యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో బ్రిక్స్ స్నేహపూర్వక సైకిల్ ర్యాలీకి నేతృత్వం వహించిన కేంద్ర మంత్రులు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీమతి రక్షా ఖడ్సే


బ్రిక్స్ దేశాల 87వ ‘ఫిట్ ఇండియా ఆదివారం‘ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు, శాఖాధిపతులు

నాడు పోస్టు చేయడమైనది: 23 AUG 2026 3:04PM by PIB Hyderabad

విశాఖపట్నం, ఆగస్టు 23: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే ఈరోజు విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల స్నేహపూర్వక సైకిల్ ర్యాలీకి నేతృత్వం వహించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ యువజన, క్రీడల మంత్రుల సమావేశం సందర్భంగా 87వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించారు. 

బ్రిక్స్ దేశాల మధ్య స్నేహం, సహకార స్ఫూర్తిని చాటుతూ ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యూఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన మంత్రులు, శాఖాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వారం ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ‘ఉన్నత్ భారత్ అభియాన్’  ఇతివృత్తంతో నిర్వహించారు. 

కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఫిట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా స్థిరంగా విస్తరిస్తోందని అన్నారు.

“ఆదివారాల్లో సైకిల్ తొక్కడం ద్వారా ఫిట్ ఇండియా  - కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 18,000 పైగా ప్రాంతాల్లో యువత సైక్లింగ్‌లో పాల్గొని, ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సైక్లింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మంచి వ్యాయామంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో, కాలుష్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. సైక్లింగ్ ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడంతోపాటు విదేశీ మారకద్రవ్యాన్ని కూడా పొదుపు చేయవచ్చు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం కోసం మనమందరం ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు కృషి చేద్దాం” అని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం విస్తృత స్థాయిని ప్రముఖులు ప్రశంసించారు. సైక్లింగ్ ఉద్యమాన్ని దేశంలోని వివిధ వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు డాక్టర్ మాండవీయను వారు అభినందించారు. ఆరోగ్యవంతమైన, సంపన్నవంతమైన సమాజ నిర్మాణానికి శారీరక దృఢత్వం ఎంతో కీలకమని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.

“వ్యక్తి ఆరోగ్యంగా, దృఢంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన సమాజమే సంపన్న దేశాన్ని నిర్మించగలదు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని మోదీజీ సంకల్పించారు. ఈ సంకల్పాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఆదివారం సైక్లింగ్‌ చేస్తూ మనల్ని మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకుందాం” అని ఆయన అన్నారు.

‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ 87వ విడత కార్యక్రమాన్ని ఈ రోజు న్యూఢిల్లీ, లే, కార్గిల్, పోర్ట్‌బ్లెయిర్‌ సహా దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేసి, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

న్యూఢిల్లీలోని ప్రసిద్ధ మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 1,000 మందికి పైగా పౌరులు పాల్గొని యోగా, జుంబా, తాడుతో గెంతడం వంటి ఫిట్‌నెస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇండియా గేట్‌ చుట్టూ 5 కిలోమీటర్ల సైక్లింగ్‌ రైడ్‌ నిర్వహించారు.

భారత హ్యాండ్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌, కోచ్‌ నవీన్‌ పునియా, జుంబా, నృత్య కొరియోగ్రాఫర్‌ శివికా అశ్విని ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. క్యారమ్‌, చెస్‌, బ్యాడ్మింటన్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, అడ్డంకుల మధ్య పరుగు వంటి క్రీడలతో ప్రత్యేక గేమ్‌ జోన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 5 నుంచి 85 ఏళ్ల వయసు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఫిట్ ఇండియా ఉద్యమం’లో భాగంగా నిర్వహిస్తున్నారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), రాహ్‌గిరి ఫౌండేషన్, ‘మై భారత్’ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి.  

ఈ సైక్లింగ్‌ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ప్రాంతీయ కేంద్రాలు, జాతీయ అత్యుత్తమ శిక్షణ కేంద్రాలు (ఎన్‌సీఓఈలు), శాయ్ శిక్షణ కేంద్రాలు (ఎస్‌టీసీలు), ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి అత్యుత్తమ శిక్షణ కేంద్రాలు (కేఐఎస్‌సీఈలు), ఖేలో ఇండియా కేంద్రాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2302552) సందర్శకుల సూచీ సంఖ్య : : 38
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil