మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు
प्रविष्टि तिथि:
12 AUG 2026 4:53PM by PIB Hyderabad
విద్య… రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు (హెచ్ఈఐలు), పాఠశాలల నిర్వహణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర, యూటీ ప్రభుత్వాలపై ఉంటుంది.
విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు (సీహెచ్ఈఐలు) అన్నీ కేంద్ర పార్లమెంటరీ చట్టాల ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థలు. ఇవి ఆయా చట్టాలు, నిబంధనలు, ఆర్డినెన్సులు, నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. స్వయంప్రతిపత్తి గల ఈ సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాలు ఆయా సంస్థల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. నియామక అధికారాలు సంబంధిత బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి.
రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు ఆయా రాష్ట్రాల్లోని చట్టాల ద్వారా ఏర్పాటవుతాయి. వాటిలోని ఖాళీలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలే భర్తీ చేస్తాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఖాళీల వివరాలు కేంద్ర పరిధిలో ఉండవు.
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) సలహా మేరకు 1956లోని యూజీసీ చట్టం సెక్షన్-3 ద్వారా ఒక సంస్థను డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. యూజీసీ (సంస్థలను డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాలుగా ప్రకటించటం) నిబంధనలు-2023 ప్రకారం ఈ డీమ్డ్ విశ్వవిద్యాలయాలను యూజీసీ నియంత్రిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (ఉపాధ్యాయులు, ఇతర విద్యా సిబ్బంది నియామకానికి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణకు ఇతర చర్యలు) నిబంధనలు-2018కి అనుగుణంగా సెలక్షన్ కమిటీ సిఫార్సు మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యాపక సిబ్బందిని, ఇతర పోస్టులను భర్తీ చేస్తుంది.
ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయటం నిరంతర ప్రక్రియ. పదోన్నతి, పదవీ విరమణ, రాజీనామా, మరణం, కొత్త సంస్థలు, పథకాలు, ప్రాజెక్టుల ఏర్పాటు, విద్యార్థుల సంఖ్య పెరగటం, అప్పటికే ఉన్న సంస్థల సామర్థ్యాన్ని విస్తరించటం వంటి అదనపు అవసరాల వల్ల ఖాళీలు ఏర్పడతాయి.
కేంద్రీయ నిధులు పొందే ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యమైన అధ్యాపకులను నియమించేందుకు పలు చర్యతలను చేపట్టారు. వీటిలో సంవత్సరం పొడవునా బహిరంగ ప్రకటనలు ఇవ్వటం, సెర్చ్-కమ్-సెలక్షన్ పద్ధతుల ద్వారా నియామకం, ప్రత్యేక నియామక డ్రైవ్, మిషన్ మోడ్ నియామకం, పూర్వ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులను ఆహ్వానించటం వంటివి ఉన్నాయి. పారదర్శక రీతిలో దరఖాస్తులను ఆహ్వానించటం ద్వారా పలు దశల్లో, పటిష్ఠమైన స్క్రీనింగ్ ప్రక్రియల ద్వారా అధ్యాపక నియామక ప్రక్రియలను సీహెచ్ఈఐలు నిర్వహిస్తాయి. నియామకాల్లో పారదర్శకతను, విద్యాపరమైన కఠిన ప్రమాణాలను నిర్ధారించేందుకు, వివిధ స్థాయిల అధ్యాపకుల నియామకానికి బాధ్యత వహించే అధికారాలు, స్వతంత్ర సబ్జెక్ట్ నిపుణులు, విజిటర్ నామినీలు మొదలైన వారి వివరాలను ఆయా సంస్థల చట్టాలు, నిబంధనలు స్పష్టంగా పేర్కొంటాయి. అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు, ప్రకటనలు, ఉద్యోగాలను తెలిపేందుకు వీలుగా యూజీసీ సీయూ-చయాన్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది మొత్తం నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్ఈఐలు) విద్య నాణ్యతను మెరుగుపరచటంపై జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 దృష్టి సారించింది. ఇందుకోసం వివిధ దశల్లో విద్యను ప్రోత్సహించటం, విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంపొందించటం, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించటం, మౌలిక వసతుల నాణ్యతను మెరుగుపరచటం, ఉపాధ్యాయులకు సమర్థవంతమైన, నాణ్యమైన శిక్షణ ఇవ్వటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది.
విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే సంస్థల్లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఉన్నత విద్యను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రుసా), ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం ఉషా) పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం ఆర్థికంగా మద్దతిస్తుంది. బోధనా నాణ్యతను మెరుగుపరిచేందుకు, సంస్థాగత పనితీరును బలోపేతం చేసేందుకు ఉన్నత విద్యా సంస్థల్లో మెరుగైన విద్యా ఫలితాలను ప్రోత్సహించేందుకు మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఎంఎంటీటీపీ)ను 2023లో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. 151 మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ (ఎంఎంటీటీసీల) ద్వారా ఈ కార్యక్రమం అమలవుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 లక్షలకుపైగా అధ్యాపకులు దీని ద్వారా శిక్షణ పొందారు.
తమ సంస్థల్లోని బ్యాక్‌లాగ్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్ని సీహెచ్ఈఐలను విద్యా మంత్రిత్వశాఖ 2021 ఆగస్టులో అభ్యర్థించింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులతో (ఓబీసీలు) సహా ఖాళీలను భర్తీ చేయటానికి సీహెచ్ఈఐలు ప్రత్యేక నియామక డ్రైవ్‌లను చేపట్టాయి. అలాగే 2022 సెప్టెంబరులో అన్ని ఖాళీలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని సీహెచ్ఈఐలను విద్యామంత్రిత్వశాఖ కోరింది. తిరిగి 2025 అక్టోబరులో బ్యాక్‌లాగ్ ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అన్ని సీహెచ్ఈఐలను విద్యా మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. ఖాళీలను భర్తీ చేయటానికి 2022 సెప్టెంబరు నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో (సీయూలు) సహా అన్ని సీహెచ్ఈఐలు నియామక ప్రక్రియలను చేపట్టాయి. 23.05.2026 (అంటే చివరి రోజ్‌గార్ మేళా నిర్వహించిన తేదీ) వరకు అన్ని సీహెచ్ఈఐలు కలిసి మొత్తం 32,114 పోస్టులను భర్తీ చేశాయి. వాటిలో 18,757 అధ్యాపక నియామకాలు కూడా ఉన్నాయి.
ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయమంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఇవాళ రాజ్యసభలో రాతపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2298501)
आगंतुक पटल : 11