అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

స్వావలంబన, అంతర్జాతీయ పోటీతత్వంతో కూడిన అణు ఇంధన వ్యవస్థ కోసం ప్రభుత్వ ప్రణాళికను లోక్‌సభలో వెల్లడించిన డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో ఎస్ఎంఆర్‌లు, థోరియం దిశగా స్వదేశీ అణు ఇంధన సామర్థ్యాన్ని వేగవంతం చేస్తున్న భారత్: డాక్టర్ జితేంద్ర సింగ్

2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ లక్ష్యం, స్వదేశీ ఎస్ఎంఆర్‌లు, మూడు దశల అణు కార్యక్రమం గురించి వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్

శాంతి చట్టం, దేశీయ తయారీ, అధునాతన రియాక్టర్ సాంకేతికతల ద్వారా అణు రంగంలో స్వావలంబనను పటిష్టం చేస్తున్న ప్రభుత్వం

తదుపరి తరం అణు సామర్థ్యాల విస్తరణలో భాగంగా 2033 నాటికి కనీసం అయిదు స్వదేశీ చిన్న మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుకు భారత్ నిర్ణయం

నాడు పోస్టు చేయడమైనది: 12 AUG 2026 3:20PM by PIB Hyderabad

అధునాతన రియాక్టర్ సాంకేతికతలు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్), దేశీయ తయారీ సామర్థ్యాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం,  దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం వనరులను దీర్ఘకాలికంగా వినియోగించడంపై దృష్టి సారిస్తూ స్వదేశీ అణు ఇంధన వ్యవస్థను మన దేశం క్రమంగా బలోపేతం చేస్తోందని సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

భారత దీర్ఘకాలిక అణు ఇంధన వ్యూహం మూడు దశల అణు విద్యుత్‌ కార్యక్రమం ఆధారంగా  కొనసాగుతోందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. దేశంలోని విస్తారమైన థోరియం నిల్వలను సుస్థిరంగా వినియోగించుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఇంధన భద్రత సాధించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2047 నాటికి అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో 2025–26 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అణు ఇంధన మిషన్‌ తో ఈ వ్యూహానికి మరింత ఊతం లభించిందని చెప్పారు.

అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని వేగంగా పెంచేందుకు ప్రభుత్వం రెండు విధానాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గ్రీన్‌ఫీల్డ్‌ ప్రదేశాల్లో 700 మెగావాట్ల ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లు (పీహెచ్డబ్ల్యూఆర్ఎస్) వంటి భారీ స్వదేశీ రియాక్టర్లతో పాటు అధునాతన రియాక్టర్‌ డిజైన్లను ఏర్పాటు చేయనున్నారు. బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రదేశాల్లో కూడా చిన్న మాడ్యులర్‌ రియాక్టర్ల (ఎస్ఎంఆర్ఎస్) అభివృద్ధి, ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. దశలవారీగా మూసివేస్తున్న శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు, అధిక ఇంధన అవసరమున్న పరిశ్రమల కోసం క్యాప్టివ్‌ ప్లాంట్లు, మారుమూల ప్రాంతాల్లో గ్రిడ్‌కు అనుసంధానం లేని విద్యుత్‌ అవసరాలు వంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.

అణుు ఇంధన మిషన్‌ కింద 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ చిన్న మాడ్యులర్‌ రియాక్టర్లను అభివృద్ధి చేసి, అమల్లోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా ఉంది. అణు ఇంధన శాఖకు అనుబంధ సంస్థ అయిన భాభా అణు పరిశోధనా కేంద్రం (బీఏఆర్కే) విద్యుత్‌ ఉత్పత్తి కోసం 220 మెగావాట్ల భారత్‌ స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్‌ (బీఎస్ఎంఆర్-200), 55 మెగావాట్ల ఎస్ఎంఆర్-55 సహా స్వదేశీ ఎస్ఎంఆర్  సాంకేతికతల రూపకల్పన, అభివృద్ధి చేపడుతోంది. బార్క్‌ గరిష్ఠంగా 5 మెగావాట్ల థర్మల్‌ సామర్థ్యం కలిగిన హై టెంపరేచర్‌ గ్యాస్‌ కూల్డ్‌ రియాక్టర్‌ (హెచ్టీజీసీఆర్)ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనిని తగిన థర్మోకెమికల్‌ సైకిల్‌తో అనుసంధానం చేసి హైడ్రోజన్‌ ఉత్పత్తికి వినియోగించవచ్చు.

భారత్‌ అణు విద్యుత్‌ కార్యక్రమంలోని రెండో దశను ముందుకు తీసుకెళ్లడంలో ఇందిరా గాంధీ అణు పరిశోధనా కేంద్రం (ఐజీసీఏఆర్) కొనసాగిస్తున్న కృషిని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్‌ ప్రస్తావించారు. సోడియం కూల్డ్‌ ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లు, వాటికి అనుబంధ క్లోజ్డ్‌ ఫ్యూయల్‌ సైకిల్‌ సదుపాయాల కోసం ఐజీసీఏఆర్‌ బహుళ విభాగాల శాస్త్రీయ పరిశోధన, అధునాతన ఇంజినీరింగ్‌ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఈ సాంకేతికతలు భారత్ దీర్ఘకాలిక అణు వ్యూహానికి కీలక పునాదిగా ఉన్నాయని పేర్కొన్నారు.

భారత్‌లో విస్తృతమైన దేశీయ అణు ఇంధన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ,  అణు రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విస్తృత భాగస్వామ్యానికి వీలు కల్పించేలా శాంతి (సస్టైనబుల్‌ హార్నెసింగ్‌ అండ్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా - శాంతి) చట్టం–2025ను అమల్లోకి తీసుకొచ్చినట్లు డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.

అణు ఇంధన శాఖ కొత్త ఎస్ఎంఆర్‌ సాంకేతికతలకు సంబంధించి విజ్ఞాన భాగస్వామ్యం, సాంకేతిక సహకారం ద్వారా భారతీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. దేశీయ అణు పరికరాల సరఫరాదారులను పెంచడంతో పాటు, ప్రైవేటు రంగంలో పరిశోధన,అభివృద్ధి  వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది. రియాక్టర్‌ ప్రెజర్‌ వెసల్స్‌ కోసం అవసరమైన లో-అల్లాయ్‌ స్టీల్‌ ఫోర్జింగ్స్‌, రియాక్టివిటీ కంట్రోల్‌ డ్రైవ్‌ మెకానిజమ్స్‌ వంటి కీలక పరికరాలను ఇప్పటికే దేశీయ పరిశ్రమల ద్వారా తయారు చేయగలిగామని, ఇతర కీలక పరికరాల అభివృద్ధిని కూడా దేశీయ పరిశ్రమలు, అంకుర సంస్థలతో కలిసి ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

శాంతి చట్టం కింద చేపట్టిన సంస్కరణలు అణు పరికరాల తయారీ, ఇంజినీరింగ్‌ సేవలు, పరిశోధన, సరఫరా వ్యవస్థల్లో ప్రైవేటు సంస్థల విస్తృత భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తాయి. అణు భద్రత, రక్షణ, ప్రామాణికాల విషయంలో కఠిన ప్రమాణాలను కొనసాగిస్తాయి. అణుు ఇంధన నియంత్రణ మండలి (ఏఈఆర్బీ)కి ఈ చట్టం చట్టబద్ధ హోదాను కల్పిస్తుంది. తద్వారా పటిష్టమైన నియంత్రణ పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

థోరియం గురించి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ, భారత్‌ క్లోజ్డ్‌ ఫ్యూయల్‌ సైకిల్‌ ఆధారంగా మూడు దశల అణు విద్యుత్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని,  ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని యురేనియం వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలను దశలవారీగా వినియోగంలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. థోరియం ఒక ఫెర్టైల్‌ పదార్థం కావడంతో, ఇంధన ఉత్పత్తికి నేరుగా ఉపయోగించలేమని తెలిపారు. అణు రియాక్టర్‌లో థోరియంను ముందుగా ఫిషైల్‌ యురేనియం-233గా మార్చిన తర్వాతే దాన్ని విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించవచ్చని వివరించారు.

మొదటి దశలో సహజ యురేనియాన్ని ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. అనంతరం వినియోగించిన ఇంధనాన్ని పునఃశుద్ధి చేసి అందులోని ప్లుటోనియాన్ని వెలికితీస్తారు. రెండో దశలో ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లు ప్లూటోనియాన్ని వినియోగించి అదనపు ఫిషైల్‌ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. మూడో దశలో తగిన స్థాయిలో ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్ల సామర్థ్యం ఏర్పడిన తర్వాత థోరియం నుంచి ఉత్పత్తి చేసే యురేనియం-233 ద్వారా థోరియం వనరులను పెద్ద ఎత్తున వినియోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

థోరియం వినియోగానికి సంబంధించి భారత్‌ ఇప్పటికే నిరంతర పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం పనిచేస్తున్న పీ హెచ్ డబ్ల్యూఆర్ ల ప్రారంభ  భాగాల్లో  థోరియం ఆక్సైడ్‌ (థోరియా) పిల్లెట్లను ఉపయోగించారు. బార్క్  పరిశోధనా రియాక్టర్లలో థోరియా ఆధారిత ఇంధనంపై ప్రయోగాలు నిర్వహించారు. రేడియేషన్‌కు గురైన థోరియా ఇంధన పిన్లను రీప్రాసెసింగ్‌ చేసి యురేనియం-233ను వెలికితీశారు. అనంతరం ఈ యురేనియం-233ను కల్పక్కంలోని ఐజీసీఏఆర్ లోని కామిని రియాక్టర్‌కు ఇంధనంగా తయారు చేసి వినియోగించారు.

ప్రపంచస్థాయి పోటీతత్వం, స్వయం సమృద్ధి, అధునాతన సాంకేతికతతో కూడిన అణు ఇంధన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఇందులో అణు ఇంధన మిషన్‌ అమలు, స్వదేశీ చిన్న మాడ్యులర్‌ రియాక్టర్ల అభివృద్ధి, దేశీయ అణు పరికరాల తయారీ, సరఫరా వ్యవస్థల బలోపేతం, రియాక్టర్‌ రూపకల్పన, తయారీ, నిర్మాణం, అణు ఇంధన రంగంలో నిరంతర సామర్థ్య పెంపు వంటి చర్యలు ఉన్నాయి.  ఐసోటోప్‌ ప్రొడక్షన్‌ రియాక్టర్‌ (ఐపీఆర్) ద్వారా స్వదేశీ అణు వైద్య మౌలిక వసతులను విస్తరించి, మెడికల్ ఐసోటోపుల దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.

భారత ఇంధన భద్రత, సాంకేతిక స్వావలంబనను బలోపేతం చేసే విస్తృత లక్ష్యంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, అణు సామర్థ్య విస్తరణ, పరిశ్రమల అధిక భాగస్వామ్యం, అధునాతన రియాక్టర్ పరిశోధన,  అణు ఇంధన రంగంలో నిరంతర పెట్టుబడులను ప్రభుత్వం తన విధానంలో సమ్మిళితం చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2298406) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati