వ్యవసాయ మంత్రిత్వ శాఖ
దేశవాళీ వరి రకం కాలానమక్ సాగు
प्रविष्टि तिथि:
11 AUG 2026 5:43PM by PIB Hyderabad
ఇటీవల కాలంలో దేశవాళీ వరి రకం కాలానమక్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగటంతో రైతుల ఆదాయం పెరిగింది. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ఈ రకం వరి ఉత్పత్తి 2018 నుంచి 2025 మధ్య అయిదు రెట్లకుపైగా పెరిగింది. కాలానమక్ బియ్యం విక్రయ ధరల్లోనూ మార్పులు వచ్చాయి. 2018లో కిలో రూ.40 ఉండగా.. 2026 నాటికి కిలో బియ్యం ధర రూ.150కి పెరిగింది. కాలానమక్ వరిని సాగు చేసే రైతుల సంఖ్య 2018లో 2,915 నుంచి 2024 నాటికి 23,000కు చేరుకుంది.
కాలానమక్ వరి సాగు చేసే రైతులకు ఆర్థికంగా, సాంకేతికత పరంగా, మార్కెటింగ్ పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిచ్చాయి. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ), ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ), మార్జిన్ మనీ పథకం (రాష్ట్ర నిధులతో కూడిన) ద్వారా కాలానమక్ ప్రాసెసింగ్, మిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రత్యేక సూక్ష్మ విభాగాలు, ఎఫ్‌పీఓలకు 35 శాతం వరకు (గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు) క్రెడిట్ ఆధారిత మూలధన సబ్సిడీ లభిస్తుంది. కాలానమక్ మహోత్సవాల నిర్వహణ ద్వారా దేశవాళీ వరి వంగడాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) పథకం ద్వారా సిద్ధార్థ్‌నగర్‌లో కాలానమక్ బియ్యం కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆధునిక ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఎగుమతి సౌకర్యాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. కాలానమక్ వరి సాగు, ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది.
కాలానమక్ వరి వంగడాల అభివృద్ధి, పెద్ద ఎత్తున స్థానిక రకాల పరిరక్షణకు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థ పనిచేస్తోంది. సంప్రదాయ దేశవాళీ వరి వంగడాలతో పాటు కాలానమక్ కెఎన్3, బౌనా కాలానమక్ 101, బౌనా కాలానమక్ 102, కాలానమక్ కిరణ్, పూసా నరేంద్ర కాలానమక్ 1, పూసా సీఆర్‌డీ కాలానమక్ 2 అనే ఆరు మెరుగైన రకాలను విడుదల చేశారు. వీటిలో చివరి రెండు పొట్టి రకాలు అధిక దిగుబడినిచ్చే దేశవాళీ రకాలు. సంప్రదాయ రకాలు హెక్టారుకు 2.5 టన్నుల దిగుబడి ఇస్తే.. ఈ పొట్టి రకాలు హెక్టారుకు 4.5 టన్నుల దిగుబడినిస్తాయి. నూతన, అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకునే కాలానమక్ రకాలను విడుదల చేసేందుకు వివిధ ప్రాంతాల్లో పరీక్షించే విధానాలను భౌగోళిక సూచిక (జీఐ) పరిధిలోని కేవీకేల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంప్రదాయ కాలానమక్ వరి వంగడాల రిజిస్ట్రేషన్, సంరక్షణలో ఐసీఏఆర్ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు సహకరిస్తున్నాయి. పంట రకాలు, రైతు హక్కుల ప్రాధికార సంస్థ ద్వారా ఇప్పటివరకు 1700లకు పైగా స్థానిక వరి వంగడాల రిజిస్ట్రేషన్ జరిగింది.
కాలానమక్ వరి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు బ్రీడర్ సీడ్ కార్యక్రమం ద్వారా అదనపు విత్తన డిమాండ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఫౌండేషన్, ధ్రువీకరించిన విత్తనాల ఉత్పత్తికి ఏటా సుమారు 15-20 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. గత అయిదేళ్లలో (2021-22 నుంచి 2025-26) కాలానమక్ వరి వంగడాలకు సంబంధించి మొత్తం 389.6 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి, రైతులకు పంపిణీ చేశారు.
కాలానమక్ బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ మార్కెట్లలో వాటికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా ప్రాంతీయ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్ పీఓలు) నేరుగా అంతర్జాతీయ కొనుగోలుదారులతో అనుసంధానిస్తుంది. దీనిద్వారా సింగపూర్, నేపాల్ వంటి దేశాలకు ఎగుమతులు సులభమయ్యేలా మద్దతినిస్తుంది.
కాలానమక్ వరి రకాన్ని "బుద్ధ రైస్"గా బ్రాండింగ్ చేయటం ద్వారా జపాన్, థాయిలాండ్, వియత్నాం, సింగపూర్, మయన్మార్ వంటి బౌద్ధ దేశాల్లోని అధిక విలువ గల మార్కెట్లే లక్ష్యంగా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకమైన బియ్యం కోసం సిద్ధార్థ్‌నగర్, దాని పరిసరాల్లోని తెరాయ్ జిల్లాలను ఏపీఈడీఏ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వ్యవస్థలో చేర్చారు. ఎగుమతి ప్యాకేజింగ్, రెసిడ్యూ పరీక్ష, క్వారంటైన్ నిబంధనలకు ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక సహాయం అందించటం సులభమవుతుంది.
ఈ సమాచారాన్ని వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ భగీరథ్ చౌదరి లోక్‌సభలో ఇవాళ లిఖితపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2298187)
आगंतुक पटल : 7