పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఘజియాబాద్‌లోని లోనిలో ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీఏక్యూఎమ్


28 ప్రాంగణాల్లో తనిఖీలు... 16 యూనిట్లు/ప్రాంగణాలు సీజ్

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 7:13PM by PIB Hyderabad

జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలోని చట్టవిరుద్ధమైన, కాలుష్యకారక పారిశ్రామిక యూనిట్లలో... ఎన్‌సీఆర్-పరిసర ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎమ్) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది, 'ఆపరేషన్ క్లీన్ ఎయిర్' కింద నిన్న ఘజియాబాద్‌లోని లోనిలో కమిషన్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. పర్యావరణ నియంత్రణ యంత్రాంగాల పరిమితులను పట్టించుకోకుండా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న యూనిట్లను గుర్తించడం లక్ష్యంగా ఈ తనిఖీ డ్రైవ్‌ను చేపట్టారు.

ఘజియాబాద్‌లోని లోని ప్రాంతంలో ఉన్న 28 పారిశ్రామిక ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించడానికి... కమిషన్ ఆధ్వర్యంలో మెజిస్ట్రేట్లు, పోలీసులు, ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో కూడిన ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో విస్తృతమైన నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తనిఖీ చేసిన 28 ప్రాంగణాలు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేవని తేలింది.

 

          

కార్యకలాపాల నిర్వహణ కోసం చెల్లుబాటయ్యే అనుమతి (సీటీవో) లేకుండా పనిచేస్తున్న 21 కేసులు... కలప, బొగ్గు వంటి ఆమోదం లేని ఇంధనాలను ఉపయోగించిన 14 కేసులు... అవసరమైన వాయు కాలుష్య నియంత్రణ పరికరాలు (ఏపీసీడీలు), స్టాక్/చిమ్నీ ఏర్పాట్లు లేకుండా కొలిమిలను నడుపుతున్న, వాయు కాలుష్య నియంత్రణ మౌలిక సదుపాయాలు తగినంతగా లేకుండా పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న 8 కేసులను ఈ తనిఖీల్లో భాగంగా గుర్తించారు. బహిరంగంగా పెయింటింగ్/పౌడర్-కోటింగ్ కార్యకలాపాలు నిర్వహించడం, పారిశ్రామిక యూనిట్లను చట్టవిరుద్ధంగా నడపడం వంటి ఉదంతాలూ వెలుగుచూశాయి.       

 

       

ఉల్లంఘనలను గుర్తించిన 16 యూనిట్లు/ప్రాంగణాలను జిల్లా పరిపాలన, ఫ్లయింగ్ స్క్వాడ్‌, యూపీపీసీబీ సిబ్బంది సీజ్ చేశారు. సంబంధిత యూనిట్‌లకు 6 ప్రాథమిక నివేదికలు/షోకాజ్ నోటీసులు అందించారు. మరో 6 యూనిట్‌లకు తాళం వేసి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆయా ఆవరణ/తలుపులపై నోటీసులు అతికించారు. తనిఖీ చేసే అధికారుల రాకను గమనించి కొందరు స్థానికులు ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఎన్‌సీఆర్‌లో పనిచేస్తున్న పారిశ్రామిక యూనిట్లు వర్తించే అన్ని పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కమిషన్ పునరుద్ఘాటించింది. చెల్లుబాటయ్యే చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహించడం, ఆమోదం లేని ఇంధనాలను ఉపయోగించడం, అవసరమైన వాయు కాలుష్య నియంత్రణ ఏర్పాట్లు లేకుండా కొలిమిలు/ప్రక్రియలను కొనసాగించడం వంటివి తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. ఇలాంటి ఉల్లంఘనల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటారు.

క్షేత్రస్థాయిలో నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయా పర్యవేక్షించడానికి, ఉల్లంఘనలపై సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి వీలుగా... ఆపరేషన్ క్లీన్ ఎయిర్ కింద ఎన్‌సీఆర్ అంతటా తనిఖీలు, సోదాలు కొనసాగుతాయని కమిషన్ మరోసారి స్పష్టం చేసింది. సంబంధిత ఏజెన్సీలు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన యూనిట్లపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2303626) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil