ఆయుష్
మాతృత్వ శ్రేయస్సు కోసం ఆయుర్వేద ఆధారిత ‘‘గర్భిణీ మిత్ర’’ కోర్సు ప్రారంభించిన ఏఐఐఏ
प्रविष्टि तिथि:
24 AUG 2026 2:03PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ‘అఖిల భారత ఆయుర్వేద సంస్థ’ (ఏఐఐఏ) 2026-2027 విద్యాసంవత్సరానికి గాను ‘‘గర్భిణీ మిత్ర’’ కోర్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమం వ్యవస్థీకృత ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఓ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. గర్భిణులకు, బాలింతలకు అవసరమైన వైద్య విద్యను, జీవనశైలికి సంబంధించిన మార్గదర్శకత్వాన్ని, సాముదాయిక స్థాయి సహాయాన్ని అందించగలిగే సిబ్బందిని తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ కోర్సును సాంప్రదాయిక ఆయుర్వేద భావనలైన ‘గర్భిణి పరిచర్య’ (మహిళ గర్భంతో ఉన్న కాలంలో ఆమె సంరక్షణ), ‘సూతిక పరిచర్య’ (కాన్పు అనంతరం సంరక్షణ), ‘గర్భాదాన విధి’ (గర్భధారణకు పూర్వం సంరక్షణ).. ఈ అంశాల ఆధారంగా రూపొందించారు. ఈ కోర్సును ఆరు నెలల పాటు సోమవారం మొదలు శుక్రవారం దాకా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ మాధ్యమంలో బోధించేలా రూపొందించారు. మహిళ కడుపుతో ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఎాలాంటి ఆహారాన్ని తీసుకోవచ్చు, జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఏమేమిటి?, గర్భంతో ఉన్న కాలంలోనూ అనుసరించ గలిగిన యోగా పద్ధతులు, నొప్పులు వస్తున్నప్పుడు మానసికంగా వారు నిబ్బరంగా ఎలా ఉండవచ్చో తెలియజేయడం, శిశువుకు ఒంటి మర్దన చేసే తీరుతెన్నులు, మౌలిక జీవన రక్షణ నియమాలకు సంబంధించిన విషయాలను శిక్షణను పొందే వారికి బోధిస్తారు. అంటురోగాలకు గురి కాకుండా ఉండడమెలా?, స్వచ్ఛతకు పాటించవలసిన పద్ధతులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ఎలా, పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తచర్యలు ఏమేమిటి వంటివాటిని కూడా ఈ కోర్సు పాఠ్యాంశాల్లో చేర్చారు.
న్యూఢిల్లీలోని సరితా విహార్‌లో గల ఏఐఐఏ క్యాంపసులో అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ కోర్సులో, ఒక్కొక్క బ్యాచ్‌లో 20 మందిని చేర్చుకుంటారు. భారత్‌లోని ఏ గుర్తింపు పొందిన బోర్డు నుంచి అయినా సీనియర్ సెకండరీ (10+2) పరీక్ష పాసైన వారు, కనీసం 18 ఏళ్ల వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తు చేయవచ్చు.
కోర్సును పూర్తి చేశాక అభ్యర్థులు ‘‘గర్భిణీ మిత్ర సహాయకులు’’గా, ప్రీనేటల్, పోస్ట్‌నేటల్ కేర్ అసిస్టెంట్లుగా, యాంటినేటల్ వెల్‌నెస్ గైడ్‌లుగా, మేటర్నల్ హెల్త్ సపోర్ట్ వర్కర్లుగా తమ కెరియర్‌ను మలుచుకోవచ్చు. వీరికి ఆయుష్ కేంద్రాలు, ప్రసూతి వైద్యశాలలు, ప్రభుత్వేతర సంస్థలు, కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్టులు, వెల్‌నెస్ సంస్థల్లో అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
ప్రసవానికి ముందు దశలో చికిత్స సంబంధిత సంరక్షణను అందించడానికి ‘గర్భిణీ మిత్ర’ కార్యక్రమం ఒక ప్రత్యామ్నాయం ఏమీ కాదు కానీ, దానికి అనుబంధ భూమికను నిర్వహిస్తుంది. క్రమం తప్పక పరీక్షలు, రోగనిర్ధారణ పరీక్షలు, రక్త పోటు, హిమోగ్లోబిన్ పర్యవేక్షణ.. ఇవి అత్యవసరమే. కడుపుతో ఉన్న మహిళల్లో హెచ్చరిక సంకేతాలను గుర్తించి, వాటిని ఎప్పటికప్పుడు అర్హత కలిగిన డాక్లర్ల వద్దకు, ఆస్పత్రుల వద్దకు చేరుకోవడంలో శిక్షణను పూర్తి చేసిన ‘గర్భిణీ మిత్ర’లు సహాయాన్ని అందిస్తారు.
దరఖాస్తులను దాఖలు చేయడానికి 2026 ఆగస్టు 31 ఆఖరి తేదీ. మరింత సమాచారం తెలుసుకోవడానికి వివరణపత్రాన్ని ఇక్కడ చూడగలరు: Academic Brochure- Garbhini Mitra
(रिलीज़ आईडी: 2302828)
आगंतुक पटल : 10