ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏనుగు దంతపు వస్తువుల అక్రమ రవాణా ముఠా ప్రయత్నాలను భగ్నం చేసిన డీఆర్ఐ


అద్భుతంగా రూపొందించిన 54 ఏనుగు దంతపు కళాఖండాలు స్వాధీనం - నలుగురి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 19 AUG 2026 9:00PM by PIB Hyderabad

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈ రోజు నిర్వహించిన సోదాల్లో, వన్యప్రాణుల అక్రమ రవాణా సిండికేట్‌ను ఛేదించింది. ఏనుగు దంతాలపై అత్యంత అద్భుతంగా రూపొందించిన 54 కళాఖండాలను స్వాధీనం చేసుకుంది.

ఏనుగు దంతాల కళాఖండాల అక్రమ వ్యాపారానికి సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, డీఆర్ఐ అధికారులు లక్నోలో సోదాలు నిర్వహించారు. వన్యప్రాణుల సంబంధిత వస్తువుల అక్రమ రవాణ వ్యాపారంలో పాలుపంచుకుంటున్న ఒక సిండికేట్‌కు చెందిన నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏనుగు దంతాలతో అత్యంత సుందరంగా రూపొందించిన 54 కళాఖండాలనూ స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న కళాఖండాల్లో ఎద్దు, ఏనుగు, శునకం వంటి జంతువుల బొమ్మలు... యోధుడు, బిడ్డను హత్తుకున్న తల్లి వంటి మానవ సంబంధిత బొమ్మలు... కత్తెర, దువ్వెన, అగరుబత్తి స్టాండ్, కుంకుమ భరిణె వంటి ఇతర వస్తువుల కళారూపాలూ ఉన్నాయి. ఏనుగు దంతాలతో తయారు చేసిన ఈ కళాఖండాలు అత్యంత సుందరంగా, చక్కటి కళా నైపుణ్యంతో రూపొందించినవి. వాణిజ్యపరంగా, పురాతన కళాఖండాలుగా ఇవి అత్యంత విలువ గలవి. స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాల కళాఖండాలనూ, అదుపులోకి తీసుకున్న నలుగురు సిండికేట్‌ సభ్యులనూ తదుపరి విచారణ కోసం యూపీ అటవీ శాఖకు అప్పగించారు.

అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షజాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం (సీఐటీఈఎస్) కింద భారత్ కలిగి ఉన్న అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా... వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 సహా ఇతర నిబంధనల ప్రకారం ఏనుగు దంతం, దానితో తయారు చేసిన వస్తువుల వాణిజ్యం నిషేధం.

జూలై నెలలో నిర్వహించిన (రిలీజ్ లింక్: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2284262&reg=1&lang=1) రెండు వేర్వేరు సోదాల్లో భాగంగా రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో 11 కిలోల ఏనుగు దంతాలను, కోల్‌కతాలోని హౌరాలో ఏనుగు దంతాలపై అత్యంత నైపుణ్యంతో చెక్కిన రెండు దేవతామూర్తులనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మే నెలలో (రిలీజ్ లింక్: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266027&reg=48&lang=2) కర్ణాటకలోని మైసూరులో ఒక ముఠాను పట్టుకున్న డీఆర్ఐ, 4 కిలోల ఏనుగు దంతాలనూ స్వాధీనం చేసుకుంది.

ఈ వరుస సోదాలతో వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడే వారికి ముప్పు పెరుగుతోందని హెచ్చరించడం సహా... జాతీయ చట్టాలు, సీఐటీఈఎస్ కింద అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా భారత జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో, అటువంటి నేరపూరిత నెట్‌వర్క్‌లను నిర్మూలించడంలో డీఆర్ఐ అచంచల నిబద్ధతనూ ఇవి స్పష్టం చేస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2301413) సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Kannada