ఆర్థిక మంత్రిత్వ శాఖ
వినూత్నంగా మొక్కజొన్నలో దాచి 56 కిలోల మెథాంఫేటమైన్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని భగ్నం చేసిన డీఆర్ఐ... ఇద్దరి అరెస్టు
प्रविष्टि तिथि:
19 AUG 2026 6:23PM by PIB Hyderabad
అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తన నిరంతర కృషిని కొనసాగిస్తూ... భారత్ నుంచి సౌదీ అరేబియాకు గణనీయ పరిమాణంలో అక్రమంగా మెథాంఫేటమైన్‌ను తరలించే ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భగ్నం చేసింది.
ఈ నెల 16, 17 తేదీల్లో డీఆర్ఐ నిర్వహించిన ఒక నిఘా ఆధారిత ఆపరేషన్‌లో... నవశేవా పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్న సరుకు నుంచి పొడి రూపంలో ఉన్న సుమారు 56 కిలోల మెథాంఫేటమైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు గల 351 సంచుల్లోని ఒకదానిలో ఈ నిషేధిత మాదకద్రవ్యాన్ని చాకచక్యంగా మొక్కజొన్నతో కలిపి ఉంచారు. స్వాధీనం చేసుకున్న మెథాంఫేటమైన్‌ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985 నిబంధనల ప్రకారం జప్తు చేశారు.
వేగంగా జరిగిన దర్యాప్తులో, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఎగుమతిదారు, రవాణాదారులను గుర్తించారు. ఎగుమతి సరుకు రవాణ, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఆ రవాణాదారు విదేశీ కొనుగోలుదారుతో సమన్వయం చేసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. అక్రమ రవాణా ప్రయత్నంలో వారి పాత్రల ఆధారంగా, ఎన్‌డీపీఎస్ చట్టం-1985 నిబంధనల కింద ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
దాచి ఉంచిన విధానం — అధిక పరిమాణంలో మెథాంఫేటమైన్‌ను మొక్కజొన్నతో విడదీయలేని విధంగా కలిపి ఉంచారు. ఆ సరుకును ఒక సాధారణ వ్యవసాయ ఉత్పత్తిగా మభ్యపెట్టి, ఎగుమతి సమయంలో జరిగే సాధారణ తనిఖీ, గుర్తింపును తప్పించుకోవడానికి ఉద్దేశించిన ఒక విలక్షణమైన విధానాన్ని ఈ ప్రయత్నం సూచిస్తోంది.
మెథాంఫేటమైన్ ప్రత్యేకించి దుర్వినియోగం, వ్యసనానికి అధిక అవకాశం ఉన్న అత్యంత శక్తిమంతమైన కృత్రిమ మానసిక ఉత్తేజిత పదార్థం. దీని వాడకం వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, అధిక రక్తపోటు, ఆందోళన, భ్రాంతి, మానసిక రుగ్మత సహా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన శారీరక, మానసిక దుష్ప్రభావాలూ కలుగుతాయి. దీర్ఘకాలిక లేదా పునరావృత వాడకం వల్ల మాదకద్రవ్యాలు వ్యసనంగా మారడంతో పాటు ఆరోగ్యం, పనితీరు గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉంది.
***
(रिलीज़ आईडी: 2301354)
आगंतुक पटल : 5