ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యూపీలోని జేవార్‌లో అక్రమ మాదకద్రవ్యాల తయారీ కేంద్రాన్ని ఛేదించిన డీఆర్ఐ.. 30 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ఇద్దరు అరెస్టు


మత్తు పదార్థాల తయారీకి ఉపయోగించే 30 కిలోల ముడి రసాయనాలతో పాటు, పూర్తి స్థాయి యంత్రాలు, పరికరాలు స్వాధీనం

प्रविष्टि तिथि: 13 AUG 2026 8:37PM by PIB Hyderabad

మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ తయారీ, రవాణాలపై చేపట్టిన నిరంతర నిఘాలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు మరో రహస్య డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా, జేవార్ ప్రాంతంలోని ఒక నివాస గృహంలో ఈ అక్రమ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

 

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) సేకరించిన పక్కా సమాచారం ఆధారంగా 2026 ఆగస్టు 9, 10 తేదీల్లో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో దాదాపు 30 కిలోల ఆంఫెటమైన్/ మధ్యంతర డ్రగ్స్ రూపాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు మాదకద్రవ్యాల తయారీకి వినియోగించే దాదాపు 30 కిలోల ప్రికర్సర్ రసాయనాలు,సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ తయారీకి ఉపయోగించే పూర్తి స్థాయి యంత్రాలు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

 

సదరు ప్రాంగణంలో నిర్వహించిన తనిఖీల్లో ఒక పూర్తి స్థాయి రహస్య తయారీ వ్యవస్థ వెలుగు చూసింది. మత్తు కలిగించే పదార్థాల తయారీకి అవసరమైన విద్యుత్‌ కొలిమిలు, గొట్టాలు, శాస్త్రీయ, కొలతల పరికరాలు, రసాయనాలు,తదితర యంత్రాలు, పనిముట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు వివిధ రకాల ప్రికర్సర్ రసాయనాలు, ముడి పదార్థాలు ఉన్న పలు ద్రవ కంటైనర్లను, వేర్వేరు కంటైనర్లలో నిల్వ ఉంచిన తెల్లటి రంగు పొడి, స్పటికాకార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఫీల్డ్ కిట్‌లతో వీటిని పరీక్షించగా.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్‌) చట్టం 1985 కింద నిషేధించిన ఆంఫెటమైన్ అనే సైకోట్రోపిక్ పదార్థంగా నిర్ధారణ అయ్యింది. 

 

స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు తయారీ పరికరాలు, ఆ ప్రాంగణంలో లభించిన ఆంఫెటమైన్, రసాయనాలను పరిశీలించగా, 1985 ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సైకోట్రోపిక్‌ పదార్థాలను అక్రమంగా తయారు చేసేందుకు ఈ రహస్య తయారీ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ రహస్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఒక విదేశీ పౌరుడితో పాటు అతని భారతీయ మహిళా సహచరిని 1985 ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్టు చేశారు. 

 

ప్రాథమిక దర్యాప్తులో నిందితులు రాత్రి వేళల్లో తయారీ పరికరాలు, ముడి పదార్థాలను ఆ ప్రాంగణానికి తీసుకువచ్చేవారని, అక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సుమారు వారం రోజుల పాటు నిర్వహించేవారని తేలింది. అనంతరం పరికరాలను అక్కడి నుంచి తరలించి, ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసేవారని దర్యాప్తులో వెల్లడైంది. స్థానికులకు అనుమానం రాకుండా ఉండేందుకు రెండు, మూడు నెలల విరామం తర్వాత ఇదే ప్రక్రియను మళ్లీ ప్రారంభించేవారని ప్రాథమిక దర్యాప్తు ద్వారా వెల్లడైంది.

 

అక్రమ మాదకద్రవ్యాల తయారీపై డీఆర్‌ఐ చేపట్టిన ఇటీవలి చర్యలు

 

మాదకద్రవ్యాల రహస్య తయారీకి ఉపయోగించే మౌలిక సదుపాయాలను, అక్రమ తయారీ, రవాణాకు సహకరిస్తున్న వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడంపై డీఆర్‌ఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో గత నెల రోజుల్లోనే డీఆర్‌ఐ మరో మూడు రహస్య మాదకద్రవ్యాల తయారీ కేంద్రాలను ఛేదించింది. గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో మెఫెడ్రోన్ తయారీ కేంద్రాన్ని గుర్తించి, మెఫెడ్రోన్‌తో పాటు పెద్ద మొత్తంలో ముడి రసాయనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సతారాలో అల్ప్రాజోలం, డయాజెపామ్ తయారీ కేంద్రాన్ని గుర్తించి, తయారైన, మధ్యంతర దశలోని సైకోట్రోపిక్‌ పదార్థాలతో పాటు సుమారు 400 లీటర్ల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అలాగే మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ కేంద్రంగా సాగుతున్న ట్రామడాల్ తయారీ, ఎగుమతి వ్యవస్తను ఛేదించారు. నైజీరియాకు లక్ష ట్రామడాల్ మాత్రలను ఎగుమతి చేసేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించి ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేశారు.

 

వరుసగా చేపట్టిన ఈ చర్యలు ముడి రసాయనాల సమీకరణ, రహస్య ప్రయోగశాలల ఏర్పాటు నుంచి నిధుల సమకూర్చడం, మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, ఎగుమతికి ప్రయత్నించడం వరకు అక్రమ మాదకద్రవ్యాల తయారీకి సంబంధించిన మొత్తం వ్యవస్థను గుర్తించి, నిర్వీర్యం చేయడంపై డీఆర్‌ఐ చూపుతున్న నిరంతర కృషిని తెలియజేస్తున్నాయి. మాదకద్రవ్యాల తయారీ కార్యకలాపాలను దాచడానికి, అధికారుల కంటికి చిక్కకుండా తప్పించుకోవడానికి అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా వ్యవస్థలు అనుసరిస్తున్న అత్యంత అధునాతన, పక్కా వ్యూహాత్మక పద్ధతులను కూడా ఈ ఆపరేషన్లు బహిర్గతం చేస్తున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2299283) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu