పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ ‘ఐజీఐ’ విమానాశ్రయంలో సరకు బదిలీ కార్యకలాపాలకు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు శ్రీకారం
ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయంతో సరకు బదిలీ సంస్కరణను 2 కొత్త అంతర్జాతీయ.. 4 కొత్త దేశీయ విమానాశ్రయాలకు విస్తరింపజేసిన మంత్రి
प्रविष्टि तिथि:
19 AUG 2026 9:06PM by PIB Hyderabad
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయం టెర్మినల్-2 వద్ద భారత సరకు బదిలీ (ట్రాన్స్ షిప్‌మెంట్ కార్గో-టీపీ) సంస్కరణ విస్తృత దశకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ రోజు శ్రీకారం చుట్టారు. ‘ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్’ (డీఐఏఎల్) ‘ట్రాన్స్‌షిప్‌మెంట్ ఎక్సలెన్స్ సెంటర్’ (టీఈసీ) వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన విమానయాన రంగంలో వాణిజ్య సౌలభ్యం బలోపేతానికి మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా పారిశ్రామిక రంగం సూచన మేరకు సరకు బదిలీ ప్రక్రియలో దీర్ఘకాలం నుంచీ కొనసాగుతున్న ‘తప్పనిసరి పునఃతనిఖీ’ నిబంధన తీవ్ర జాప్యానికి దారితీస్తున్నట్లు గుర్తించాం. సరకు రవాణా వేగానికి తీవ్ర అవరోధంగా మారిన ఈ విధానాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దుచేశాం. తద్వారా సరకు బదిలీ కూడళ్ల వద్ద రద్దీ సహా చేరవేత సమయాన్ని, నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ భావన (పీఓసీ)ను చెన్నై-ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఆచరణలోకి తెచ్చినపుడు నిర్దేశిత గమ్యానికి సగటు రవాణా సమయం 60 నుంచి 20 గంటలకు తగ్గింది” అని వివరించారు.
ఈ ఏడాది జూన్ 20న చెన్నై-ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ సెక్టార్‌లో ‘డీఐఏఎల్’ పరిధిలోని ‘టీఈసీ’ నుంచి ఎయిరిండియా ద్వారా జాతీయ, అంతర్జాతీయ సరకు బదిలీ ‘పీఓసీ’ని ప్రారంభించారు. అప్పటి నుంచి 280 టన్నుల సరకులు బదిలీ కాగా, విమాన సరకు రవాణా సామర్థ్య వినియోగం 75 నుంచి దాదాపు 100శాతానికి పెరిగింది.
ఈ విజయం ఆధారంగా ఇవాళ దేశంలోని మరో 4 కీలక కేంద్రాలు- బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ సహా 2 కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాలు- లండన్, కోపెన్‌హాగన్‌లకు ఈ నెట్‌వర్కును విస్తరించారు. దీనివవల్ల ఈ మార్గాల్లో ఎయిరిండియా నెలవారీ సరకు రవాణా సామర్థ్యం 1,763 నుంచి 3,183 టన్నులకు.. అంటే- దాదాపు 80 శాతం పెరుగుతుందని అంచనా.
శ్రీ రామ్మోహన్ నాయుడు తన ప్రసంగం కొనసాగిస్తూ- “మరో 4 ప్రధాన దేశీయ సరకు మార్కెట్లు, 2 కొత్త అంతర్జాతీయ గమ్యాల అనుసంధానం ద్వారా ఈ విజయవంతమైన నమూనాను ఇప్పుడు మరింత విస్తరిస్తున్నాం. జాతీయ-అంతర్జాతీయ విమాన రవాణాపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. అయితే, తూర్పు-పశ్చిమ దేశాల మధ్యగల మన వ్యూహాత్మక స్థానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత్‌ను అంతర్జాతీయ సరకు బదిలీ కూడలిగా నిలపాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నాం. అనంతరం ఈ వ్యవస్థను అంతర్జాతీయ-అంతర్జాతీయ, అంతర్జాతీయ-దేశీయ రవాణాకూ విస్తరిస్తాం” అని తెలిపారు.
అలాగే, “దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ప్రపంచ రవాణా కూడళ్లుగా రూపొందించాలన్న ప్రభుత్వ విస్తృత దృక్కోణంలో ప్రస్తుత సంస్కరణ ఒక భాగం. ప్రయాణికుల కోసం ‘హబ్ అండ్ స్పోక్’ కార్యకలాపాల బలోపేతం చేశాక, భారత విమాన రవాణా కేంద్రాల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి చర్యలు చేపడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
లోగడ ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) ద్వారా 2025 జూలై 21న ‘ఏవీఎస్‌ఈసీ సర్క్యులర్ నం.6/2024కు అనుబంధం-II ద్వారా ఈ చట్రాన్ని సవరించారు. దీని ప్రకారం- నిర్దిష్ట భద్రత చర్యలకు అనుగుణంగా ప్రత్యేక సరకు బదిలీ భద్రత నిర్వహణ ప్రదేశాల ద్వారా సురక్షిత బదిలీ సరకులను పునఃతనిఖీ లేకుండా తరలించేందుకు అనుమతి ఇచ్చారు.
భారత విమాన సరకు రవాణా వ్యవస్థ పోటీతత్వం మెరుగుదల సహా ఓ కీలక ఆటంకం తొలగింపులో కృషితోపాటు ఆచరణాత్మక ప్రయోగ విజయంలో పాలుపంచుకున్న ‘డీఐఏఎల్, బీసీఏఎస్, సీఐఎస్‌ఎఫ్’, విమానయాన సంస్థలు, కస్టమ్స్ విభాగం సహా భాగస్వాములందరికీ మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే అదనపు ప్రధాన కూడళ్లు, అంతర్జాతీయ గమ్యాలను కూడా దీని పరిధిలోకి తేవాలని మంత్రిత్వశాఖ యోచిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల విమానయాన, సరకు రవాణా కూడలిగా భారత్ స్థానం మరింత పటిష్టమవుతుంది.
ఈ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అసంగ్బా చుబా ఆవో పాల్గొన్నారు. అలాగే, బీసీఏఎస్ సంయుక్త డైరెక్టర్ జనరల్ శ్రీమతి ప్రతిభా అంబేడ్కర్ సహా ఏంఓసీఏ, ఏఏఐ, బీసీఏఎస్, డీఐఏఎల్, ఎయిరిండియా తదితర భాగస్వామ్య సంస్థల సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2301414)
आगंतुक पटल : 3