భారత ఎన్నికల సంఘం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి భవిష్యత్తు విద్యార్థులే: సీఈసీ జ్ఞానేష్ కుమార్
प्रविष्टि तिथि:
24 AUG 2026 6:22PM by PIB Hyderabad
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) లక్నో వేదికగా ఈ రోజు "ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ (ఈఎల్‌సీ 2.0), ఈసీఐనెట్" అంశంపై రెండో ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించింది. విద్యాసంస్థల ద్వారా యువతకు ఎన్నికల గురించి, ప్రజాస్వామ్య ప్రక్రియను గురించి అవగాహనను పెంపొందించడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది.
ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన ప్రతినిధులను ఉద్దేశించి సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను దేశ భవిష్యత్తుగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియల గురించిన జ్ఞానాన్ని, అవగాహనను ముందుకు తీసుకువెళ్లి ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయడానికి ఈఎల్‌సీలు అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు.
రాజ్యాంగం, చట్టం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగానే దేశంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అన్ని దశల్లోనూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధుల పర్యవేక్షణలో (సమకాలీన తనిఖీతో) పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. భారత ఎన్నికల విధానం, ప్రజాస్వామ్య విలువలు, ఓటర్ల నమోదు, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలు, భారత ఎన్నికల సంఘం పాత్ర, పనితీరును గురించి విద్యార్థులకు, యువ ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ ప్రక్రియలో యువతను భాగస్వాములను చేయాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... ఎన్నికల ప్రక్రియలో వారి విశ్వాసం, అవగాహనతో కూడిన భాగస్వామ్యం ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పెట్టుబడి వంటిదని సీఈసీ శ్రీ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు.
“ప్రజాస్వామ్యాన్ని గురించి అవగాహన పొందండి... ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహించండి...” అనే నినాదంతో... యువత, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారు ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకోవడం, ఈ ప్రక్రియలో అర్థవంతమైన భాగస్వామ్యం ద్వారా దాని పురోగతికి దోహదపడేలా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని ఈఎల్‌సీ 2.0 బలపరుస్తుంది.
అంతకుముందు, శ్రీ జ్ఞానేష్ కుమార్ తాను చదువుకున్న 'కాల్విన్ తాలూక్దార్స్ కళాశాల'ను సందర్శించారు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. తన పర్యటనలో రెండో రోజైన రేపు... సీఈసీ శ్రీ జ్ఞానేష్ కుమార్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన బూత్ స్థాయి అధికారులతో (బీఎల్‌వోలతో) సమావేశమై వారితో సంభాషిస్తారు.
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల అంతటా ఎన్నికల ప్రక్రియ గురించిన అవగాహన క్లబ్‌లను... నిర్మాణాత్మక, విజిబుల్, డిజిటల్ ఆధారిత వేదికలుగా ఈఎల్‌సీ 2.0 అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యక్రమం యువతలో, వారి కుటుంబాలు, విద్యా సంస్థలు, కమ్యూనిటీల్లో ఎన్నికల ప్రక్రియ గురించిన అవగాహనను ప్రోత్సహించడానికి నిరంతర, ఏడాది పొడవునా నిర్వహించే కార్యకలాపాలను రూపొందిస్తుంది.
విస్తృతమైన ఈసీఐనెట్ డిజిటల్ వేదికను ఈఎల్‌సీ 2.0 వినియోగించుకుంటుంది. ఇది ఓటర్ల జాబితా తయారీ నుంచి పోలింగ్ వరకు ఎన్నికలకు సంబంధించిన అన్ని సేవల గురించిన సమాచారాన్ని కేవలం ఒక బటన్ క్లిక్‌తో అందిస్తుంది. ఈసీఐనెట్‌లోని ప్రత్యేక ఈఎల్‌సీ పోర్టల్ ద్వారా, దేశవ్యాప్తంగా ఒక క్రమబద్ధమైన ఈఎల్‌సీ నెట్‌వర్క్‌ను ఇది ఏర్పాటు చేస్తుంది.
సుమారు 15 లక్షల పాఠశాలలు, దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులు, కోటి మందికి పైగా ఉపాధ్యాయులతో కూడిన భారత విస్తృత విద్యా వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక ఉన్నత విద్యా రంగంలో దాదాపు 1,500 విశ్వవిద్యాలయాలు, సుమారు 70,000 విద్యా సంస్థలు ఉండగా, వాటిలో సుమారు 4.33 కోట్ల మంది విద్యార్థులు ఉన్నట్లు అంచనా.
విస్తృతమైన ఈ సంస్థాగత నెట్‌వర్క్ ద్వారా ఎన్నికల ప్రక్రియ గురించి వాస్తవిక, అనుభవపూర్వక అవగాహనను ప్రోత్సహించడం... భారత ఎన్నికల వ్యవస్థ పారదర్శకత, సమగ్రత, విశ్వసనీయతపై అవగాహనను పెంపొందించడం... యువతను విజ్ఞానవంతమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి రాయబారులుగా మారేలా ప్రోత్సహించడం ఈఎల్‌సీ 2.0 లక్ష్యం.
ఓటర్ల నమోదు, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికల ప్రక్రియల్లోని వివిధ దశల గురించిన సమాచారాన్ని, ఈసీఐనెట్ యాప్, భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఇతర కీలక కార్యక్రమాలను గురించి ప్రజలకు అవగాహన కలిగించే వేదికలుగా ఈఎల్‌సీలు పనిచేస్తాయి.
***
(रिलीज़ आईडी: 2302950)
आगंतुक पटल : 7