రైల్వే మంత్రిత్వ శాఖ
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు... రైల్వే మంత్రి నేతృత్వంలో రైల్ భవన్ వేదికగా 'తిరంగా ర్యాలీ'
దేశభక్తిని చాటే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారోద్యమాన్ని ఘనంగా నిర్వహిస్తోన్న భారతీయ రైల్వే
प्रविष्टि तिथि:
14 AUG 2026 6:09PM by PIB Hyderabad
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు, 'రైల్ భవన్' ప్రాంగణంలో నిర్వహించిన 'తిరంగా ర్యాలీ'కి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ నేతృత్వం వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన ఈ ర్యాలీలో... రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో శ్రీ సతీష్ కుమార్, బోర్డు సభ్యులు, డైరెక్టర్ జనరల్స్ (డీజీలు), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త 'హర్ ఘర్ తిరంగా' (ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం) కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న భారతీయ రైల్వే... దేశభక్తి, దేశ గౌరవం, ఐక్యతా స్ఫూర్తిని సంస్థ వ్యాప్తంగా చాటుతోంది. 'వందేమాతరం' గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లోని మూడో దశతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, ఈ విశిష్ట జాతీయ గీతం చారిత్రక, సాంస్కృతిక, జాతీయ ప్రాముఖ్యతను తెలియజేసేలా రైల్ భవన్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా, ఈ నెల 10న రైల్ భవన్‌లో ‘వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానం’ అనే అంశంపై క్విజ్ పోటీనీ నిర్వహించారు. ఈ జాతీయ గీతపు గొప్ప చరిత్ర, చిరస్థాయిగా నిలిచిపోయే వారసత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం అధికారులకు కల్పించింది.
‘దేశభక్తి గీతాలు’ అంశంపై ఈ నెల 11న రైల్ భవన్‌లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా సాగిన సంగీత ప్రదర్శనలు దేశభక్తి స్ఫూర్తిని చాటాయి.
ఈ రోజు జరిగిన వేడుకల్లో భాగంగా, రైల్ భవన్‌లో ‘వందేమాతరం’ సామూహిక గానం నిర్వహించారు.
దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవాల స్ఫూర్తిని చాటడం
భారతీయ రైల్వే ఈ కార్యక్రమాల ద్వారా తన అధికారులు, ఉద్యోగుల్లో దేశభక్తి, జాతీయ గౌరవం, ఐక్యతల స్ఫూర్తిని పటిష్ఠం చేస్తూ... ‘వందేమాతరం’ గీతం చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న వేడుకలు... దేశ వారసత్వాన్ని, ఆధునిక, ప్రగతిశీల భారత్ కోసం తన ఆకాంక్షలను చాటడంలో భారతీయ రైల్వేల సమష్టి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2299640)
आगंतुक पटल : 3