భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్రిక్స్ 8వ సముద్ర.. ధ్రువ శాస్త్ర-సాంకేతిక కార్యవర్గ సమావేశం

प्रविष्टि तिथि: 20 AUG 2026 5:33PM by PIB Hyderabad

   కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఈ నెల 12 నుంచి 14వ తేదీవరకూ ‘నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్’ (ఎన్‌సీపీఓఆర్‌) గోవాలో 8వ సముద్ర-ధ్రువశాస్త్ర-సాంకేతిక పరిజ్ఞాన (ఓపీఎస్‌టీ) కార్యాచరణ బృందం సమావేశాన్ని నిర్వహించింది. ఈ కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ‘ఓపీఎస్‌టీ’ కార్యాచరణ బృందం తాజాగా సమావేశమైంది. ఈ బృందం ఏర్పాటైన నాటి నుంచీ బ్రిక్స్ సభ్య దేశాల స్థాయిలో శాస్త్ర-సాంకేతిక, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) సంయుక్త కార్యకలాపాల చట్రంలో భాగంగా కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ (డీఎస్‌టీ) సమన్వయంతో భూవిజ్ఞాన శాఖ సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో భారత్‌, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ల సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రతినిధులు పాల్గొన్నారు. పరస్పర ఆసక్తిగల రంగాలపై చర్చలతోపాటు సముద్ర, ధ్రువ శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకార బలోపేతం దీని లక్ష్యం. ఈ మేరకు ఆగస్టు 12న ‘ఎన్‌సీపీఓఆర్‌’ డైరెక్టర్ డాక్టర్ తంబన్ మెలోత్ సమావేశాన్ని ప్రారంభించారు. ఆత్రియా విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌, భూవిజ్ఞాన శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ శ్రీ మాధవన్ నాయర్ రాజీవన్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి గోవాలోని ‘ఎన్‌సీపీఓఆర్‌’ డైరెక్టర్ అధ్యక్షత వహించగా, బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి. ఇందులో ‘ఎంఓఈఎస్’, ‘డీఎస్‌టీ’ల అధికారులు, శాస్త్రవేత్తలు భారత్‌ ప్రతినిధులుగా పాలుపంచుకున్నారు. ఈ బృందానికి ‘ఎంఓఈఎస్’ శాస్త్రవేత్త (జి), సలహాదారు డాక్టర్ శ్రీ సందీప్ కుమార్ ముఖోపాధ్యాయ్ నేతృత్వం వహించారు.

సముద్ర-ధ్రువ ప్రాంత పరిశోధన రంగంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య శాస్త్రీయ సహకారం, విజ్ఞాన ఆదానప్రదానం, సామర్థ్య వికాసం, సంయుక్త పరిశోధన కార్యకలాపాల ప్రగతిపై చర్చలు, సంప్రదింపులకు ఈ సమావేశం ఒక వేదికగా మారింది. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల సమస్యలు, అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ మేరకు ప్రత్యేకించి.. తీరప్రాంత నగరాల పరిరక్షణపై శ్రద్ధ పెట్టారు. తీరప్రాంతాల సమస్యలు-పటిష్ట, పునరుత్థాన సముద్ర సమాచార సేవలకు రూపకల్పన దిశగా సంయుక్త సహకారంతో ‘గ్లోబల్ ఓషన్ అబ్జర్వింగ్ సిస్టమ్’ (జీఓఓఎస్‌) బలోపేతానికి నిర్ణయించారు. అలాగే, ఉమ్మడి ధ్రువ ప్రాంత పరిశోధన పురోగమనం-అంటార్కిటిక్ అన్వేషణలో సార్వజనీన భాగస్వామ్యం.. ముఖ్యంగా యువ పరిశోధకుల సామర్థ్య వికాసానికి మెరుగైన అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. తీరప్రాంత పునరుత్థాన సామర్థ్యం పెంపు, ఉమ్మడి ధ్రువ సముద్ర జీవవైవిధ్య అధ్యయనం, అంతర్జాతీయ ధ్రువ సంవత్సరం-5కు లక్ష్యనిర్దేశం, యువ పరిశోధకుల సామర్థ్య వికాసానికి  ప్రోత్సాహం తదితరాలపై సంయుక్త కార్యకలాపాలకు ఆయా దేశాల ప్రతినిధి బృందాలు అంగీకరించాయి. ఈ కార్యాచరణ బృందం కోసం భవిష్యత్‌ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పన ప్రక్రియ ఖరారు సహా స్వల్పకాలిక కార్యాచరణను బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న భారత్‌ సమన్వయం చేస్తుంది.

ఈ నెల 14న ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా బ్రిక్స్‌ 8వ ఓపీఎస్‌టీ సమావేశం ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ (MoES) కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ తుమ్మల ప్రసంగించారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో చర్చలు ఫలప్రదంగా సాగడంతోపాటు సత్ఫలితాలు సిద్ధించడంపై బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను ఆయన అభినందించారు. సముద్ర-ధ్రువ ప్రాంత విజ్ఞాన శాస్త్రాలలో శాస్త్రీయ సహకార బలోపేతానికి ఈ సమావేశం ఒక అమూల్య వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. కీలక ప్రాధాన్య రంగాలపై అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావడంపై సంతృప్తి వెలిబుచ్చారు. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, శాస్త్రవేత్తలు-విద్యార్థుల ఆదానప్రదానం, పరిశోధన మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం, సంస్థాగత సంబంధాల బలోపేతం వంటి నిర్దిష్ట సహకార చర్యల ద్వారా సమావేశం నిర్ణయాలను అమలు చేయాలని ఆయన సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. సముద్ర-ధ్రువ ప్రాంత విజ్ఞానం, సాంకేతికతలలో బ్రిక్స్ సహకారాన్ని ఈ సమావేశం సిఫారసులు, నిర్ణయాలు మరింత బలోపేతం చేయగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సహకారాత్మక కృషి, బలమైన భాగస్వామ్యాల ద్వారా సముద్ర-ధ్రువప్రాంతాల విజ్ఞానం, సాంకేతికతల పురోగమనంపై బ్రిక్స్‌ దేశాల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సమావేశం ముగిసింది.

 

***


(रिलीज़ आईडी: 2301760) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil