వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం దిశగా చర్చల కోసం విధానపరమైన నిబంధనలు ఖరారు: టీవోఆర్ కుదుర్చుకున్న భారత్ - దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్ (ఎస్ఏసీయూ)
సమతౌల్య, సమాన భారత్ - ఎస్ఏసీయూ వాణిజ్య ఒప్పందం కోసం పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఎస్ఏసీయూ ప్రాంతంలో అందుబాటు వ్యయంతో ఔషధాలు, ఐటీ ప్రతిభావంతులు, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ అనుసంధానానికి భారత్ దోహదం: శ్రీ గోయల్
వస్తు వాణిజ్యం, మార్కెట్ ప్రవేశం, మౌలిక నియమాలు సహా 8 అధ్యాయాలపై చర్చలు: వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్
प्रविष्टि तिथि:
12 AUG 2026 9:36PM by PIB Hyderabad
ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం (పీటీఏ) దిశగా చర్చల కోసం విధానపరమైన నిబంధనలపై (టీవోఆర్) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భారత్, దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్ (ఎస్ఏసీయూ) ఈ రోజు సంతకం చేశాయి. భారత్ - ఎస్ఏసీయూ సభ్యదేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ఇదొక కీలక ముందడుగు.
భారత్ - దక్షిణాఫ్రికా కస్టమ్స్ యూనియన్ (ఎస్ఏసీయూ) మధ్య ఒక సమతౌల్య, న్యాయబద్ధ, సమాన వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మార్కెట్ విస్తృతికీ, ఇరుపక్షాల సమృద్ధికీ విస్తృతమైన అవకాశాలను సృష్టించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఎస్ఏఎస్‌యూ ప్రాంతంలో అందుబాటు ధరలకు ఔషధాలను సరఫరా చేయడంలోనూ, ఐటీ రంగంలో కొత్త ప్రతిభావంతుల అభివృద్ధికి దోహదపడడంలోనూ భారత్ కీలక పాత్ర పోషించగలదని శ్రీ గోయల్ పేర్కొన్నారు. వ్యాపార పోటీతత్వం ఉన్న రంగాల్లోనూ, నైపుణ్యాలనూ, ప్రతిభనూ అభివృద్ధి చేసుకోగల లేదా అవి ఇప్పటికే అందుబాటులో ఉన్న రంగాల్లోనూ.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ఎస్ఏసీయూ దేశాలను అనుసంధానించడంలో కూడా భారత్ సహాయపడగలదని శ్రీ గోయల్ తెలిపారు.
సమాన భాగస్వామ్యం ప్రాతిపదికగా దక్షిణాఫ్రికాతో భారత్ సంబంధాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయనీ, అవి వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదనీ మంత్రి పేర్కొన్నారు. దేశ స్మృతిపథంలో దక్షిణాఫ్రికాకు ప్రత్యేక స్థానముందని గుర్తుచేస్తూ.. ‘‘దక్షిణాఫ్రికాతో భారత్ బంధం వాణిజ్యంతోనే మొదలుకాలేదు. అది అంతరాత్మ ప్రేరణతో మొదలైంది’’ అన్నారు. మహాత్మాగాంధీని స్మరించుకుంటూ.. వర్ణవివక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దక్షిణాఫ్రికా ప్రజలకు భారత్ మద్దతునిచ్చిన విషయాన్నీ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ఇంజినీరింగ్ వస్తువులు, యంత్రాలు, ఆటోమొబైల్స్, ఔషధాలు, జౌళి, వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ రంగాల్లో విశేషమైన పరస్పర సహకారంతో... ఇప్పటికే వ్యవస్థితమై ఉన్న వాణిజ్య సంబంధానికి ప్రాధాన్యతా మార్కెట్ ప్రవేశాన్ని కల్పించడం ఈ చర్చల లక్ష్యమని శ్రీ గోయల్ తెలిపారు. చర్చా బృందాలు అత్యవసరంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ - ఎస్ఏసీయూ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసే దిశగా... అంగీకారం కుదిరిన విధివిధానాలను ఒక నిర్దిష్ట ప్రక్రియగా మలచాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. “ఈ రోజు మన సంతకాలొక్కటే ఏ సుంకాన్నీ తగ్గించబోవు లేదా ఏ ఒక్క కంటైనరుకూ అనుమతి ఇవ్వలేవు. తుది ఒప్పందం వల్లే అది సాధ్యమవుతుంది’’ అని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎస్ఏసీయూ ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధివిధానాల ఖరారును నమీబియా ప్రభుత్వ అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య మంత్రిత్వశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిదీతా ఎంగిపొందోకా- రొబైతీ స్వాగతించారు. ఎస్ఏసీయూ - భారత్ సంబంధాలకు అధికారిక గుర్తింపునివ్వడంలోనూ, మున్ముందు చర్చలకు ఒక నిర్మాణం, పారదర్శకత, కచ్చితత్వాన్ని కల్పించడంలోనూ కీలక ప్రస్థానంగా దీనిని అభివర్ణించారు. వ్యూహాత్మక భాగస్వామిగా, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి మూలాధారంగా భారత్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ... వాణిజ్యం, పెట్టుబడులు, సామర్థ్యాభివృద్ధి, అభివృద్ధిలో సహకారం ద్వారా భారత్ - ఆఫ్రికా మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాలను ఆమె ప్రస్తావించారు. సమతౌల్యంతో కూడిన ఫలితానికి ఎస్ఏసీయూ అమితంగా ప్రాధాన్యమిస్తుందనీ, అన్ని పక్షాల మధ్య వివిధ అభివృద్ధి స్థాయులనూ పరిగణనలోకి తీసుకుంటుందనీ ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు, చిన్న - బలహీన ఆర్థిక వ్యవస్థలు సహా ఎస్ఏసీయూ సభ్యదేశాల ప్రయోజనాలనూ, అభివృద్ధి అవసరాలనూ పరిగణిస్తుందని స్పష్టం చేశారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని వాణిజ్య విభాగం కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్ సమావేశాన్నుద్దేశించి ప్రసంగించారు. ఆఫ్రికా ప్రాంతంలో భారత్ కుదుర్చుకున్న మొదటి విధివిధాన చర్చా ఒప్పందం ఇదేనని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన కస్టమ్స్ యూనియన్‌గా ఎస్ఏసీయూ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. వస్తు వాణిజ్యం - మార్కెట్ ప్రవేశం, మౌలిక నియమాలు - మౌలిక ప్రక్రియలు, సుంకాల ప్రక్రియ - వాణిజ్య సౌలభ్యం, ద్వైపాక్షిక భద్రతా యంత్రాంగం సహా వాణిజ్య ఉపశమన మార్గాలు, పారిశుధ్య - వృక్ష ఆరోగ్య రక్షణ చర్యలు, వాణిజ్యానికి సాంకేతిక అవరోధాలు, వివాదాల పరిష్కారం, చట్టపరమైన - సమాంతర నిబంధనలు సహా 8 కీలకమైన అధ్యాయాలు ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం పరిధిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇరుపక్షాలకూ లాభదాయకమైన వాణిజ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ, సమతౌల్య, పరస్పర శ్రేయోదాయకమైన, అభివృద్ధి ప్రాతిపదికగా ఉన్న ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలోనూ భారత్ - ఎస్ఏసీయూ ఉమ్మడి నిబద్ధతకు ఈ విధివిధానాల ఖరారుకావడమే నిదర్శనం.
***
(रिलीज़ आईडी: 2298845)
आगंतुक पटल : 4