వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎగుమతిదారులకు ఈయూ సీబీఏఎం నియంత్రణలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన వాణిజ్య విభాగం
భారతీయ ఎగుమతిదారుల్లో అవగాహనను, సన్నద్ధతను పెంపొందించడానికి ఎన్‌ఏబీసీబీ, ఈఈపీసీ సహకారంతో కార్యక్రమ నిర్వహణ
సీబీఏఎం బాధ్యతలు, అంతర్గత ఉద్గారాలు, డేటా రిపోర్టింగ్, అక్రిడిటేషన్, ధ్రువీకరణలపై ఎగుమతిదారులకు అవగాహన
प्रविष्टि तिथि:
18 AUG 2026 10:09PM by PIB Hyderabad
యూరోపియన్ యూనియన్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (ఈయూ సీబీఏఎం) నియంత్రణలపై ఎగుమతిదారులకు అవగాహన కార్యక్రమాన్ని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని వాణిజ్య విభాగం నిర్వహించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (ఎన్ఏబీసీబీ), ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) సహకారంతో వాణిజ్య విభాగం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొన్నారు. వారిలో ఎగుమతిదారులు, పరిశ్రమ భాగస్వాములు ఉన్నారు. సీబీఏఎం పరిధిలో మారుతున్న నియంత్రణ అవసరాల గురించి భారతీయ ఎగుమతిదారుల్లో అవగాహన, సన్నద్ధతను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈయూ సీబీఏఎం నియంత్రణ వర్తింపు, వాటి పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు, ఎగుమతిదారుల బాధ్యతలు, అంతర్గత ఉద్ఘారాల లెక్కింపు, డేటా సేకరణ, రిపోర్టింగ్ అవసరాలు, అక్రిడిటేషన్, ధ్రువీకరణ యంత్రాంగాలపై ఈ కార్యక్రమం అవగాహన కల్పించింది. ఈ నిబంధనలను ఆచరణలో ఎలా అమలు చేయాలో ఎగుమతిదారులకు మరింత సులభంగా అర్థమయ్యేలా, ఇనుము, ఉక్కు, అల్యూమినియం రంగాలకు సంబంధించిన కొన్ని వాస్తవ అధ్యయనాలపై కూడా చర్చించారు.
సీబీఏఎం నియంత్రణలను, సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవడానికి, అమలు, నివేదికను అందించడానికి సంబంధించిన సమస్యలపై స్పష్టతను కోరడానికి అవసరమైన వేదికను ఎగుమతిదారులు, పారిశ్రామిక ప్రతినిధులకు ఈ సమావేశం అందించింది. అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతకు సంబంధించి నిబంధనల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై సకాలంలో అవగాహన పెంచుకోవడం, ముందుగానే సన్నద్ధమవడం ఎంత అవసరమో ఈ చర్చలు తెలియజేశాయి.
ఈ సెషన్‌ను ఉద్దేశించి వాణిజ్య విభాగం కార్యదర్శి శ్రీ అమిత్ వర్మ ప్రసంగించారు. అంతర్జాతీయ మార్కెట్లలో కొత్తగా పుట్టుకొస్తున్న సుస్థిరత సంబంధిత అవసరాలను తీర్చడానికి భారతీయ ఎగుమతిదారులు పూర్తి అవగాహనతో, సన్నద్ధంగా ఉండేలా చూసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు. ఎగుమతిదారుల్లో కొత్తగా వస్తున్న నియంత్రణల అవసరాలపై అవగాహన పెంపొందించడానికి వాణిజ్య విభాగం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలియజేశారు. పరిశ్రమతో, సంబంధిత భాగస్వాములతో తమ విభాగం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. భారతీయ ఎగుమతిదారుల ఆందోళనలను పరిష్కరించడానికి, వారికి ఆచరణాత్మకమైన, అమలు చేయదగిన పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సమావేశ నేపథ్యాన్ని ఎన్‌ఏబీసీబీ సీఈఓ శ్రీ ఎన్. వెంకటేశ్వరన్ వివరించారు. ఉద్గారాలకు సంబంధించిన డేటాపై విశ్వాసాన్ని పెంచడానికి, సీబీఏఎం నిబంధనల అమలుకు తోడ్పడటానికి... పటిష్టమైన అక్రిడిటేషన్, వెరిఫికేషన్ వ్యవస్థ ఉండటం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఎగుమతుల రంగానికి సంబంధించిన అన్ని దశల్లోనూ అవగాహన, ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని ఈఈపీసీ చైర్మన్ శ్రీ పంకజ్ చద్దా స్పష్టం చేశారు. సరఫరాదారులు, ఇతర భాగస్వాముల వద్ద ఉద్గారాలకు సంబంధించిన సరైన సమాచారం అందుబాటులో ఉండటం కూడా దీనిలో భాగమని ఆయన తెలిపారు. భారతీయ ఎగుమతిదారులు నిబంధనలను పాటించేలా చూడటానికి సమర్థవంతమైన ధ్రువీకరణ వ్యవస్థలు ఉండాల్సిన అవసరాన్ని కూడా ఆయన వివరించారు.
కొత్తగా వస్తున్న సుస్థిరత సంబంధిత వాణిజ్య నియంత్రణలపై అవగాహనను, సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎగుమతిదారులు, పారిశ్రామిక సంఘాలు, సంబంధిత సంస్థలతో కలసి నిరంతరం పనిచేస్తామని వాణిజ్య విభాగం తెలియజేసింది. అలాగే మారుతున్న ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా భారతీయ పరిశ్రమను సన్నద్ధం చేయడంలోనూ సహకారం అందిస్తానని పునరుద్ఘాటించింది.
ఈ కార్యక్రమం ప్రశ్నోత్తరాలు, పరిశ్రమ, ఎగుమతిదారుల సంభాషణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ఈయూ సీబీఏఎం, దాని అమలుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ కోరే అవకాశం లభించింది.

(रिलीज़ आईडी: 2301194)
आगंतुक पटल : 4