యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశం, యూత్ సమ్మిట్‌లతో పాటు యువ మంత్రుల సమావేశం
బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్ష పదవీబాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యక్రమాలు
प्रविष्टि तिथि:
17 AUG 2026 9:35PM by PIB Hyderabad
భారత్ 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోంది. ‘‘దృఢశీలత్వం, వినూత్న ఆవిష్కరణలు, సహకారం, నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి’’ అన్న ఇతివృత్తం ఆధారంగా భారత్ తన అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఈ ఇతివృత్తం ‘‘ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం’’, ‘‘మానవతకు అగ్రతాంబూలం’’ ఇచ్చే దృష్టికోణాలకు అనుగుణంగా ఉంది. యువజనుల సహకారాన్ని పొందడం బ్రిక్స్ ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్) ముఖ్య ఆధారాల్లో ఒకటి. ఈ దృష్టికోణాన్ని విస్తరించే ఉద్దేశంతో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ అధీనంలోని యువజన వ్యవహారాల విభాగం బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాన్ని, యూత్ సమ్మిట్‌ను 2026 ఆగస్టు 19, 20 తేదీల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తోంది. ఇవే కాకుండా బ్రిక్స్ యువ మంత్రుల సమావేశాన్ని కూడా ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు.

బ్రిక్స్ అధ్యక్ష పదవి కాలంలో, ‘యువ శక్తి’ని భారత్ తన యువ ఎజెండాకు కేంద్ర స్థానంలో నిలిపింది. ఇది యువత సామూహిక శక్తి, ఆలోచనలు, ఔత్సామిక పారిశ్రామికత్వంతో ముడిపడి ఉంది. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం, దీర్ఘకాలిక ప్రాతిపదికన అభివృద్ధి సాధన దిశగా పయనిస్తుండటంలో యువతీయువకుల పాత్ర చాలా కీలకమని భారత్ గుర్తించింది. బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ నిర్వహించిన అనేక ముఖ్య కార్యక్రమాల్ని ఈ నెలలో నిర్వహించనున్న కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్తాయి.
i. బ్రిక్స్ యువ సమన్వయ సమావేశం: ఈ ఏడాది మార్చి నెల 25న దృశ్య మాధ్యమంలో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ యువ కార్యకలాపాల క్యాలెండరును ప్రారంభించారు. దీంతో పాటు బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తున్న క్రమంలో సహకారానికి ఉద్దేశించిన ఒక కార్యాచరణ ప్రణాళిక (రోడ్‌మ్యాప్)ను కూడా రూపొందించారు.
ii. ‘సర్వ్ బ్రిక్స్: మెరుగైన భవితను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సేవలు’- ఈ కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం లో ఏర్పాటు చేశారు. ఇది స్వచ్చంద సేవను బ్రిక్స్ సభ్య దేశాల్లో ఒక ఉమ్మడి నిబద్ధతగా, పరివర్తన ప్రధాన శక్తి గా నిలిపింది. 2026 ఏప్రిల్ 29 మొదలు జులై 31 మధ్య కాలంలో 10 లక్షల గంటల సేపు స్వచ్ఛంద సేవలను అందిస్తామని భారత్ ఈ సమావేశంలో వాగ్దానం చేసింది. ఈ కార్యక్రమం ‘మై భారత్’ (MY Bharat) వేదికగా భారతదేశ యువతీయువకులు స్వచ్ఛంద సేవకు చొరవ తీసుకొనేటందుకు స్ఫూర్తిని అందించింది. ఇది ఉమ్మడి కార్యాచరణతో పాటు సామాజిక బాధ్యత తాలూకు భావనకు కూడా అద్దం పట్టింది.
iii. బ్రిక్స్ యూత్ ఆంత్రప్రన్యోర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ సమావేశం: ఈ సమావేశాన్ని 2026 మే నెల 20, 21 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించారు. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం.. ఈ రెండిటిలో సహకారాన్ని పెంపొందించడానికి బ్రిక్స్ దేశాల యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ సమావేశ నిర్వహణ ద్వారా ఒక చోటుకు తీసుకువచ్చారు.
iv. బ్రిక్స్ యూత్ థీమాటిక్ సెషన్: ఈ కార్యక్రమాన్ని కూడా దృశ్య మాధ్యమంలో 2026 జూన్ 24న నిర్వహించారు. విద్య, ఔత్సాహిక పారిశ్రామికత్వం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సన్నాహాలు, సమ్మిళిత అభివృద్ధి, యువజన సంక్షేమం, సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ బాధ్యత, ప్రజల మధ్య పరస్పర సహకారం, యువత భాగస్వామ్యాన్ని పెంచడం సహా యువత సహకారానికి ప్రాధాన్యాన్ని ఇచ్చే పలు రంగాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చించారు.
నిరంతరాయ ప్రాతిపదికన చెట్టపట్టాల్ వేసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రస్తుత బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశం రూపంలో మరోసారి తెర మీదకు రానున్నాయి. దీనిలో బ్రిక్స్ సభ్యదేశాల అధికారిక ప్రతినిధులు సంస్థాగత చర్చను ముందుకు తీసుకుపోవడం, బ్రిక్స్ యువత సంయుక్త ప్రకటనను జారీ చేయడం, బ్రిక్స్ యవజన సహకార ప్రాథమిక ప్రణాళికపై ఏకాభిప్రాయాన్ని సాధించడంతో పాటు నిరంతర యువ సహకార ప్రధాన సమన్వయపూర్వక కార్యక్రమాల్ని రూపొందించడానికి కూడా ప్రయత్నిస్తారు.
యూత్ కౌన్సిల్ సమావేశంతో పాటే నిర్వహించే బ్రిక్స్ యువజన శిఖరాగ్ర సదస్సు... బ్రిక్స్ సభ్యదేశాలు, బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు చెందిన యువ నేతలను, నూతన ఆవిష్కర్తలను, స్వచ్ఛంద సేవకులను, మార్పును తీసుకువచ్చే వారిని ఒక చోట సమావేశపరుస్తాయి. ఈ శిఖరాగ్ర సదస్సు ఇతివృత్త ప్రధానమైన చర్చలు, చర్చాగోష్ఠులు, నెట్‌వర్కింగ్ అవకాశాల మాధ్యమం ద్వారా యువతకు తమ ఆలోచనలను పరస్పరం తెలియజేసుకొనేందుకు, పరిష్కారాలను వివరించేందుకు, విస్తృత బ్రిక్స్ ప్రక్రియ పరిధిలో ఆలోచనలకు గాను సిఫార్సులను రూపొందించేందుకు ఒక వేదికను అందిస్తుంది.
బ్రిక్స్ సభ్యదేశాల యువ మంత్రులను, ప్రతినిధి వర్గాల ప్రముఖులను బ్రిక్స్ యువ మంత్రుల సమావేశం ఒక చోటుకు తీసుకొస్తుంది. యువత అభివృద్ధితో ముడిపడిన ప్రాధాన్యాలపై చర్చించడానికీ, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశంతో పాటు బ్రిక్స్ యువజన శిఖరాగ్ర సమావేశ ఫలితాలపై సమీక్షించడానికీ ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, యువ సహకారంపై మంత్రుల స్థాయి సమయుక్త ప్రకటనను ఆమోదించడానికి కూడా మార్గాన్ని ఇది సుగమం చేస్తుంది.
యువత భాగస్వామ్యాన్ని బలపరచడం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు బ్రిక్స్ దేశాలన్నింటిలో బలమైన ప్రజాసంబంధాలను ఏర్పరచడం పట్ల భారత్ నిబద్ధతను భారత్ సారథ్యంలోని బ్రిక్స్ యువజన కార్యక్రమాలు చాటి చెప్పనున్నాయి.
***
(रिलीज़ आईडी: 2300859)
आगंतुक पटल : 4