వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేతృత్వంలో జపాన్ కు 200మంది సభ్యుల భారత వాణిజ్య ప్రతినిధివర్గం


భారత్, జపాన్ మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయనున్న నాలుగు రోజుల పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 23 AUG 2026 12:46PM by PIB Hyderabad

జపాన్‌లోని టోక్యో, నగోయా, ఒసాకాలలో 2026 ఆగస్టు 24 నుంచి నుండి 27 వరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పర్యటించనున్నారు. తయారీ, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, ఉక్కు నుంచి ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, అంకుర పరిశ్రమల వరకు విస్తరించిన వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులతో కూడిన భారత అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందానికి శ్రీ గోయల్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం పట్ల ఇరు దేశాలకు ఉన్న ఉన్నతమైన ఆకాంక్షలను ఈ పర్యటన ప్రతిబింబిస్తుంది. భారత్, జపాన్‌ తమ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

టోక్యో పర్యటనలో భాగంగా…. భారత అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వాములుగా ఉన్న ప్రముఖ జపనీస్ బహుళజాతి సంస్థలు, పారిశ్రామిక సంస్థల అగ్ర నాయకత్వంతో మంత్రి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 1,500 పైగా ప్రముఖ జపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్రగామి సంస్థ కైడాన్‌రెన్ (జపాన్ బిజినెస్ ఫెడరేషన్) తో రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరగనుంది. పెట్టుబడులు, ఆవిష్కరణలకు గమ్యస్థానంగా భారతదేశానికి పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తూ,  సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, అంకుర పరిశ్రమలు, విదేశీ పెట్టుబడిదారులతో సంబంధాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి అకాజావా రియోసేతో శ్రీ గోయల్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జపాన్‌లో నివసిస్తున్న భారతీయ వర్గాలతో సంభాషించడంతో పాటు జపాన్ ప్రభుత్వానికీ, పార్లమెంట్‌కూ చెందిన సీనియర్ సభ్యులతో కూడా సమావేశమవుతారు. 

సెంట్రల్ జపాన్ పారిశ్రామిక కేంద్రమైన నగోయాలో, చుకేరెన్ (సెంట్రల్ జపాన్ ఎకనామిక్ ఫెడరేషన్), నగోయా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో  కలిసి మంత్రి రోడ్‌షోకు నాయకత్వం వహిస్తారు. ఆటోమోటివ్, ఉక్కు రంగాల్లోని ప్రధాన తయారీ రంగ పెట్టుబడిదారులతోనూ, ఐచి ప్రిఫెక్చర్ నాయకులతోనూ సమావేశమవుతారు.

ఒసాకాలో  ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్‌షో'తో పాటు ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో జరిగే సమావేశాలతో  పర్యటన ముగుస్తుంది. భారత తయారీ, స్వచ్ఛ ఇంధనం, వినియోగదారుల మార్కెట్లలోని అవకాశాలను ప్రదర్శించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పెట్టుబడులు, సాంకేతికత, పారిశ్రామిక సహకారంలో భారత్ కు అత్యంత విశ్వసనీయ భాగస్వాములలో జపాన్ సుస్థిర స్థానం కలిగివుంది. భారత ఆటోమోటివ్, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాల రంగాలలో జపనీస్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన వ్యాపార బృందాల అసాధారణ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాలకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు దోహదపడే కీలకమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత  తయారీ రంగంలోనూ, తదుపరి తరం పరిశ్రమలలోనూ సహకారానికి కొత్త మార్గాలను సుగమం చేస్తుందని కూడా భావిస్తున్నారు 

 

***


(రిలీజ్ ఐడి: 2302465) సందర్శకుల సూచీ సంఖ్య : : 77
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Malayalam