పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మంచు ప్రాంతాల్లో సంచరించే చిరుతపులుల సంతతి అంచనా, రేడియో టెలీమెట్రీ, జన్యు విశ్లేషణ సహా హిమ ప్రాంత చిరుతల సంరక్షణలో సైన్స్ ఆధారిత పురోగతిని ప్రస్తావించిన భారత్

మాస్కో రౌండ్ టేబుల్ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 12:10PM by PIB Hyderabad

హిమ ప్రాంత చిరుతపులుల అధ్యయనం, సంరక్షణ అంశాలపై రష్యా, భారత్ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిన్న, అంటే 2026 ఆగస్టు 26న రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించారు. మాస్కోలోని ఎ.ఎన్. సెవర్‌త్సొవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇకాలజీ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ ది రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. మంచు ప్రాంతాల్లో సంచరించే జాతి చిరుతపులుల సంరక్షణ, పరిశోధన విషయాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో 2025 డిసెంబరులో కుదుర్చుకున్న ఓ భాగస్వామ్య ఒప్పందం తాలూకు ప్రాథమిక ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాన్ని నిర్వహించారు.

భాగస్వామ్య ఒప్పంద పత్రాలపై ఇంటర్‌ రీజియనల్ అసోసియేషన్ ‘ఐఆర్‌బీఐఎస్’, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) ప్రతినిధులు సంతకాలు చేశారు.

విజ్ఞానశాస్త్ర కార్యక్రమాల నిర్వహణ ద్వారా హిమ ప్రాంత చిరుతపులుల సంరక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఎఫ్‌సీసీ) ప్రతినిధి వర్గం సమావేశంలో ప్రస్తావించింది. ఈ జాతి చిరుతపులుల సంతతిని అంచనా వేయడం, రేడియో టెలీమెట్రీ, జన్యు సంబంధ విశ్లేషణలలో ప్రగతిని భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ) అధికారులు సమావేశంలో తెలియజేశారు. సంరక్షణ ప్రయత్నాల్లో వైజ్ఞానిక పరికరాల పాత్ర అంతకంతకూ పెరుగుతున్నట్లు వారు స్పష్టం చేశారు.

ఈ రౌండ్‌ టేబుల్ సమావేశంలో.. హిమ ప్రాంత చిరుతల సంరక్షణ, పరిశోధన రంగ నిపుణులతో పాటు రష్యా ప్రాకృతిక వనరులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఎ.ఎన్. సెవర్‌త్సొవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇకాలజీ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ ది రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌, మాస్కో జంతు ప్రదర్శనశాల, రోస్పోట్రేబనాదజోర్‌ల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ జాతి చిరుతలను సంరక్షించడానికీ, విజ్ఞానశాస్త్ర పరమైన అధ్యయనాలను చేపట్టడానికీ సహకార దృక్పథంతో ముందుకు పోవడం ప్రధానాంశంగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశంతో పాటు తత్సంబంధిత చర్చల్లోనూ భారతీయ ప్రతినిధి వర్గం పాలుపంచుకుంది.

ఈ రౌండ్‌ టేబుల్ సమావేశం హిమ ప్రాంత చిరుతల సంరక్షణ, పర్యవేక్షణ, పరిశోధనలకు సంబంధించిన జ్ఞానాన్నీ, అనుభవాలనీ పరస్పరం వెల్లడించుకోవడానికీ, సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికీ భారత్‌కు, అంతర్జాతీయ భాగస్వాములకు ఒక ప్రధాన వేదికను అందించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2303730) సందర్శకుల సూచీ సంఖ్య : : 52
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam