సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కృత్రిమ మేధ, క్వాంటం, సైబర్ భద్రత, డిజిటల్ సాధనాలతో పాలనలో వేగవంతమైన మార్పులు: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
లేటరల్ ఎంట్రీ అధికారులకు 15 రోజుల రీఫ్రెషర్ కోర్సు.. పరస్పర చర్చలు, నిరంతర అభ్యాసానికి, అభిప్రాయాల సేకరణకు చక్కని వేదిక: డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధాని శ్రీ మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్@2047’ నిర్మాణంలో అధికారులు కీలక పాత్రధారులు: కేంద్రమంత్రి
ప్రభుత్వం, రాజకీయ నాయకులు, మీడియా, ప్రజలతో సమర్థంగా మమేకమయ్యేందుకు అధికారులకు బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
18 AUG 2026 4:42PM by PIB Hyderabad
ఆధునిక పరిపాలనా వ్యవస్థలో కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, డిజిటల్ సాధనాలు వేగంగా మార్పులు తీసుకువస్తున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పరిపాలనా ప్రక్రియలు, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సివిల్ సర్వెంట్లు నిరంతరం నేర్చుకోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు.
లేటరల్ ఎంట్రీ ద్వారా నియమితులైన జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల కోసం నిర్వహిస్తున్న 15 రోజుల రిఫ్రెషర్ కోర్సులో పాల్గొన్న వారిని ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. వేగంగా మారుతున్న పరిపాలనా విభాగంలో అధికారులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తిని కొనసాగించాలని, తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ రిఫ్రెషర్ కోర్సును కేవలం ఉపన్యాసాలు వినే కార్యక్రమంగా కాకుండా, పరస్పర చర్చలు, సమాచార మార్పిడి ద్వారా నేర్చుకునే వేదికగా చూడాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇప్పటికే విస్తృతమైన వృత్తిపరమైన అనుభవం, పరిణతి కలిగిన అధికారులు చర్చల్లో చురుగ్గా పాల్గొని, తమ శిక్షణ అవసరాలకు సంబంధించిన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకోవాలని పిలుపునిచ్చారు.
సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న వేగవంతమైన మార్పుల గురించి మంత్రి ప్రస్తావిస్తూ.. కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికతలు, సైబర్ భద్రత, డిజిటల్ సాధనాల్లో చోటుచేసుకుంటున్న అభివృద్ధి పాలన, పరిపాలనా ప్రక్రియలను ఎంతగానో ప్రభావం చూపుతోందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతలను సమర్థంగా అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా స్పందించేందుకు అధికారులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం ఎంతో అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను, ప్రభుత్వ సంస్థాగత ప్రాధాన్యతను కాపాడుకుంటూనే... ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రజలకు అందించడంలో నూతన సాంకేతికతలను, డిజిటల్ సాధనాలను ఉపయోగించాల్సిన అదనపు బాధ్యత సివిల్ సర్వెంట్లపై ఉందనే విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. పథకాల అమలును, వాటి పర్యవేక్షణను మరింత సులభతరం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
రిఫ్రెషర్ కోర్సు పాఠ్యప్రణాళికను ప్రస్తావిస్తూ.. విధాన విశ్లేషణ, డిజిటల్ పరివర్తన, మున్సిపల్ ఆర్థిక వ్యవహారాలు, ప్రజారోగ్యం, సైబర్ భద్రత, విద్య, ప్రభుత్వ కమ్యూనికేషన్ వంటి అంశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అధికారుల కమ్యూనికేషన్ బాధ్యతలు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కమ్యూనికేషన్‌లో ప్రజా సమాచార ప్రసారం కూడా భాగంగా ఉండాలని ఆయన సూచించారు.
బాధ్యతాయుతమైన పాలనకు సమర్థవంతమైన కమ్యూనికేషన్ అత్యవసరమైందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రభుత్వ అధికారులు నాలుగు స్థాయిల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు తమ సహచరులతో, రాజకీయ ప్రతినిధులతో, మీడియాతో, సామాన్య ప్రజలతో సమర్థవంతమైన సమాచార మార్పిడి జరపాలని సూచించారు. సోషల్ మీడియా ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత కమ్యూనికేషన్ వాతావరణంలో వివిధ వర్గాలతో సమర్థంగా మాట్లాడే నైపుణ్యాలను అధికారులు అభివృద్ధి చేసుకోవడం మరింత ముఖ్యమని తెలిపారు.
వివిధ రంగాల నుంచి కొత్త ప్రతిభ, కొత్త ఆలోచనలు, కొత్త పని సంస్కృతిని ప్రభుత్వ వ్యవస్థలోకి తీసుకురావడానికి వ్యవస్థీకృత విధానాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. లేటరల్ ఎంట్రీకి అనుసరిస్తున్న వ్యవస్థీకృత విధానం ద్వారా ఇప్పటివరకు సుమారు 63 మంది అధికారులు ప్రభుత్వ సేవల్లోకి వచ్చారని తెలిపారు. అధికారుల వృత్తి ప్రయాణంలో వారికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా.. 15 రోజుల రిఫ్రెషర్ కార్యక్రమాన్ని కెరీర్ మధ్య దశలో నిర్వహించే శిక్షణా కార్యక్రమంగా (మిడ్ కెరీర్ కోర్సు) అభివర్ణించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) వంటి సంస్థల సేవలను మరింత విస్తరించడంతో పాటు, ఇదే తరహా లక్ష్యాలతో పనిచేస్తున్న ఇతర సంస్థలు, ఏజెన్సీలతో వాటిని అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజాప్రతినిధ్య సంస్థల వరకు ఈ కార్యక్రమాల పరిధిని విస్తరించవచ్చని తెలిపారు. కార్పొరేటు, ప్రైవేటు రంగాల ప్రతినిధుల కోసం కూడా శిక్షణ కోర్సులను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
శిక్షణ కార్యక్రమాలను మరింత మెరుగుపరచడంలో అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. అధికారులు తమ అవసరాలను తెలియజేయాలని, పాఠ్యాంశాలను ఏ విధంగా సవరించవచ్చు, మెరుగుపరచవచ్చనే అంశాలపై సూచనలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు. బోధనా సిబ్బంది, కోర్సు అంశాలపై పారదర్శకమైన, తమ పేరు చెప్పకుండా అభిప్రాయాలను సేకరించే విధానాలు ఉండాలని, దీనివల్ల శిక్షణ కార్యక్రమాలను నిరంతరం మెరుగుపరచవచ్చని సూచించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించిన వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో ఈ కోర్సులో పాల్గొంటున్న అధికారులు రూపశిల్పులుగా కీలక పాత్ర పోషించాల్సి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఒక బహిరంగ, అభ్యసన ధోరణితో స్వీకరించాలని అధికారులకు పిలుపునిచ్చారు. పరిపాలనలో వస్తున్న నిరంతర మార్పుల దృష్ట్యా ప్రజా పరిపాలన రంగానికి నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, పరస్పర చర్చలు అత్యంత ఆవశ్యకమని పేర్కొంటూ కేంద్రమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.




***
(रिलीज़ आईडी: 2300917)
आगंतुक पटल : 8