వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆర్‌కేవీవై, కేవై పథకాల కింద రాజస్థాన్, తెలంగాణలకు భారీ ఆర్థిక సహాయానికి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం
రాజస్థాన్‌కు రూ. 340.59 కోట్లు, తెలంగాణకు రూ. 265.12 కోట్ల సహాయం
వ్యవసాయ పథకాలకు కొత్త ఊపు: తెలంగాణలో రైతు గుర్తింపు కార్డు, ఎరువుల విధానానికి ప్రశంస
రాజస్థాన్‌లో కేసీసీపై మరింత దృష్టి సారించాలని పిలుపు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శనంలో రైతుల సంక్షేమం కోసం రాష్ట్రాలకు సాధ్యమైన మేరకు అన్ని విధాలుగా మద్దతు: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
प्रविष्टि तिथि:
13 AUG 2026 4:28PM by PIB Hyderabad
'ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన' (పీఎంఆర్‌కేవీవై), 'కృషోన్నతి యోజన' కింద రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల కోసం భారీ ఆర్థిక కేటాయింపులకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని పురోగతి, వ్యయ వివరాలు, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని... రాజస్థాన్‌కు రూ. 340.59 కోట్లు, తెలంగాణకు రూ. 265.12 కోట్లు కేటాయించారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ అనుసరిస్తున్న నూతన విధానాన్ని శ్రీ చౌహాన్ అభినందించారు. వ్యవసాయ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న రాజస్థాన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి... 'కిసాన్ క్రెడిట్ కార్డుల' స్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కిరోరి లాల్ మీనా, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావులతో భోపాల్ నుంచి శ్రీ చౌహాన్ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 'పీఎం ఆర్‌కేవీవై', 'కృషోన్నతి యోజన' అను రెండు ప్రధాన వ్యవసాయ పథకాల కింద... ఆయా రాష్ట్రాలకు కీలక ఆర్థికపరమైన ఆమోదాలను మంజూరు చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అతీష్ చంద్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రెండు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల ప్రాజెక్టుల ఆమోద కమిటీ సమావేశాల్లో ఆమోదించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలు, తొలి విడత నిధుల వినియోగం, ఇప్పటివరకు సాధించిన వ్యయ సంబంధిత పురోగతిని సమీక్షించిన అనంతరం కేంద్ర మంత్రి ఈ ఆమోదాలు జారీ చేశారు.
రాజస్థాన్
రాజస్థాన్ కోసం, 2026 ఏప్రిల్ 20న జరిగిన పీఏసీ సమావేశం 2026-27 సంవత్సరానికి గానూ రూ. 849.37 కోట్ల వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా రూ. 509.62 కోట్లు. ఆ తర్వాత, 2026 మే 4న రూ. 216.13 కోట్లతో కూడిన మొదటి 'మదర్ శాంక్షన్' (ప్రధాన మంజూరు) జారీ చేశారు. ఇప్పటి వరకు, రాష్ట్రం రూ. 164.39 కోట్లు ఖర్చు చేసింది. ఇది మొదటి మంజూరు మొత్తంలో 76.06 శాతానికి సమానం. శ్రీ చౌహాన్ ఆమోదంతో ప్రస్తుతం రాజస్థాన్‌కు మొత్తం రూ. 340.59 కోట్లు కేటాయించారు. ఇందులో ఆర్‌కేవీవై కింద రూ. 216.12 కోట్లు, కేవై కింద రూ. 124.47 కోట్లు ఉన్నాయి.
తెలంగాణ
తెలంగాణకు సంబంధించి, 2026 ఏప్రిల్ 27న జరిగిన పీఏసీ సమావేశం 2026-27 సంవత్సరానికి గానూ రూ. 651.06 కోట్ల వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా రూ. 390.63 కోట్లు. దీనికి సంబంధించి 2026 మే 12న రూ. 157.65 కోట్లతో మొదటి 'మదర్ శాంక్షన్' (ప్రధాన మంజూరు) జారీ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రం రూ. 96.05 కోట్లు ఖర్చు చేసింది. ఇది మంజూరైన మొత్తంలో 60.93 శాతానికి సమానం. వ్యయ పురోగతిని పరిగణనలోకి తీసుకుని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం మేరకు, తెలంగాణకు ప్రస్తుతం మొత్తం రూ. 265.12 కోట్లు కేటాయించారు. ఇందులో ఆర్‌కేవీవై కింద రూ. 157.66 కోట్లు, కేవై కింద రూ. 107.46 కోట్లు కేటాయించారు.
రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ అనుసరిస్తున్న నూతన విధానాన్ని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని అభినందించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థంగా సేవలందించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
నూనె గింజలు, పప్పుధాన్యాల మిషన్ల కింద తెలంగాణ చేస్తున్న వ్యయం షెడ్యూల్ కంటే వెనకబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ మిషన్ల అమలు పురోగతిని, వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలో వ్యవసాయ సమగ్ర అభివృద్ధికి సంబంధించి శ్రీ చౌహాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు సకాలంలో, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రుణ సదుపాయం అందేలా చూసేందుకు 'కిసాన్ క్రెడిట్ కార్డ్' వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాలను సకాలంలో, సమర్థంగా అమలు చేయడమే ఈ ఆర్థిక ఆమోదాల లక్ష్యమని శ్రీ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, మార్గదర్శనంలో కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా వనరులు, సాంకేతిక సహాయం, పర్యవేక్షణను బలోపేతం చేయడానికి రాష్ట్రాలతో కలిసి సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక కేటాయింపులు రెండు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఉత్పాదకత పెంపు, ఉత్పాదక మద్దతు, రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యకలాపాలను వేగవంతం చేస్తాయని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ నిధుల విడుదల... రాష్ట్ర స్థాయిలో పథకాల అమలును వేగవంతం చేస్తుందని, వాటి ప్రయోజనాలు రైతులకు మరింత సమర్థంగా చేరవేస్తుందని శ్రీ చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 2299098)
आगंतुक पटल : 13