిర్దేశించడమే ఎన్‌ఎస్‌బీ ప్రధాన బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన.. ‘నౌకా వాణిజ్య కార్మిక శక్తి: అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ఒక సమావేశాన్ని నిర్వహించారు. ప్రపంచంలో అతిపెద్ద సముద్రయాన కార్మిక వర్గాలలో ఒకటిగా ఉన్న భారతీయ నావికుల స్థితిగతులపై ఈ సమావేశంలో సమీక్షించారు. ముఖ్యంగా వేతనాలపై పన్ను విధింపుపింఛనుపరంగా లోపాలు, సంక్షేమ సదుపాయాలకు సంబంధించిన అంశాలపై బోర్డు వెల్లడించిన వివరాలను పరిగణనలోకి తీసుకుంటూ - ప్రభుత్వ యువజన, కార్మిక విధానాలనూ, దేశ నౌకా వాణిజ్య రంగ లక్ష్యాలనూ సమన్వయించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సదస్సులో కేంద్ర మంత్రి శ్రీ మాన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. “మన యువ శక్తికి భారీగా ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన చోదక శక్తిగా నిలిచేందుకూ, ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన నావికులను అందించే అగ్రగామి దేశంగా భారత్‌ను నిలిపేందుకూ కావాల్సిన పూర్తి సామర్థ్యం భారత నౌకా వాణిజ్య రంగానికి ఉంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో.. నాణ్యమైన శిక్షణా సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాం. ఇందులో భాగంగా పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, విస్తృతమైన ఉపాధి మార్గాలను సుగమం చేయడం, లింగ అసమానతలను తొలగించడం, క్రూయిజ్ షిప్పింగ్, అధునాతన నౌకా నిర్మాణం వంటి వర్ధమాన రంగాలకు అనుగుణంగా మన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మన ‘మారిటైమ్ ఇండియా విజన్ - 2030 లక్ష్యాలను సాధించడంలోనూ, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ - 2047 కింద నౌకా నిర్మాణ సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ.. నైపుణ్యం కలిగిన, భవిష్యత్ అవసరాలకు సన్నద్ధంగా ఉన్న నావికా శక్తి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది” అన్నారు.

నైపుణ్యం కలిగిన నావికా నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను భారత్ సద్వినియోగం చేసుకోవాలనీ, తద్వారా పెరుగుతున్న మన యువ జనాభాకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను సృష్టించాలని కేంద్ర మంత్రి శ్రీ మాన్సుఖ్ మాండవీయ కోరారు. శిక్షణ సామర్థ్యాన్ని విస్తరించడం, భారతీయ నావికులకు మార్కెట్ అవకాశాలను బలోపేతం చేయడం, భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించే దిశగా.. ప్రభుత్వం, నౌకాయాన పరిశ్రమ, వాణిజ్య సంస్థలు, శిక్షణ సంస్థలన్నీ సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే నౌకాయాన రంగ ఉపాధిలో లింగ అసమానతలను తొలగించడం, క్రూయిజ్ షిప్పింగ్ వంటి వర్ధమాన విభాగాల కోసం ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ప్రపంచంలో అగ్రగామి నౌకా నిర్మాణ దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగాలన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థమైన, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.

‘భారతీయ నౌకా సామర్థ్య విస్తరణ: అవకాశాలు, సవాళ్లు’ అంశంపై నిర్వహించిన నిపుణుల బృంద చర్చకు ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతనూ ఠాకూర్ అధ్యక్షత వహించారు.

‘‘మన దేశానికి అత్యంత కీలకమైన ముడి చమురు, గ్యాస్, బొగ్గు, యూరియా వంటి సరుకుల రవాణా కోసం విదేశీ నౌకాయాన సంస్థలకు భారత్ ఏటా దాదాపు 75 బిలియన్ డాలర్లను రవాణా రుసుము రూపంలో చెల్లిస్తోంది’’ అని శాంతనూ ఠాకూర్ తెలిపారు. “ఇది భారతీయ నౌకా యజమానుల పనితీరుకు సంబంధించిన సమస్య కాదు. ఇది పోటీతత్వం, భాగస్వామ్య డిమాండ్ల సమస్య. 2047 నాటికి దేశం ‘వికసిత భారత్’గా నిలవాలంటే.. సొంత జల రవాణా మార్గాల భద్రత కోసం ఇతరులపై ఆధారపడకూడదు. మన జలమార్గాలపై మనకు పట్టుండాలి” అని స్పష్టం చేశారు.

కెప్టెన్ ఎం.పి. బసిన్, సి.వి. సుబ్బారావు కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు. నౌకా రవాణా సామర్థ్యాన్ని పెంచడంపై కార్యక్రమం చివరిలో జరిగిన నిపుణుల చర్చలో.. భారత నౌకా వాణిజ్య సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ అతుల్ జాదవ్, జాతీయ నౌకా యజమానుల సంఘం సీఈవో, ఎన్‌ఎస్‌బీ సభ్యుడు అనిల్ దేవ్లీ, డీజీఎంఏ నాటికల్ సలహాదారు కెప్టెన్ ఎస్.ఐ.ఎ.కె. ఆజాద్, గాంధీనగర్‌లోని అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ అశుతోష్ శర్మ, కంటైనర్ షిప్పింగ్ సంస్థల సంఘం అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌బీ సభ్యుడు రాహుల్ మోదీ, డైమండ్ బ్లూ షిప్పింగ్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ పంకజ్ కుమార్‌ పాల్గొన్నారు.

విదేశీ పతాకాలతో నౌకలను నడపడంతో పోలిస్తే.. భారతీయ పతాకంతో నౌకాయానం ఇప్పటికీ 16 నుంచి 20 శాతం వరకు ఖరీదైన వ్యవహారంగానే ఉందని బృంద సభ్యులు తెలిపారు. నౌకా దిగుమతులు, నిర్వహణ సేవలపై భారత్ విధిస్తున్న పన్నులు, నావికుల వేతనాల్లో టీడీఎస్, సరుకు రవాణాపై పన్ను, దేశీయంగా పెరిగిన మూలధన వ్యయాలే ఈ వ్యత్యాసానికి కారణమని వారు వివరించారు. విదేశీ పోటీదారులకు ఇలాంటి భారం లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ భారతీయ నౌకాయాన రంగానికి ఉన్న ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్’ (తొలి ప్రాధాన్యతా హక్కు) విధానం ప్రకారం.. సరుకు రవాణా కాంట్రాక్టులను దక్కించుకోవాలంటే భారతీయ నౌకా యజమానులు విదేశీ సంస్థల సరుకు రవాణా రేట్లతో సమానంగా ధరలను అందించాల్సి వస్తోందని ప్యానెల్ పేర్కొన్నది.

అయిదు కీలక అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను నిపుణుల బృందం (ప్యానెల్) సభ్యులు ప్రతిపాదించారు. అవి: ఆర్థిక సంస్కరణలు, సరుకు రవాణా భరోసా, తక్కువ వడ్డీకే తగిన రుణాలు, నియంత్రణల క్రమబద్ధీకరణ, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడం. ఈ ప్రతిపాదిత చర్యలను అమలు చేస్తే.. అయిదేళ్ల వ్యవధిలోనే భారత నౌకాదళానికి కొత్తగా 100 నౌకలను సమకూర్చవచ్చని ప్యానెల్ వివరించింది. ‘మారిటైమ్ అమృత్ కాల్ విజన్ (ఎంఏకేవీ)- 2047’ లక్ష్యమైన.. ప్రపంచంలో అత్యధిక నౌకలు కలిగిన అయిదు అగ్రగామి దేశాల జాబితాలో భారత్ స్థానాన్ని సాధించే దిశగా ఇదొక కీలక ముందడుగు అవుతుందని స్పష్టం చేసింది.

ఎన్‌ఎస్‌బీ చైర్‌పర్సన్ సమీర్ కుమార్ ఖరే స్వాగతోపన్యాసం చేశారు. “మారిటైమ్ అమృత్ కాల్ విజన్ - 2047 కింద.. ‘వికసిత భారత్’ సాధనలో సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చిన మన ప్రధానమంత్రి దూరదృష్టే ఈ చర్యలన్నింటికీ స్ఫూర్తి. శ్రీ సర్బానంద్ సోనోవాల్ నిశ్చయాత్మక నాయకత్వంలో ఆ ఆశయం సాకారమై.. క్షేత్రస్థాయిలో విశేష ప్రభావాన్ని చూపే మౌలిక వసతుల కల్పన, రేవుల ఆధునికీకరణ, పర్యావరణహిత నౌకాయాన సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.

వాణిజ్య నౌకాయాన చట్టం- 2005 ప్రకారం ఏర్పాటైన ఒక చట్టబద్ధ సలహా సంస్థ.. ‘జాతీయ షిప్పింగ్ బోర్డు (ఎన్ఎస్‌బీ). అది నౌకాయాన విధానంనౌక సామర్థ్యంనావికుల సంక్షేమం, రేవులతో అనుసంధానమైన నౌకావాణిజ్య అభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలను అందిస్తుంది.

ఎన్‌ఎస్‌బీ నిర్వహించిన 'సాగర్ సంవాద్తొలి సదస్సులో.. మూడు సమావేశాల ద్వారా నౌకా వాణిజ్య రంగ భాగస్వాములుపరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఒక్క వేదికపైకి వచ్చారు. ‘మారిటైమ్ ఇండియా విజన్ – 2030’, ‘మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047’ సాధనకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఒక సమావేశంలో ‘నౌకా వాణిజ్య రవాణా రంగ సిబ్బంది: అవకాశాలుసవాళ్లు’ అనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉపాధి కల్పననావికుల నైపుణ్యాలుమానవ వనరుల అభివృద్ధి, ఈ రంగంలో నూతన అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మరో సమావేశంలో.. ‘భారతీయ నౌకా సామర్థ్యాల విస్తరణ: అవకాశాలుసవాళ్లు’ అనే అంశంపై చర్చించారు. భారత నౌకాదళాన్ని విస్తరించాల్సిన, దేశ నౌకావాణిజ్య సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతలను పరిశీలించారు. శక్తిమంతమైన, మరింత పోటీతత్వం కలిగిన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండేలా భారతీయ నౌకా వాణిజ్య రంగాన్ని తీర్చిదిద్దే దిశగా.. తమ ఆలోచనలను పంచుకోవడానికి పరిశ్రమ నిపుణులకూ, సంబంధిత భాగస్వామ్య వర్గాలకూ అత్యుత్తమ వేదికగా ఈ చర్చలు నిలిచాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2303975) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Assamese , Urdu , हिन्दी