ఆర్థిక మంత్రిత్వ శాఖ
చట్టబద్దమైన ఔషధ ఎగుమతులను ప్రోత్సహించడానికి, నియంత్రణల సహకారాన్ని బలోపేతం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్), ఫార్మెక్సిల్ మధ్య అవగాహనా ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
24 AUG 2026 9:36PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్)తో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) ఈ రోజు ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇది చట్టబద్ధమైన అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం, ఫార్మా ఉత్పత్తుల దారి మళ్లింపును నివారించే దిశగా వేసిన ముందడుగు. గ్వాలియర్‌లోఉన్న సీబీఎన్ ప్రధాన కార్యాలయంలో రెండు సంస్థలూ ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.

యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రేడియంట్స్ (ఏపీఐలు), బల్క్ డ్రగ్, ఫార్ములేషన్లు, బయోలాజిక్స్, వైద్య పరికరాల సరఫరాలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఉండడాన్ని గుర్తించి, దేశ ఫార్మాస్యూటికల్ ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు సమర్థవంతమైన నియంత్రణ పర్యవేక్షణను సమతుల్యం చేయడమే ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం.
ఎన్డీపీఎస్ చట్టం, 1985 ప్రకారం సీబీఎన్ పాత్ర: ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) పనిచేస్తోంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం-1985 అమలునూ, నిబంధనలనూ, ఇతర సదుపాయాలనూ ఈ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం సీబీఎన్ కొన్ని కీలక బాధ్యతలను నిర్వర్తిస్తోంది. చట్టబద్ధమైన గసగసాల సాగుతోపాటు నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ పదార్థాల దిగుమతి, ఎగుమతులకు అనుమతినిస్తుంది. అవసరమైన రసాయన ముడి పదార్థాలను చట్టవ్యతిరేకమైన వినియోగానికి మళ్లించకుండా చూస్తుంది.
భారత ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వ్యాపారాన్ని అందించే జాతీయ ప్రణాళికకు వ్యూహాత్మక కొనసాగింపుగా ఫార్మెక్సిల్‌తో ఈ సహకార ఒప్పందం ఉంటుంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను సురక్షితం చేసేలా ఫార్మాస్యూటికల్ ఎగుమతుల వ్యవస్థలో స్వచ్ఛంద అమలు విధానాలను నేరుగా అనుసంధానించడం ద్వారా ఈ రోజు కుదిరిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) ఈ సమగ్ర విధానాన్ని మరింత విస్తృతం చేస్తుంది.
సంతకాల కార్యక్రమం, అధికారులు: ఒప్పందంపై సంతకాలు చేసే ఈ అధికారిక కార్యక్రమంలో సీబీఎన్ తరఫున నార్కోటిక్స్ కమిషనర్ డాక్టర్ దినేష్ బిసెన్, ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజా భాను అవగాహన పత్రాలను మార్చుకున్నారు.
ఎంవోయూలో ముఖ్యాంశాలు:
• వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ (వీసీసీ): ఫార్మెక్సిల్‌తో సంప్రదింపులు చేపట్టి, పరిశ్రమ కోసం సిఫార్సు చేసిన పద్ధతులను నిర్దేశించే ఒక స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఈ నియమావళి స్వచ్ఛందమైనదిగా, నిర్భందం కానిదిగా ఉంటుంది. ఇది సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా లేదా వర్తించే చట్టాల పరిధిని దాటి ఎగుమతిదారులపై అదనపు శాసనపరమైన లేదా ఆర్థిక భారాలను సృష్టించకుండా ఉండేలా చూస్తుంది.
• వాణిజ్య సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం: నిబంధనలకు లోబడి ఉండే ఫార్మాస్యూటికల్ ఎగుమతిదారులకు కార్యాచరణపరంగా ఎదురయ్యే అవరోధాలను గుర్తించడం, చట్టబద్ధమైన ఎగుమతి విధానాలను క్రమబద్ధీకరించడానికి చర్యలను సిఫార్సు చేయడంపై దృష్టి సారిస్తుంది.
• సామర్థ్య నిర్మాణం: సీడీఎస్‌సీవో, కస్టమ్స్ లాంటి ప్రభుత్వ సంస్థలతో కలసి అవసరమైన చోట వర్కుషాపులనూ, సెమినార్లనూ, అవగాహనా కార్యక్రమాలనూ ఉభయ పక్షాలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి.
• సమాచార ప్రసారం: వర్తించే చట్టాలు, గోప్యతా నిబంధనలకు లోబడి, నియంత్రణ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనేందుకు ఈ అవగాహన ఒప్పందం ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా, వీసీసీకి సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి, ఫార్మా పరిశ్రమ సభ్య సంస్థల నుంచి ‘సంప్రదింపు వ్యక్తులను’ నామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఒప్పందం కుదిరిన అనంతరం ఆరు నెలల కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తూ భవిష్యత్తు కార్యక్రమాలపై అధికారులు కూలంకషంగా చర్చించారు. ఈ ప్రణాళిక దేశవ్యాప్త ప్రచారానికీ, ఫార్మెక్సిల్ సహకారంతో భాగస్వాములకు అవగాహన కల్పించేందుకూ ప్రాధాన్యమిస్తుంది. అలాగే సంస్థాగత, నియంత్రణ సహకారానికి సంబంధించిన కీలక రంగాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంది.
ఫార్మాస్యూటికల్ రంగాన్ని నిబంధనలకు అనుగుణంగా, సుస్థిరమైన వృద్ధిని సాధించేలా నిర్దారించడానికి భారత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ అవగాహన ఒప్పందం స్పష్టం చేస్తుంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ పదార్థాలు, నియంత్రిత రసాయనాలు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటూనే ఎగుమతి అనుమతులకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. తద్వారా ఎగుమతుల రంగాన్ని ప్రోత్సహించి మరింత వృద్ధి చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2303011)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12