రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వావలంబన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రక్షణ రంగం ఆధ్వర్యంలోని సైనిక ఆధునికీకరణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి ప్రకటన

प्रविष्टि तिथि: 14 AUG 2026 5:38PM by PIB Hyderabad

ఆత్మనిర్భరత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రక్షణ రంగం ఆధ్వర్యంలోని రక్షణ దళాల ఆధునికీకరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 14 నాడు ఆకాశ్‌వాణి ద్వారా సైనికులను ఉద్దేశించి రక్షణ మంత్రి మాట్లాడారు. గత 12 సంవత్సరాల్లో 'ఆత్మనిర్భర్ భారత్', 'భారత్‌లో తయారీ' వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో వచ్చిన పరివర్తనాత్మక మార్పుల గురించి మాట్లాడుతూ.. భారత్ సొంత భద్రతా అవసరాలను సమర్థవంతంగా తీర్చుకోవడంతో పాటు ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా, నికర రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతోందని ఆయన ఉద్ఘాటించారు.

2014లో కేవలం రూ. 46,000 కోట్లుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 1.78 లక్ష కోట్లకి పెరిగిందని.. గత దశాబ్ద కాలంలో ఇది దాదాపు నాలుగు రెట్లు వృద్ధి చెందిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఘనత రక్షణ రంగంలో వచ్చిన నిర్మాణపరమైన మార్పులకు నిదర్శనమని ఆయన అన్నారు. రక్షణ రంగం మొత్తం ఉత్పత్తిలో రక్షణ రంగ ప్రభుత్వ రంగాలు (డీపీఎస్‌యూ), ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 76 శాతం వాటాను కలిగి ఉండగా ప్రైవేట్ రంగం 24 శాతంగా (గత ఆర్థిక సంవత్సరంలో ఇది 22 శాతంగా ఉండేది) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి ఉన్న ఈ వర్ధమాన భాగస్వామ్యం రక్షణ రంగంలో నిరంతరం మెరుగుపడుతున్న వ్యాపార పరిస్థితిని తెలియజేస్తోందని ఆయన అన్నారు. 

2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీవిత కాల గరిష్ఠ స్థాయి అయిన రూ. 38,424 కోట్లకు చేరాయని.. అంటే 5,500 శాతానికి పైగా వృద్ధ నమోదైందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనత రక్షణ రంగంలో 'ఆత్మనిర్భరత'కు అత్యంత బలమైన నిదర్శనమని ఆయన వివరించారు. “నేడు భారతదేశానికి చెందిన 145 రక్షణ ఎగుమతిదారులు ఉన్నారు. మన ఉత్పత్తులు 80కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2029 నాటికి రూ. 50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని మనం సాధిస్తామనే నమ్మకం నాకుంది” అని ఆయన అన్నారు.

2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.53 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 7.85 లక్షల కోట్లకు పెరిగిందని.. ఇది భవిష్యత్ రక్షణ సాంకేతికతల పట్ల పెరుగుతున్న భారత్ నిబద్ధతకు ప్రతీక అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. "మూలధన వ్యయం రూ. 94,588 కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు పెరిగింది. పరిశోధన, అభివృద్ధి‌పై (ఆర్-డీ) ప్రభుత్వం కూడా గట్టిగా దృష్టి సారిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,283 కోట్లుగా ఉన్న ఆర్-డీ బడ్జెట్ 2026-27 నాటికి 90 శాతం పెరిగి రూ. 29,100 కోట్లకు చేరుకుంది" అని ఆయన వెల్లడించారు.

గడచిన సంవత్సరంలో రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) రూ. 8.75 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్‌లకు 'అవసర ఆమోదం (యాక్సెప్టెన్స్ ఆఫ్ నెస్సెసిటీ)' మంజూరు చేసిందని.. ఇది రక్షణ ఆధునికీకరణపై ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తోందని తెలిపారు. ఈ ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రక్షణ కొనుగోళ్లలో చేపట్టిన ప్రాథమిక సంస్కరణలను ఆయన వివరించారు. ఇందులో భాగంగా కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని రెండు రెట్లు పెంచడం, స్వదేశీకరణను ప్రోత్సహించడానికి రెవెన్యూ మార్గం ద్వారా రూ. 1.25 లక్షల కోట్లకు పైగా విలువైన కొనుగోళ్లను సులభతరం చేసినట్లు పేర్కొన్నారు.

'ఆత్మనిర్భరత' దిశగా సాగుతున్న ప్రయాణంలో రక్షణ దళాల క్రియాశీల భాగస్వామ్యాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. స్వదేశీ యుద్ధనౌకలు, విమానాలు, అధునాతన సైనిక వ్యవస్థలు రక్షణ దళాల సామర్థ్యాలను బలోపేతం చేస్తున్న తరుణంలో భారతదేశపు రక్షణ స్వావలంబన ఊపందుకుంటోందని ఆయన ఉద్ఘాటించారు.

మారుతున్న రక్షణ రంగ పరిణామాల మధ్య భవిష్యత్ యుద్ధ తంత్రాలకు అవసరమైన సాంకేతికతలలో డీఆర్‍డీఓ, రక్షణ దళాలు భారత్‌ను అగ్రగామిగా నిలబెడుతున్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. సంప్రదాయ ఆయుధాలను కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే ఆయుధాలుగా మార్చగల సామర్థ్యం ఉన్న మొట్టమొదటి 'టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్' వ్యవస్థను విజయవంతంగా పరీక్షించటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఎంఐఆర్‍వీ సాంకేతికతతో కూడిన అధునాతన అగ్ని క్షిపణి పరీక్ష మన వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలకు కొత్త కోణాన్ని ఇచ్చింది. దీర్ఘ శ్రేణి ఉపరితల దాడి క్రూయిజ్ క్షిపణి, గగనతలం నుంచి భూతలంపైకి దాడి చేయగల రుద్రమ్-II క్షిపణి, నౌకదల యాంటీ-షిప్ క్షిపణి అయిన ఎస్ఆర్, పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్ వంటి వాటి విజయవంతమైన ప్రయోగాలు భారతదేశపు దాడి సామర్థ్యాలను అపూర్వంగా పెంచాయి" అని ఆయన వ్యాఖ్యానించారు. 

'యాక్టివ్ కూల్డ్ ఫుల్-స్కేల్ స్క్రామ్‌జెట్ కంబస్టర్'ను 1,200 సెకన్లకు పైగా విజయవంతంగా పరీక్షించడం గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘనత హైపర్‌సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయగల దేశాల సరసన భారత్‌ను నిలబెట్టిందని పేర్కొన్నారు. స్వదేశీ దీర్ఘశ్రేణి భూతలం నుంచి గగనతలంలోకి దాడి చేయగల క్షిపణి అయిన 'కుశ’ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించడంతో దేశ వాయు రక్షణ సామర్థ్యాలు మరింత పటిష్ఠమయ్యాయని ఆయన అన్నారు.

రక్షణ సన్నద్ధత, సరిహద్దు ప్రాంతాలతో అనుసంధానాన్ని మెరుగుపరచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు రక్షణ మంత్రి చెప్పారు. దేశంలో లేదా విదేశాలలో ఏదైనా దురదృష్టకరమైన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు సహాయక, పునరావాస కార్యక్రమాలను చేపట్టడంలో ఎల్లప్పుడూ 'మొదట స్పందించేవారిగా’ వ్యవహరిస్తున్న రక్షణ దళాలను ఆయన ప్రశంసించారు.

సేవలో ఉన్న, రిటైర్ అయిన రక్షణ సిబ్బందితో పాటు వారి కుటుంబాల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వారిని గౌరవం, ప్రతిష్ఠ, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా ఆయన అభివర్ణించారు. "గత ఐదేళ్లలో ఈసీహెచ్ఎస్ (ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్) బడ్జెట్ 300 శాతం పెరిగింది. సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి కింద పేదరిక నిర్మూలన ఆర్థిక సహాయం (పెన్యూరీ గ్రాంట్ ) రూ. 4,000 నుంచి రూ. 8,000కి, విద్యా గ్రాంటు రూ. 1,000 నుంచి రూ. 2,000కి.. వివాహ గ్రాంటు రూ. 50,000 నుంచి రూ. 1,00,000కి రెట్టింపు అయ్యాయి. ఈ నిర్ణయాలు మన సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై మన నిబద్ధతను తెలియజేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

రక్షణ దళాల్లో మహిళలకు మరింత ఎక్కువ అవకాశాలు కల్పించడంపై.. జాతీయ భద్రత, దేశ నిర్మాణంలో 'నారీ శక్తి'ని సమర్థవంతంగా ఉపయోగించుకోవటంపై ప్రభుత్వం ఎల్లప్పుడూ దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. "జాతీయ డిఫెన్స్ అకాడమీలో (ఎన్డీఏ) శిక్షణ పొందిన మొదటి మహిళా కేడెట్ల బ్యాచ్ త్రివిధ దళాలలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మనం ఒక చారిత్రాత్మక ఘనతను సాధించాం. ధైర్యం, నాయకత్వం ఏ ఒక్క లింగానికి పరిమితం కావు అనడానికి ఇదే నిదర్శనం. ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసెల్ అయిన 'త్రివేణి'పై త్రివిధ దళాలకు చెందిన మహిళలు మాత్రమే ఉండే బృందం చేపట్టిన ప్రపంచాన్ని చుట్టివచ్చే నౌకాయాన యాత్ర 'సముద్ర ప్రదక్షిణ'.. 'నారీ శక్తి'తో శక్తిమంతమైన నవ భారతదేశానికి ప్రతీకగా నిలుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

79 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సరోజినీ నాయుడు, రాణి గైడెన్లతో పాటు గుర్తించిన, గుర్తించని ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర భారత్‌కు పునాది వేశారని.. నేడు దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించే బాధ్యత రక్షణ దళాలపై ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. "అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మన సైనికుల అచంచలమైన సంకల్పం.. ప్రజలు సురక్షితమైన వాతావరణంలో తమ కలలను సాకారం చేసుకునేలా భరోసా ఇస్తుంది. వారి ధైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. వారి అసమాన సేవలకూ, త్యాగానికీ, అంకితభావానికీ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతి సైనికుడికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

మన జాతీయ గేయం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవం కూడా 2026 సంవత్సరంలోనే రావటంతో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక విశిష్టత ఉందని రక్షణ మంత్రి అన్నారు. "ఈ సందర్భాన్ని ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడం మన అందరి సామూహిక బాధ్యత. ఇది కేవలం ఒక వార్షికోత్సవం మాత్రమే కాదు.. మన సమష్టి స్పృహకు వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి పౌరుడిలో దేశభక్తిని, దేశసేవా భావాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనే నమ్మకం నాకుంది. మనమందరం దేశ నిర్మాణంలో క్రియాశీలక భాగస్వాములుగా మారాలని, మన విధులను అంకితభావంతో నిర్వర్తించడం ద్వారా 'వికసిత్ భారత్' నిర్మాణానికి అర్థవంతమైన తోడ్పాటును అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం" అని అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

***


(रिलीज़ आईडी: 2299648) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil