ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతరిక్ష రంగ అంకుర సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులతో ప్రధాని సమావేశం

భారత అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి చేసిన సాంకేతికతల పట్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని వివరించిన సీఈవోలు

అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన సీఈవోలు.. ఇది ఎన్నో కొత్త అవకాశాలను సృష్టించిందంటూ ప్రశంస

ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా అంతరిక్ష సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ప్రధాని పిలుపు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు, కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా నిలవగల సమర్థత భారత అంతరిక్ష రంగానికి ఉందన్న ప్రధాని

అంతరిక్ష, ఇతర సామాజికాభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని ప్రత్యేకంగా సూచించిన ప్రధాని

అంతరిక్షం పట్ల యువతలో ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించే దిశగా.. అటల్ టింకరింగ్ ల్యాబులతో మరింత సహకారాన్ని అందించాల్సిందిగా ప్రధాని సూచన

प्रविष्टि तिथि: 21 AUG 2026 2:21PM by PIB Hyderabad

సేవాతీర్థ్‌లో 20 అంతరిక్ష అంకుర సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం సమావేశమయ్యారు.

రాకెట్లు, పునర్వినియోగ సెమీ క్రయోజెనిక్ వాహక నౌకలు, వైమానిక రంగం, ఉపగ్రహాలు, అధునాతన చోదక వ్యవస్థలు, అంతరిక్ష - రక్షణ పరంగా నిఘా, అంతరిక్ష వ్యర్థాల తొలగింపు, ఏఐ ఆధారిత ప్రాంతీయ వాతావరణ, శీతోష్ణస్థితి సమాచారం వంటి విభిన్న రంగాల్లో పనిచేస్తున్న భారత అంతరిక్ష రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత ప్రైవేటు అంతరిక్ష రంగం శరవేగంగా పురోగతిని సాధిస్తున్న తీరును వివరించారు. ఈ రంగం భవిష్యత్తుపై తమ స్పష్టమైన కార్యాచరణను వివరించారు. ప్రధానమంత్రి అందించిన నిరంతర ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతూ... దేశీయంగా సాంకేతికతలను, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో తమ బృందాలు ఎంతో సమయాన్ని వెచ్చించి కృషి చేశాయన్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న బలమైన మద్దతును, పరిశ్రమల మధ్య సహకారాన్ని కూడా వారు వివరించారు. అంతరిక్ష రంగంలో నిర్దేశించుకున్న ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను సాధించేందుకు తమ బృందాలు పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాయని వారు తెలిపారు.

అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశమివ్వడం ఎనలేని ఉత్సాహాన్ని నింపడమే కాకుండా.. పరిశ్రమకు సరికొత్త అవకాశాలను కల్పించిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. వర్ధమాన భారత ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి చేసిన అధునాతన సాంకేతికతలను స్వీకరించేందుకు, వినియోగించుకునేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వారు తెలిపారు.

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వినూత్నంగా అంతరిక్ష రంగంలో ముందువరుసలో నిలిచిన పరిశ్రమల అధినేతలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ రంగం కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం.. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశాన్ని కల్పించిన అసలైన లక్ష్యానికి మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయనీ లేదా అందుకు సుముఖంగా లేవని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత వేగంగా సుస్థిరం చేసుకునేందుకు గొప్ప అవకాశాన్ని ఈ పరిస్థితులు కల్పిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అంతరిక్ష కంపెనీలు తమ సాంకేతికతల్లో సరికొత్త అనువర్తనాలపై పరిశోధించాలని, ప్రజల జీవితాల్లో మరింత సౌలభ్యాన్ని కలిగించే దిశగా అవి ఏ మేరకు ఉపయోగపడతాయన్న విషయమై దృష్టి కేంద్రీకరించాలని ప్రధానమంత్రి సూచించారు.

అంతరిక్ష రంగానికి చెందిన కంపెనీలు, ఇతర రంగాల సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. అంతరిక్ష వ్యర్థాల తొలగింపులో పనిచేస్తున్న సంస్థలు.. పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తూ తమ సాంకేతికతను విస్తరించుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్న అంతరిక్ష సాంకేతిక కంపెనీలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విభాగాలతో సమన్వయాన్ని పెంపొందించుకోవడం ద్వారా... రైతులు సమయానుకూల నిర్ణయాలు తీసుకుని, గరిష్ట దిగుబడిని సాధించడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.

ప్రపంచం అంతరిక్ష రంగం గురించి ఆలోచించినప్పుడల్లా.. భారత్ వైపే చూసేలా అనుకూలమైన వాతావరణాన్ని, బలమైన వ్యవస్థను సృష్టించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ స్థాయి ప్రతిభను, దిగ్గజ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించే శక్తిగా భారత అంతరిక్ష రంగం నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అటల్ టింకరింగ్ ల్యాబులతో మరింత సన్నిహిత సహకారం దిశగా ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల చిన్న వయసు నుంచే పిల్లల్లో అంతరిక్ష రంగం పట్ల ఉత్సుకత, జిజ్ఞాస కలుగుతాయన్నారు.

స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధ్రువ స్పేస్, గెలాక్సై, పీర్‌సైట్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, దిగంతర, సాట్‌షూర్, సుహోరా టెక్నాలజీస్, మనస్తు స్పేస్, ఆస్ట్రోబేస్, టేక్ మీ టు స్పేస్, వ్యోమ్ ఐసీ, కాస్మోసర్వ్ స్పేస్, ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్, స్కైసర్వ్ (హైస్పేస్), సెరెండిపిటీ స్పేస్, వాసర్ ల్యాబ్స్, మిస్ట్ ఈవో సంస్థల సీఈవోలు, వ్యవస్థాపకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

 

***


(रिलीज़ आईडी: 2302068) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam