ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జెనెసిస్ నెక్స్ట్‌జెన్ స్టార్టప్ సమ్మిట్ - కోయంబత్తూర్ ఎడిషన్‌లో జెనెసిస్ ఎంట్రప్రెన్యూర్-ఇన్-రెసిడెన్స్ (ఈఐఆర్) కోహోర్ట్-3 ప్రారంభం


జెనెసిస్ ఈఐఆర్ 3.0 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం... 2026 సెప్టెంబరు 3 లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రారంభ స్థాయి ఆవిష్కర్తలకు ఆహ్వానం

భారతీయ అంకుర సంస్థలు, డీప్‌టెక్ వ్యవస్థకు కీలకమైన జాతీయ చోదకశక్తిగా ఎదుగుతున్న ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ స్టార్టప్ హబ్ (ఎంఎస్‌హెచ్)

నాడు పోస్టు చేయడమైనది: 24 AUG 2026 11:55AM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వశాఖ (ఎంఈఐటీవై) తన స్టార్టప్ హబ్ (ఎంఎస్‌హెచ్) ద్వారా ‘జెనెసిస్ ఎంట్రప్రెన్యూర్‌-ఇన్-రెసిడెన్స్ (ఈఐఆర్) కోహోర్ట్-3’ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వినూత్న ఆలోచనలను సాంకేతికతా చోదక సంస్థల ఏర్పాటు దిశగా మలచడంలో - ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, విద్యార్థులు, ప్రారంభ దశల్లో ఉన్న అంకుర సంస్థల వ్యవస్థాపకులకు దన్నుగా నిలవడం ఈ కార్యక్రమ లక్ష్యం. కోయంబత్తూరులోని రథినమ్ గ్లోబల్ యూనివర్సిటీలో 2026 ఆగస్టు 4న నిర్వహించిన ‘జెనెసిస్ నెక్స్ట్‌జెన్ స్టార్టప్ సమ్మిట్ (కోయంబత్తూరు ఎడిషన్)’లో ‘జెనెసిస్ ఈఐఆర్ -3.0’ను ప్రారంభించారు. అంకుర సంస్థలు, ఆవిష్కరణల రంగానికి సంబంధించి.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం అది అందుబాటులో ఉంది.

 

జెనెసిస్ ఈఐఆర్ 3.0 అనేది జెనెసిస్ (జెన్‌-నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్) పథకంలో ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అంకుర సంస్థలను గుర్తించడం, ప్రోత్సహించడం, వాటి ఎదుగుదలను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ఎంట్రప్రెన్యూర్-ఇన్-రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా.. ఆవిష్కర్తలు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు తమ ప్రారంభ దశ ఆలోచనలను పూర్తిస్థాయి వినియోగానికి సిద్ధంగా ఉండే మార్గాలుగా మలచుకునేందుకు నిర్దిష్టమైన నిధుల సదుపాయాన్ని, ఇంక్యుబేషన్ సహకారాన్ని అందిస్తారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన స్టార్టప్ హబ్.. అంకుర సంస్థలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, మెంటార్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్య వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చే జాతీయ స్థాయి వేదికగా వ్యవహరిస్తోంది. ఇది దేశ డీప్‌టెక్ రంగాన్ని బలోపేతం చేస్తూ.. ఆలోచనల స్థాయి నుంచి వాణిజ్యీకరణ, విస్తరణ వరకు సమగ్ర ఆవిష్కరణల ప్రయాణానికి అండగా నిలుస్తోంది.

 

జెనెసిస్ స్టార్టప్ సమ్మిట్ - కోయంబత్తూరు ఎడిషన్‌లో ప్రారంభం

 

జ్ఞానదాయకమైన ఆలోచనలను పరస్పరం పంచుకోవడం, మార్గనిర్దేశం, నెట్వర్కింగ్, వ్యవస్థాగత సహకారం ద్వారా - ఆవిష్కరణలే ప్రాతిపదికగా పారిశ్రమిక సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, విద్యా సంస్థలు, పారిశ్రామిక ప్రముఖులు, పరిశ్రమ భాగస్వామ్య వర్గాలను ఒక్కచోట చేర్చి, వారిలో స్ఫూర్తిని నింపే, వారిని అనుసంధానించి సాధికారులను చేసే ఉమ్మడి వేదికగా ‘జెనెసిస్ నెక్స్ట్ జెన్ స్టార్టప్ సమ్మిట్ - కోయంబత్తూరు ఎడిషన్’ను నిర్వహిస్తున్నారు.

 

ముఖ్య ప్రసంగం అనంతరం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వశాఖ స్టార్టప్ హబ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ పన్నీర్‌సెల్వం మదనగోపాల్.. ‘జెనెసిస్ ఈఐఆర్ 3.0’ను లాంఛనంగా ప్రారంభించారు. కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ తిరు పవన్ కుమార్ జి. గిరియప్పనవర్, రథినమ్ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ మదన్ ఎ. సెంథిల్, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక సాయం, మార్గనిర్దేశం, ఇంక్యుబేషన్ మద్దతు, దేశవ్యాప్త ఆవిష్కరణల వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా - ప్రారంభ దశలో ఉన్న ఆవిష్కర్తలు, పరిశోధకులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ.. వినూత్న ఆలోచనలను ప్రామాణిక ధ్రువీకృత నమూనాలుగా, విస్తరించదగిన సాంకేతికతా చోదక వ్యాపారాలుగా మలచుకునేలా వారికి చేయూతనివ్వడంలో తన అంకితభావాన్ని స్టార్టప్ హబ్ (ఎంఎస్‌హెచ్) చాటుకుంది.

 

 

జెనెసిస్ ఈఐఆర్ 3.0 కోసం దరఖాస్తులకు ఆహ్వానం

‘జెనెసిస్ ఈఐఆర్ కోహార్ట్-3’ని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ స్టార్టప్ హబ్ అమలు చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత (ఐటీ), ఇన్ఫర్మేషన్ - కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), డీప్‌టెక్ రంగాల్లో సాంకేతికత చోదక విధానాలను అభివృద్ధి చేసే ప్రారంభ దశ ఆవిష్కర్తలకు అండగా నిలుస్తోంది. ఎంపికైన దరఖాస్తుదారులకు జెనెసిస్ భాగస్వామ్య ఇంక్యుబేటర్ల ద్వారా ఇంక్యుబేషన్, మార్గనిర్దేశక, నెట్‌వర్కింగ్ అవకాశాలతోపాటు రూ. 10 లక్షల వరకు ఆర్థికసాయం లభిస్తుంది.

 

ఎంపికైన ఆవిష్కర్తలు పొందేవి:

 

  • రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం

  • జెనెసిస్ భాగస్వామ్య ఇంక్యుబేటర్లతో సంప్రదింపుల సదుపాయం

  • వ్యక్తిగత మార్గదర్శకత్వం, నిపుణుల సలహాలు

  • ఉత్పత్తి అభివృద్ధి, ఎంవీపీ తయారీలో సహకారం

  • ఇంక్యుబేషన్, వ్యాపారాభివృద్ధి చేయూత

  • ప్రొటోటైపింగ్, సాంకేతిక అభివృద్ధి, ప్రామాణీకరణలకు మద్దతు

  • పరిశ్రమ, అంకుర సంస్థల వ్యవస్థాగత అనుసంధానాలు

  • వాణిజ్యీకరణకూ, అంకుర సంస్థల అభివృద్ధికీ మార్గదర్శనం

 

ముఖ్యమైన రంగాలు:

ఎలక్ట్రానిక్స్ - ఐటీ రంగం, డీప్‌టెక్, కృత్రిమ మేధ/మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), సెమీకండక్టర్/వీఎల్ఎస్ఐ, సైబర్‌ భద్రత, బ్లాక్‌చెయిన్, క్వాంటం సాంకేతికతలు, ఏఆర్/వీఆర్, ప్రాదేశిక – ఇమ్మర్సివ్ టెక్నాలజీలు.

అర్హత ప్రమాణాలు:

1. దరఖాస్తుదారులు భారత పౌరులై ఉండాలి.

 

2. దరఖాస్తుదారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, విద్యార్థులు లేదా ప్రారంభ దశలో ఉన్న అంకుర సంస్థల వ్యవస్థాపకులు/ సహ-వ్యవస్థాపకులు అయి ఉండవచ్చు.

 

3. ప్రతిపాదిత ఆవిష్కరణ.. ఎలక్ట్రానిక్స్ - ఐటీ రంగం, డీప్‌టెక్, ఏఐ/ఎంఎల్, ఐఓటి, సెమీకండక్టర్/ వీఎల్ఎస్ఐ, సైబర్‌ భద్రత, బ్లాక్‌చెయిన్, క్వాంటం సాంకేతికతలు, లేదా ఏఆర్/విఆర్, ప్రాదేశిక - వాస్తవిక (ఇమ్మర్సివ్) సాంకేతికతల వంటి వర్ధమాన సాంకేతికతల్లో ఉండాలి.

 

4. సాంకేతికతా సన్నద్ధతా స్థాయి (టీఆర్ఎల్) 1–4 (ఆలోచన, భావనా నిరూపణ, నమూనా, ఎంవీపీ, లేదా ప్రాథమిక ధ్రువీకరణ దశ)లో ఆ ఆవిష్కరణ ఉండాలి.

 

5. ఆ అంకుర సంస్థ ద్వితీయ లేదా తృతీయ శ్రేణి నగరంలో ఉండాలి.

 

6. అంకుర సంస్థ ఒకవేళ నమోదు చేసుకుని ఉంటే.. దరఖాస్తు తేదీ నాటికి అది రెండేళ్లు దాటకుండా ఉండాలి.

 

7. అదే ప్రతిపాదిత ఆలోచన లేదా అంకుర సంస్థ కోసం.. ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఆ అంకుర సంస్థ రూ. 10 లక్షలకు మించిన ఆర్థిక సాయాన్ని పొంది ఉండకూడదు.

 

ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు వివరాలు:

 

జెనెసిస్ కోహోర్ట్ -3 దరఖాస్తు కోసం విండో 2026 ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://mshportal.meity.gov.in/ext/form/23966/1/apply ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఒక వినూత్న ఆలోచన – బలంగా నిలదొక్కుకోగల అంకుర సంస్థ.. ఈ రెండు భావనల నడుమ అంతరాన్ని భర్తీ చేసే లక్ష్యంతో ‘జెనెసిస్ ఈఐఆర్ కోహోర్ట్-3’ని రూపొందించారు. ఇంక్యుబేషన్, మార్గనిర్దేశాలతో ఆర్థిక సాయాన్ని అనుసంధానించడం ద్వారా.. ఆవిష్కర్తలు తమ సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవడానికి, వాటి ప్రామాణీకరణను పూర్తి చేసి మార్కెట్ వినియోగానికి సిద్ధం చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సాంకేతిక అంకుర సంస్థల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు.. దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు విస్తరణ సామర్థ్యమూ, విస్తృత ప్రభావమూ కలిగిన వ్యాపారాలను నిర్మించేలా సాధికారత కల్పించాలని మంత్రిత్వశాఖ స్టార్టప్ హబ్ లక్ష్యంగా పెట్టుకుంది.

 

జెనెసిస్ గురించి

దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అంకుర సంస్థలను గుర్తించడం, ప్రోత్సహించడం, అభివృద్ధిపరచడం, వాటి ఎదుగుదలను వేగవంతం చేయడం లక్ష్యంగా.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ‘స్టార్టప్ హబ్’ రూపొందించిన ప్రతిష్ఠాత్మక పథకం ‘జెన్-నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ (జెనెసిస్)’. ఎంట్రప్రెన్యూర్-ఇన్-రెసిడెన్స్, పైలట్, పెట్టుబడి, డీప్‌టెక్ ఫండింగ్ విభాగాల ద్వారా.. ప్రారంభ ఆలోచన, ప్రయోగ దశల నుంచి ప్రామాణీకరణ, పెట్టుబడులు, వ్యాపార విస్తరణ వరకు ఆవిష్కర్తలకు, అంకుర సంస్థలకు జెనెసిస్ అండగా నిలుస్తోంది. మొత్తం రూ. 490 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో చేపట్టిన ఈ పథకం.. వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లోని పారిశ్రామిక సామర్థ్యాన్ని వెలికితీయడంతోపాటు, దేశీయ ఆవిష్కరణల వ్యవస్థతో వాటిని మరింత బలంగా అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

జెనెసిస్ ఎంట్రప్రెన్యూర్- ఇన్- రెసిడెన్స్ (ఈఐఆర్) విభాగం గురించి:

 

జెనెసిస్ పథకంలోని ఎంట్రప్రెన్యూర్-ఇన్-రెసిడెన్స్ విభాగం ద్వారా... ఆలోచన, ప్రాథమిక నమూనాల దశల్లో ఉన్న ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఒక్కో అంకుర సంస్థకు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. లక్ష్యిత నిధుల కేటాయింపు, ఇంక్యుబేషన్ మద్దతు ద్వారా.. ప్రారంభ దశ ఆలోచనలను వినియోగానికి సిద్ధంగా ఉండే విధానాలుగా మలచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

 

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ స్టార్టప్ హబ్ గురించి:

 

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలో ఈ స్టార్టప్ హబ్ సేవలందిస్తుంది. దేశ అంకుర సంస్థలు, డీప్ టెక్ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా.. అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్, ఆవిష్కరణ కార్యక్రమాలను సమీకృతం చేసే ఏకీకృత జాతీయ వేదిక ఇది. ఆలోచన దశ నుంచి ఇంక్యుబేషన్, వ్యాపారాన్ని వేగవంతం చేయడం, నిధుల సదుపాయం, వ్యాపార విస్తరణ వరకు అన్ని స్థాయుల్లోనూ వివిధ పథకాల ద్వారా మద్దతునందిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2302945) సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil