రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గువహటి – తేజ్‌పూర్ కారిడార్: హైవే అనుసంధానంతో అస్సాం తేయాకు తోటలు, పర్యాటకం, వాణిజ్యానికి ఊతం

నాడు పోస్టు చేయడమైనది: 18 AUG 2026 5:34PM by PIB Hyderabad

అస్సాం చాయ్! ఘుమఘుమలాడుతూ మన బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌ను చేరుకోవడానికి ముందు సుదీర్ఘ ప్రయాణమే చేస్తుంది. తేయాకు తోటలో ఆకులను తుంచి, ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి, బండెక్కిస్తే – ఊర్లూ రాష్ట్రాలను దాటుకుంటూ రోడ్డుపై పరుగులు పెడుతూ.. వర్తకులనూ, మార్కెట్లనూ దాటుకుని ఎట్టకేలకు మన ఊరికొస్తుంది. అస్సాం తోట పంట మన ఇంట పరిమళిస్తుంది. ఆస్వాదించడం అనివార్యమనిపించేంతగా జీవితంలో భాగమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగానూ, అనుసంధానంలోనూ అత్యంత కీలకమైన ఈ వ్యవస్థలకు మరింత ఊతమిచ్చేలా కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి - 15 పరిధిలో 135.87 కి.మీ నాలుగు వరుసల, ప్రవేశ నియంత్రిత గువహటి - తేజ్‌పూర్ కారిడార్ నిర్మాణం కోసం.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నెల మొదట్లో ఆమోదించింది.

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని ఆర్థిక, సామాజిక, వస్తు రవాణా కేంద్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఈ కారిడార్‌కు ప్రణాళిక రూపొందించారు. 15.11 కిలోమీటర్ల మంగళ్‌దోయ్ బైపాస్ మినహా.. గువహటి సమీపంలోని బైహాటా చారియాలి నుంచి తేజ్‌పూర్‌ను కలిపే ఈ ప్రాజెక్టును మొత్తం రూ. 8,970.20 కోట్ల మూలధన వ్యయంతో నిర్మించనున్నారు. బిల్డ్ - ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ టోల్ విధానంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు.

ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే వాహనాల సగటు ప్రయాణ వేగం 100 శాతం పెరగడంతోపాటు.. ప్రయాణ సమయం సగానికి తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది ఇంధనం పొదుపు చేసేందుకు తోడ్పడడమే కాకుండా, వాహనాల నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. బైహాటా చారియాలి, సిపాఝార్, ఖరూపేటియా, దేకియాజులీ, తేజ్‌పూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మొత్తం 58.7 కి.మీ పొడవైన అయిదు ప్రధాన బైపాస్‌ల నిర్మాణాన్ని కూడా ఈ ప్రాజెక్టులో చేర్చారు. అస్సాంలోని గువహటిని అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్, పాసీఘాట్‌లతో కలిపే జాతీయ రహదారి వ్యవస్థలో ఇదొక కీలక భాగంగా మారబోతోంది. ఈశాన్య రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.

కప్పు వెనుక ప్రయాణం

అస్సాం తేయాకు పరిశ్రమ ఇప్పటికే అధికారిక మార్కెట్లతో బలంగా అనుసంధానమై ఉంది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గువహటిలో వేలం ప్రాంగణాన్ని నిర్వహించడంతోపాటు.. ఆ కేంద్రానికి సంబంధించి వేలం గణాంకాలను వారం వారం విడుదల చేస్తుంది. ఈ ప్రాంత తేయాకు వాణిజ్యంలో గువహటి ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.

సుదీర్ఘమైన ఆ సరఫరా వ్యవస్థలోని పలు కీలక దశల్లో.. కచ్చితమైన హైవే ప్రయాణానికి ఎంతో ప్రాధాన్యముంటుంది. తేయాకు ఉత్పత్తిదారులకూ, రవాణా చేసేవారికీ ఒక మంచి రోడ్డు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. వాహనం ఎంత త్వరగా గమ్యస్థానానికి చేరిందన్నదే కాదు.. మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ ప్రయోజనాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఆటంకాలు లేకపోవడం, ప్రయాణం విషయాల్లో మరింత కచ్చితత్వం, వాహన నిర్వహణ ఖర్చులు తగ్గడం, సరుకు రవాణా వేగవంతంగా, సునాయసంగా సాగడం... ఇలాంటి నమ్మకమైన అంశాలను కూడా ఆ విషయంలో పరిగణించాలి.

అలాంటి విస్తృత పాత్రనే గువహటి - తేజ్‌పూర్ కారిడార్ పోషిస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలు, వాణిజ్య మార్గాలను అనుసంధానిస్తూ.. ప్రయాణికులు, సరుకుల రవాణాను వేగవంతమూ, సురక్షితమూ చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

తేయాకు తోటల ప్రాంతం పర్యాటక కేంద్రమైతే...

ఈ ప్రయాణంలో మరో అవకాశం కూడా దాగి ఉంది.. అదే ‘టీ టూరిజం’. అస్సాం తేయాకు క్షేత్రాలది ప్రత్యేక ఆకర్షణ. పంటకు మాత్రమే అవి పరిమితం కావు. ఆ తోటలు, ఫ్యాక్టరీలు, వారసత్వం, సంస్కృతి... విస్తృత పర్యాటక అనుభవంలో భాగమవుతాయి.

కొత్తగా నిర్మించే ఈ కారిడార్ ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక కేంద్రాలకు రాకపోకలను మెరుగుపరచడమే కాకుండా.. ఆధ్యాత్మిక క్షేత్రమైన కామాఖ్య మాత ఆలయం, కాజీరంగా జాతీయ పార్కు, ఓరాంగ్ జాతీయ పార్కు వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు అనుసంధానాన్ని మరింత పెంచుతుంది. ఇది గువహటి, తేజ్‌పూర్, ఉత్తర అస్సాంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ పర్యాటక వలయాన్ని మరింత బలోపేతం చేసేందుకు విస్తృత అవకాశాలను కల్పిస్తుంది.

విస్తృతమైన ఆర్థిక పరిధి ఉన్న రహదారి

ఈ కారిడార్ విస్తృతి గణనీయమైనది. నాలుగు వరుసల ప్రవేశ నియంత్రిత రహదారితోపాటు.. 15 ప్రధాన వంతెనలు, 30 చిన్న వంతెనలు, 19 ఫ్లైఓవర్లు, ఒక ఏనుగుల అండర్‌పాస్ (తేజ్‌పూర్ బైపాస్‌లో), 46 సాధారణ అండర్‌పాస్‌లను ఈ ప్రాజెక్టులో నిర్మించనున్నారు. అంతేకాకుండా, ఈ కారిడార్‌ను ప్రవేశ నియంత్రిత రహదారిగా అభివృద్ధి చేస్తూనే.. స్థానిక వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా 210 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

పీఎం గతిశక్తి పరిధిలోని 8 ఆర్థిక, 2 సామాజిక, 3 పర్యాటక, 7 వస్తు రవాణా కేంద్రాలను అనుసంధానించేలా దీనిని రూపొందించారు. వీటిలో 3 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 జలరవాణా టెర్మినళ్లు ఉన్నాయి.

ఇది రోడ్డు మాత్రమే కాదు: పట్టణాల్లో రద్దీ తగ్గి.. అస్సాం శక్తిమంతమవుతుంది

వేగవంతమైన ప్రయాణమే కాకుండా.. వ్యూహాత్మకంగానూ, నగర రవాణా పరంగానూ ఈ ప్రాజెక్టు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. భారత వైమానిక దళంతో సమన్వయంతో తేజ్‌పూర్ బైపాస్‌పై 4.9 కిలోమీటర్ల అత్యవసర ల్యాండింగ్ సదుపాయం ఏర్పాటును ఇందులో ప్రతిపాదించారు. అలాగే బ్రహ్మపుత్రా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న ప్రస్తుత జాతీయ రహదారి-27 తూర్పు-పశ్చిమ కారిడార్‌పై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది దోహదపడుతుంది. 58.7 కి.మీ పొడవైన అయిదు ప్రధాన బైపాస్‌లు ఈ కారిడార్‌లో ముఖ్యమైనవి. ఇవి బైహాటా చారియాలి, సిపాఝార్, ఖరూపేటియా, దేకియాజులీ, తేజ్‌పూర్ వంటి రద్దీ ఉన్న పట్టణాల నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తాయి. ఇది స్థానికంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా, రహదారి భద్రతను కూడా మెరుగుపరుస్తుంది.  

 

***


(రిలీజ్ ఐడి: 2301045) సందర్శకుల సూచీ సంఖ్య : : 47
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil