పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జైపూర్ డిక్లరేషన్ (మంత్రుల ప్రకటన)ను ఆమోదించిన బ్రిక్స్ పర్యాటక మంత్రులు

ప్రజల అనుసంధానం, అవకాశాలు, సాంస్కృతిక మార్పిడికి పర్యాటకం కీలకం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2026 6:28PM by PIB Hyderabad

భారత అధ్యక్షతన జైపూర్ లో జరిగిన బ్రిక్స్ పర్యాటక మంత్రుల సమావేశం నేడు ముగిసింది. జైపూర్ డిక్లరేషన్ (బ్రిక్స్ పర్యాటక మంత్రుల అధికారిక ప్రకటన 2026)ను సమావేశం ఆమోదించింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పర్యాటక రంగానికి సంబంధించిన సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది.

కేంద్రసాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రతికూలతలను తట్టుకునే సామర్ధ్యం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతతో ముందడుగు -  ఇతివృత్తంతో 2026 భారత బ్రిక్స్ అధ్యక్షత కింద బ్రిక్స్ పర్యాటక విభాగం కార్యక్రమాలు ఈ సమావేశంతో విజయవంతంగా ముగిశాయి. 

ఈ సమావేశంలో బ్రిక్స్‌ సభ్య దేశాలకు చెందిన తొమ్మిది దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రుల స్థాయిలో బ్రెజిల్‌ పర్యాటక శాఖ మంత్రి గుస్తావో కోస్టా ఫెలిసియానో, ఇరాన్‌ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం, హస్తకళల శాఖ మంత్రి రెజా సలేహీ అమీరీ, దక్షిణాఫ్రికా పర్యాటక శాఖ మంత్రి ప్యాట్రిషియా డి లిల్లే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ టౌక్‌ అల్‌ మారీ పాల్గొన్నారు. వీరితో పాటు చైనా, ఇథియోపియా, ఇండోనేషియా, రష్యా దేశాల ప్రతినిధి బృందాల నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు. భారత ప్రతినిధి బృందంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ భువనేశ్‌ కుమార్‌, పర్యాటక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ హరికిషోర్‌ ఎస్‌. తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. 

బ్రిక్స్ కు భారత్‌ అధ్యక్షత కింద పర్యాటక అధ్యయన బృందం చేసిన కృషికి జైపూర్‌ డిక్లరేషన్‌ ప్రతిబింబంగా నిలిచింది. ఇందులో కృత్రిమ మేధ, పర్యాటకం, సుస్థిరత, బాధ్యతాయుత పర్యాటకం, పర్యాటక రంగంలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపు, పర్యాటక సంబంధ మార్పిడులు, ఆంక్షలు లేని ప్రయాణ సదుపాయాలు అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

బ్రిక్స్‌ పర్యాటక శాఖ మంత్రులు ఏకాభిప్రాయంతో ఆమోదించిన అధికారిక ప్రకటన పర్యాటక రంగంలో బాధ్యతాయుతమైన, సురక్షితమైన, మానవకేంద్రిత కృత్రిమ మేధ, డిజిటల్‌ సాంకేతికతలు తీసుకురాగల సమూల మార్పులను గుర్తించింది. పర్యాటక ప్రణాళిక, పర్యాటక ప్రాంతాల నిర్వహణ, సందర్శకులకు సేవలు, బహుభాషా సమాచార ప్రసారం, ప్రయాణ సదుపాయాల కల్పన వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించేందుకు మద్దతు తెలిపింది.

ఇది సుస్థిర సమాజ కేంద్రిత పర్యాటకం, సహజ, సాంస్కృతిక వారసత్వ సంపద రక్షణ, పర్యాటక రంగంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, విభిన్న పర్యాటక ఉత్పత్తుల అభివృద్ధి ప్రచారంపై కూడా ఈ ప్రకటన ప్రత్యేకంగా దృష్టి సారించింది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య నిరంతర నైపుణ్యాభివృద్ధి,  రీ స్కిల్లింగ్, పరిశ్రమ - విద్యా సంస్థల భాగస్వామ్యాలు, పర్యాటక రంగానికి సంబంధించిన డేటా, గణాంకాల మార్పిడి, అత్యుత్తమ విధానాల భాగస్వామ్యం, బలమైన ప్రజా సంబంధాల బలోపేతానికి ఇది ప్రాధాన్యతనిచ్చింది. 

సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌  మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించే ప్రయాణంలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రధాన ఆర్థిక కేంద్రాలకు మాత్రమే పరిమితమైన అభివృద్ధిని పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రత్యేక సామర్థ్యం పర్యాటక రంగానికి ఉందని పేర్కొన్నారు. పర్యాటకం ద్వారా హోటళ్లు, హోమ్‌స్టేలు, ట్యాక్సీ నిర్వాహకులు, టూర్‌ గైడ్‌లు, కళాకారులు, చేనేత కార్మికులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు లభిస్తున్నాయని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడుతున్న లక్షలాది కుటుంబాల జీవనోపాధికి పర్యాటక రంగం తోడ్పడుతోందని తెలిపారు.

పర్యాటక రంగాన్ని ఆర్థికంగా సుసంపన్నంగా, పర్యావరణపరంగా బాధ్యతాయుతంగా, సాంకేతికత ఆధారితంగా, సాంస్కృతికంగా ప్రామాణికంగా తీర్చిదిద్దేందుకు భారత్‌ చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. “అంతిమంగా పర్యాటకం ప్రజలను అనుసంధానిస్తుంది. ఇది స్థానికులకు అవకాశాలను కల్పిస్తుంది. సాంస్కృతిక మార్పిడికి దోహదపడుతుంది. ప్రభుత్వాల మధ్య అధికారిక సంబంధాలకు అతీతంగా మన దేశాల ప్రజలు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు పర్యాటకం వీలు కల్పిస్తుంది” అని అన్నారు.

పర్యాటక మంత్రుల సమావేశం సందర్భంగా బ్రెజిల్‌, ఇరాన్‌, దక్షిణాఫ్రికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశాలతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించింది. ఆయా దేశాల మంత్రుల నేతృత్వంలోని ప్రతినిధి బృందాలతో చర్చలతో పాటు, పర్యాటక రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయి.

బ్రిక్స్ కు భారత్‌ అధ్యక్షతన కొనసాగిన పర్యాటక విభాగం కార్యక్రమాలపై విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, జైపూర్‌ డిక్లరేషన్‌ ఆమోదం తదితర అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు.

జైపూర్‌లో జరిగిన పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో భాగంగా… స్థానిక సంప్రదాయ కళలు, హస్తకళలు, పర్యాటక కార్యక్రమాలకు చెందిన ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

రేపు (ఆగస్టు 22న) మంత్రులు, ప్రతినిధులు జైపూర్‌లోని ప్రసిద్ధ వారసత్వ కట్టడాలైన హవామహల్, సిటీ ప్యాలెస్, ఆమేర్ కోటలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా నగరంలోని గొప్ప వాస్తుశిల్ప, సాంస్కృతిక, పర్యాటక వారసత్వాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షిస్తారు .

 

***


(రిలీజ్ ఐడి: 2302231) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil